వైయస్సార్ జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాల ప్రారంభోత్సవం:
*క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్:*
*రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఒక్క నిరుపేద ఉండకూడదు*
*ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో నిరంతరం కొనసాగే ప్రక్రియ*
*అర్హత ఉండి జాబితాలో లేకపోతే దరఖాస్తు చేయండి*
*వెంటనే తనిఖీ చేసి, అర్హత ఉంటే ఇంటి స్థలం కొనుగోలు*
*90 రోజుల్లో ఇంటి స్థలం మంజూరు. తర్వాత ఇంటి నిర్మాణం*
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్*
*దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం*
*తొలి విడతలో 15.60 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం*
*వచ్చే ఏడాది జూన్ నాటికి ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తి*
*రెండో దశలో 12.70 లక్షల ఇళ్ల నిర్మాణం*
*వచ్చే ఏడాది జూన్‌లో మొదలు. సంవత్సరంలో పూర్తి*
*మొత్తం ఇళ్ల నిర్మాణానికి దాదాపు రూ.51 వేల కోట్లు*
*ఆ నిర్మాణ పర్యవేక్షణకు ప్రత్యేకంగా 4వ జేసీ నియామకం*
*ప్రతి అక్క చెల్లెమ్మకు అన్ని వసతులతో సొంత ఇల్లు*
*ప్రతి ఇంటి విలువ రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలు*
*ఇప్పుడు ఇళ్ల నిర్మాణంతో రాష్ట్రంలో ఎకానమీ బూస్ట్*
*కార్మికులకు, కూలీలకు 21.70 కోట్ల పని దినాలు*
*30 రకాల పని వారికి సొంత ఊళ్లోనే ఉపాధి*
*ఇళ్ల నిర్మాణ ప్రారంభోత్సవంలో సీఎం శ్రీ వైయస్.జగన్*
అమరావతి (ప్రజా అమరావతి);
నవరత్నాలు–పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా, ఇప్పటికే రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన ప్రభుత్వం, వాటిలో పీఎంఏవైతో అనుసంధానం చేసుకుని, తొలి విడతగా 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతోంది. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా సీఎం శ్రీ వైయస్ జగన్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
ఈనెల 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది. తొలి విడతగా రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణం. అన్ని కాలనీలలో రూ.32,909 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పన.
*వైయస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభోత్సవంలో సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రసంగం:*
*పేదవాడి కల నిజం చేస్తున్నాం:*
‘దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఎక్కడా ఉండకూడదని కనీవినీ ఎరగని రీతిలో అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి ఇల్లు కట్టించి ఇస్తున్నాం. సొంత ఇల్లు అన్న పేదవాడి కలను నిజం చేస్తున్నాం. 175 నియోజకవర్గాలలో ఇళ్ల నిర్మాణంలో మొదటి దశ కార్యక్రమానికి ఇవాళ పునాదులు వేస్తున్నాం’.
*వారం పాటు పండగలా:*
‘ఈనెల 10 వరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఇళ్ల నిర్మాణ ప్రారంభ మహోత్సవం ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. ఏ కార్యక్రమం ఇవ్వని సంతృప్తి ఈ కార్యక్రమం ఇస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా దాదాపు 31 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాల ద్వారా స్థిరాస్తి ఇవ్వడమే కాకుండా, ఇళ్లు కూడా కట్టించి ఇస్తున్నాం’.
*28 లక్షల ఇళ్లు. రూ.51 వేల కోట్లు:*
‘రెండు దశల్లో ఈ కార్యక్రమం. తొలి దశ కింద 15.60 లక్షల ఇళ్లు రూ.28,084 కోట్ల వ్యయంతో ఇవాళ నిర్మాణ పనులు మొదలు పెడుతున్నాం. ఏడాదిలో అంటే జూన్ 2022 నాటికి పూర్తి చేసే విధంగా కార్యక్రమం రూపొందించాం. రెండో దశలో 12.70 లక్షల ఇళ్లను రూ.22,860 కోట్లతో వచ్చే ఏడాది జూన్‌లో మొదలు పెడతాం. ఆ విధంగా మొత్తం రూ.50,944 కోట్ల వ్యయంతో 28.30 లక్షల ఇళ్లు జూన్ 2023 నాటికి పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నాం. 30 లక్షల ఇళ్ల స్థలాలు సేకరించడమే కాకుండా, పీఎంఏవైతో వాటిని అనుసంధానం చేసి, ఇళ్ల నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తున్నాం’.
*ఇళ్లు కాదు. ఊళ్లు, పట్టణాలు:*
‘మనం కడుతోంది కేవలం ఇళ్లు కాదు. ఊళ్లు, పట్టణాలు అని చెప్పొచ్చు. ఏకంగా 17 వేల కాలనీలు ఇప్పుడు వస్తున్నాయి. కాలనీల సైజ్ చూస్తుంటే కాలనీలు కాదు. ఊళ్లు. అవి కూడా కాదు. పట్టణాలు అని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. ఇవి కాక సొంత స్థలాలు, పొజిషన్ సర్టిఫికెట్లు ఉన్న లబ్ధిదారులు మరో 4.33 లక్షల మందిని కలుపుకుని మొదటి దశలో మొత్తం 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం’.
*ప్రతి నలుగురిలో ఒకరికి:*
‘ఇవాళ మనం భారీ కార్యక్రమం చేస్తున్నాం. అదెలా అంటే, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా దాదాపు 4.95 కోట్లు. ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కూడా కట్టించి ఇస్తున్నాం. ఒక్కో ఇంట్లో నలుగురు ఉంటారనుకుంటే, మొత్తం 1.24 కోట్ల మందికి మనం ఇళ్లు కట్టించి ఇస్తున్నాం’.
‘అంటే రాష్ట్ర జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి భూమిని, పక్కా ఇంటిని అందజేస్తున్నాం. 1.24 కోట్ల మంది అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే, రాష్ట్రంలోని పెద్దవైన 3 లేక 4 జిల్లాలు అన్న మాట. అంటే అంత జనాభా సైజులో ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు, ఇళ్లు కట్టిస్తున్నాం. ఆ కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం’.
*మౌలిక వసతులకు రూ.33 వేల కోట్లు:*
‘ప్రణాళిక బద్ధమైన గ్రామాలు, పట్టణాలుగా నిర్మితమవుతున్న ఈ 17,005 వైయస్సార్ జగనన్న కాలనీల్లో దాదాపు రూ.4,128 కోట్ల వ్యయంతో తాగు నీరు సరఫరా చేయబోతున్నాం. అదే విధంగా రూ.22,587 కోట్ల వ్యయంతో కాలనీల్లో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ. మరో రూ.4986 కోట్లతో భూగర్భ కేబుళ్లతో విద్యుత్ కనెక్షన్లు. ఇంకా ఇవన్నీ కాకుండా మరో రూ.627 కోట్ల వ్యయంతో భూగర్భ కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించబోతున్నాం’.
‘ఇంకా ఇతర మౌలిక సదుపాయాలు.. పార్కులు, స్కూళ్లు, సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌ల వంటి వాటన్నింటి కోసం మరో రూ.567 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆ విధంగా 17,005 కాలనీల్లో 30 లక్షల ఇళ్లకు అన్ని మౌలిక సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు ఖర్చు చేసి, ప్రతి పేదవాడికి మామూలు ఇల్లు మాత్రమే కాదు. అన్ని మంచి వసతులతో ఇవ్వడం కోసం అడుగులు వేస్తున్నాం. భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్లు, భూగర్భ విద్యుత్ కేబుళ్లు, ఇంటర్నెట్ లైన్ల వంటివన్నీ ఏర్పాటు చేస్తున్నాం’.
*రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలు:*
‘వీటన్నింటి వల్ల నిరుపేదలు కానీ, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కానీ, అగ్ర కులాల్లో ఉన్న పేదలందరికి మనం కాలనీల్లో కట్టిస్తున్న ఇళ్లు పూర్తయ్యే సరికి ఆస్తి విలువ కనీసం రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వారు ఉంటున్న ప్రాంతాన్ని బట్టి విలువ ఉంటుంది’.
*లబ్ధిదారులు కోరుకున్న విధానంలో:*
‘ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు 3 రకాల ఆప్షన్ ఇచ్చాం. వారు ఎంచుకున్న విధానంలో ఇళ్లు నిర్మాణం. ఆరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు ఈ మూడు ఆప్షన్లు వారికి ఇచ్చాం. ఆ మేరకు ఇప్పుడు ఇళ్లు కట్టించి ఇస్తున్నాం’.
*ఆప్షన్–1:*
ఇంటి నిర్మాణ సామాగ్రి ప్రభుత్వం ఇచ్చి, లేబర్ ఛార్జీలు అక్క చెల్లెమ్మలకు ఇస్తున్నాం. వారే ఇల్లు నిర్మించుకుంటారు.
*ఆప్షన్–2:*
ఇంటి నిర్మాణ సామాగ్రి అక్క చెల్లెమ్మలు సొంతంగా తెచ్చుకుని, సొంతంగా నిర్మించుకుంటామంటే, దశల వారీగా పనుల పురోగతిని బట్టి ఆ డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తాం. ఆ విధంగా మీరే సామాను తెచ్చుకోవచ్చు. స్వయంగా ఇళ్లు నిర్మించుకోవచ్చు.
*ఆప్షన్–3:*
అక్క చెల్లెమ్మలు ఇల్లు కట్టుకోలేమంటే, ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకుని ఇల్లు కట్టించడం. ఆ విధంగా అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడతామని చెప్పాం.
‘ఇలా అన్ని రకాల ఆప్షన్లు ఇచ్చి ఇవాళ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం’.
*340 అడుగుల్లో అన్ని వసతులు:*
‘గతంలో కేవలం 200 అడుగులు మాత్రమే ఉంటే ఇవాళ 340 చ.అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు. వరండా, బెడ్రూమ్, హాలు, కిచెన్, బాత్‌రూమ్. రెండు లైట్లు, రెండు ఫ్యాన్లు. 4 ఎల్‌ఈడీ బల్బులు, ఒక సింటెక్స్ ట్యాంక్ కూడా ఇస్తున్నాం’.
*ఎకానమీ బూస్ట్:*
‘తొలి దశలో కడుతున్న 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను బూస్ట్ చేస్తుంది. కోవిడ్ వల్ల చాలా రాష్ట్రాల ఆర్థిక స్థితి పడిపోయింది. జీఎస్‌డీపీలు తగ్గిపోయాయి. ఉత్పత్తి రంగం పడిపోయింది.
కానీ మన దగ్గర ఈ ఇళ్ల నిర్మాణం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ బూస్టప్ అవుతుంది. అది ఎలా అంటే..
– ఈ ఇళ్ల నిర్మాణం కోసం 69.70 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్.
– 7.44 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్.
– 310 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక.
– 233 కోట్ల ఇటుకలు.
– 223 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ వినియోగం.
– ఇంకా ఈ ఇళ్ల నిర్మాణం వల్ల కార్మికులకు 21.70 కోట్ల పని దినాలు.
లభిస్తాయి.
*30 రకాల పని వారికి:*
‘ప్రస్తుతం కోవిడ్‌తో పెద్దగా పని లేకుండా పోయిన తాపీ మేస్త్రీలు, రాడ్ బెండర్లు, కార్పెంటర్లు కూలీలు, ఇటుకల తయారీదారులు, ఎలక్ట్రీషియన్లు.. ఇలా దాదాపుగా 30 రకాల పనులు చేసే వారికి సొంత ఊళ్లలోనే ఉపాధి లభిస్తుంది’.
‘అలాగే ప్రతి ఇంటికి అవసరమైన 20 టన్నుల ఇసుకను దగ్గరలో ఉన్న ఇసుకరీచ్‌ల నుంచి లబ్దిదారులకు ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తున్నాం. ఈ విధంగా ఇళ్ల నిర్మాణంతో ఎకనామిక్ బూస్ట్ వస్తుంది. చాలా మందికి ఉపాధి లభిస్తుంది’.
*తక్కువ ధర. నాణ్యత:*
‘ఇల్లు అందుకుంటున్న అక్క చెల్లెమ్మల మీద ఆర్థిక భారం తగ్గించడానికి మార్కెట్ కంటే నాణ్యమైన ధరకు నిర్మాణ సామాగ్రిని అందించడం జరుగుతోంది. అందు కోసం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాం.
సిమెంట్ ధర తగ్గించి బస్తా కేవలం రూ.225కే అందిస్తున్నాం. అలాగే స్టీల్ కూడా తక్కువ ధరకు, క్వాలిటీ సామాగ్రి ఇచ్చేలా చూశాం. ప్రతి గ్రామంలో, మండల స్థాయిలో గోదాముల నిర్మాణం. ఆ విధంగా మెటేరియల్ అందుబాటులోకి తెచ్చి, ఇవాళ పనులకు శ్రీకారం చుడుతున్నాం’.
*ఇంటి రూపంలో ఆస్తి:*
‘ఇళ్ల నిర్మాణం పూర్తైతే, దాని విలువ ఎంత అని చూస్తే.. ప్రతి ఇంటికి మౌలిక సదుపాయాల కోసం రూ.1.5 లక్షలు. ఇంటి నిర్మాణ వ్యయం రూ.1.80 లక్షలు. ఇక స్థలం రేటు ప్రాంతాన్ని బట్టి రూ.2 లక్షలు మొదలు దాదాపు రూ.7 లక్షల వరకు ఉంది. ఆ విధంగా ఇళ్ల నిర్మాణం మొదలైతే ఒక్కో అక్క చెల్లెమ్మకు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఆస్తిని ఇంటి రూపంలో ఇస్తున్నాం’.
*ఇది నిరంతర ప్రక్రియ:*
‘ఇక్కడ మరో విషయం. మరోసారి చెబుతున్నాం. అర్హత ఉండి లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేకపోతే, సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోండి. అన్నీ పరిశీలించి తప్పనిసరిగా 90 రోజుల్లో మంజూరు చేయడం జరుగుతుంది’.
‘ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ. దరఖాస్తు చేసిన వెంటనే వెరిఫికేషన్. అర్హత ఉందని తేలితే ఇంటి స్థలం కొనుగోలు చేసి 90 రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి చెల్లెమ్మకు జగన్ అన్న తోడుగా ఉన్నాడు. అలాగే ప్రతి అక్కకు ఒక తమ్ముడిగా తోడుగా ఉన్నాడు.
రాష్ట్రంలోనే కాదు, బహుషా దేశంలో కూడా ఊహకు అందని విధంగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం’.
*4వ జాయింట్ కలెక్టర్:*
‘ఈ కార్యక్రమాన్ని కచ్చితంగా విజయవంతం చేయడం కోసం ఈరోజు నుంచి ప్రతి జిల్లాలో 4వ జేసిని నియమిస్తున్నాం. ఇప్పటికే జిల్లాలలో ముగ్గురు జేసీలు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల కోసం ఒక జేసీ, ఆర్బీకేలు, వ్యవసాయం కోసం మరొకరు, ఆసరా సంక్షేమం వంటి వాటి కోసం మరో జేసీ. అలా ఇప్పటికే ముగ్గురు జేసీలు ఉండగా, ఇప్పుడు 4న జేసీని నియమిస్తున్నాం. కేవలం ఈ ఇళ్ల నిర్మాణం కోసం ఒక ఐఏఎస్ అధికారిని 4వ జేసీగా నియమిస్తూ, ఇవాళే ఆదేశాలు ఇస్తున్నాం.
రేపటి నుంచి ఆ జేసీ అందుబాటులో ఉంటారు. వారు ఈ కార్యక్రమాన్ని ఓన్ చేసుకుంటారు. ప్రతిదీ వారు పర్యవేక్షిస్తారు. ఎక్కడా లోటు లేకుండా చూస్తారు’.
*వారికి న్యాయం–ప్రయత్నం:*
‘గొప్ప కార్యక్రమం జరుగుతోంది. దీని వల్ల రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. 3.74 లక్షల అక్క చెల్లెమ్మలకు దురదృష్టవశాత్తూ ఇవాళ న్యాయం చేయలేకపోతున్నాం. వారికి కేటాయించిన స్థలాలపై కొందరు దుర్భుద్దితో కోర్టుల్లో కేసులు వేశారు. అవి పరిష్కరించడం కోసం కొంత సమయం పడుతోంది. కోర్టులకు ప్రస్తుతం సెలవులు. ఈనెల 13న కోర్టులు తెరుస్తారు. అప్పుడు దీన్ని ప్రయారిటీగా తీసుకుని, త్వరితగతిన ఆ 3.74 లక్షల అక్క చెల్లెమ్మలకు న్యాయం చేయడానికి కచ్చితంగా మీ తమ్ముడు, మీ అన్నగా ఉన్న జగన్ అనే వ్యక్తి కచ్చితంగా ప్రయత్నిస్తాడని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాను’.
*చివరగా..*
‘ప్రతి అక్క చెల్లెమ్మకు ఈ కార్యక్రమం ద్వారా దేవుడి దయతో మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, ఆకాంక్షిస్తున్నాను’ అంటూ సీఎం శ్రీ వైయస్ జగన్ తన ప్రసంగం ముగించారు. ఆ తర్వాత వివిధ జిల్లాలలో లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ భరత్‌నారాయణ గుప్తతో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరు కాగా, జిల్లాల నుంచి అధికారులు, లబ్ధిదారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
addComments
Post a Comment