జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక కోసం ప్రత్యేక కూపన్లు

 జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక కోసం ప్రత్యేక కూపన్లు

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


         మైనర్ మినరల్స్ లీజులన్నీ ఈ-ఆక్షన్ ద్వారా కేటాయించేందుకు చర్యలు ,  శాస్త్రీయ విధానంలో మైనింగ్ లీజుల పెంపుదలకు యోచన *  తాడేపల్లి సిపిఆర్ కార్యాలయంలో మైనింగ్పై రాష్ట్ర భూగర్భగనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష *  ఇసుక ఆపరేషన్లు, మినరల్ కన్సెషన్ అప్లికేషన్లు, మైనింగ్ రెవెన్యూపై సమీక్ష * ఇకపై జిల్లాల వారీగా అవుట్సోర్సింగ్ ద్వారా సీనరేజీ కలెక్షన్స్ *  వాల్యూమెట్రిక్ కు బదులు వెయిట్ బేసిస్ లో సీనరేజీ వసూళ్ళకు ప్రణాళిక * మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 ఇకపై జిల్లాల వారీగా అవుట్సోర్సింగ్ ద్వారా మైనింగ్ సీనరేజీ వసూళ్ళను నిర్వహిస్తామని రాష్ట్ర భూగర్భగనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సిఆర్పి కార్యాలయంలో మైనింగ్, ఎపిఎండిసి అధికారులతో ఇసుక ఆపరేషన్లు, మినరల్ కన్సెషన్ అప్లికేషన్లు, మైనింగ్ రెవెన్యూ పెంపుదల పై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 6388 లీజ్ల్లో మైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, వాటన్నింటిని పర్యవేక్షిస్తూ సీనరేజీ వసూళ్ళు చేయడం గనులశాఖకు ఇబ్బందికరంగా మారిందని అన్నారు. ఇదే క్రమంలో అనధికారిక మైనింగ్, అక్రమ రవాణా వల్ల కూడా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నష్టపోతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో మైనింగ్ సీనరేజీ వసూళ్ళకు అనుసరిస్తున్న విధానాలను గనులశాఖ అధికారులు పరిశీలించారని, ఈ మేరకు రాజస్థాన్ రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానం శాస్త్రీయంగా ఉందని నిర్ధారించినట్లు తెలిపారు. దాని ప్రకారం  జిల్లాల వారీ సీనరేజీ వసూళ్ళ బాధ్యతను అవుట్సోర్సింగ్కు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్రంలోని అన్ని మైనర్ మినరల్స్కు ఇది వర్తిస్తుందని అన్నారు. ఈ విధానం వల్ల ప్రస్తుతం వస్తున్న ఆదాయం కన్నా కనీసం 35 నుంచి 40 శాతం ఎక్కువ సీనరేజీ ప్రభుత్వానికి జమ అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మినరల్స్ను తరలించే వాహనాలను ఖచ్చితంగా వేయింగ్ వేయడం ద్వారా సీనరేజీ 10 నుంచి 15 శాతం పెరుగుతుందని, అలాగే అక్రమ మైనింగ్, రవాణాను నియంత్రించగలగడం వల్ల మరో 15 నుంచి 20 శాతం రెవెన్యూ పెరుగుతుందని అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనింగ్ సీనరేజీ ద్వారా ప్రభుత్వానికి రూ.1643 కోట్లు ఆదాయం లభించిందని, ఈ నూతన విధానాలను అమలు చేయడం ద్వారా దీనిపై కనీసం నలబై శాతం అధికంగా రెవెన్యూ వసూలవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

వెయిట్ బేసిస్ సీనరేజీతో అక్రమాలకు చెక్ : మైనింగ్ సీనరేజీ వసూళ్ళకు ఇప్పటి వరకు అనుసరిస్తున్న వాల్యూమెట్రిక్ బేసిస్కు బదులు వెయిట్ బేసిస్ సీనరేజీని అమలు చేయడం ద్వారా శాస్త్రీయంగా సీనరేజీని నిర్ధారించవచ్చని, ఎటువంటి అక్రమాలకు అవకాశం ఉండదని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మైనింగ్ మెటీరియల్ తీసుకువెళ్ళే ప్రతి వాహనంను మైనింగ్ శాఖతో అనుసంధానం చేసిన వేయింగ్ బ్రిడ్జ్ల వద్ద తనిఖీ చేస్తారని, అలాగే ప్రతి వేయింగ్ బ్రిడ్జ్, క్వారీల వద్ద సిసి కెమేరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మైనింగ్ లీజులకు సమీపంలోనే ఏర్పాటు చేసే వేయింగ్ యంత్రాల ద్వారా బరువును నిర్ధారించి, దానికి అనుగుణంగా సీనరేజీని లెక్కిస్తామని అన్నారు. ఈ విధానం అనుసరించే క్వారీలకే ఈ పర్మిట్ ఇస్తామని తెలిపారు.  

మైనర్ మినరల్స్ ఈ ఆక్షన్ ద్వారా రూ.476 కోట్లు ఆదాయం : రాష్ట్రంలో మైనర్ మినరల్స్ ఈ ఆక్షన్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.476 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది అంచనా వేస్తున్నట్లు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే 21,577 హెక్టార్లలో లీజుల కోసం 2,694 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. మైనర్ మినరల్స్ కింద పార్ట్ -ఎ లో గ్రానైట్, మార్బుల్ తో పాటు 31 మైనర్ మినరల్స్ను గుర్తించామని, పార్ట్ - బి కింద అన్ని ఇతర మైనర్ మినరల్స్, పార్ట్ - సి కింద ఇసుకను వర్గీకరించామని వెల్లడించారు. గతంలో అనుమతులు పొంది, దీర్ఘకాలం నుంచి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించకుండా ఉన్న లీజులను కూడా రద్దు చేసి, వాటికి కూడా ఈ-ఆక్షన్ నిర్వహిస్తామని తెలిపారు. 

జగనన్న కాలనీలకు ఉచితంగా ఇసుక : రాష్ట్రంలో గతనెల 17వ తేదీ నుంచి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జెపివిఎల్) శాండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తోందని, ఇందుకు గానూ సెక్యూరిటీ డిపాజిట్గా రూ.120 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జెపివిఎల్ చెల్లించిందని తెలిపారు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సదరు సంస్ధ ఇసుక అమ్మకాలకు సంబంధించిన అడ్వాన్స్ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 305 రీచ్లు ఉండగా, వాటిల్లో 136 రీచ్ల్లో ప్రస్తుతం శాండ్ ఆపరేషన్లు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు (5.6.2021) వరకు 16 లక్షల టన్నుల ఇసుకను జేపీ సంస్థ తవ్వకాలు చేసిందని, దీనిలో 9.28 లక్షల టన్నులు విక్రయించగా, మరో 6.72 లక్షల టన్నుల ఇసుకను వర్షాకాలం కోసం నిల్వ చేశారని అన్నారు. వర్షాకాలం నిర్మాణ అవసరాలకు మరింత ఇసుక నిల్వలను సిద్దం చేసుకోవాలని ఈ సదర్భంగా మంత్రి ఆదేశించారు. జగనన్న కాలనీలకు ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందించనుందని, ఇందుకు గానూ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా కూపన్లను సిద్దం చేసినట్లు తెలిపారు. ఇసుక కొరత ఉన్న విశాఖ, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో ఒకటి నుంచి మూడో స్టీమ్ ఆర్డర్ స్టీమ్ ల నుంచి ఇసుకను మైనింగ్ చేసే ఆలోచన చేస్తున్నామని అన్నారు. ఎక్కడా ఇసుక కొరత లేకుండా, అన్ని రీచ్ల నుంచి ఇసుక తవ్వకాలు, స్టాక్ పాయింట్ల ఏర్పాటును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మైనింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో గనులశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఎపిఎండిసి విసి అండ్ ఎండి,  భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ (డిఎంజి) విజి వెంకటరెడ్డి, ఎపిఎండిసి అధికారులు పాల్గొన్నారు.

Comments