సోమశిల ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యోగ సీనియారిటీ జాబితా పై అభ్యంతరాలుంటే తెలియచేయండి.
*ఈ నెల 7వ తేదీ నుండి 21 వ తేదీ లోపు ఏమైనా అభ్యంతరాలు, సవరణలు ఉంటే దరఖాస్తు చేసుకోండి*
*ప్రస్తుత ఉద్యోగ సీనియారిటీ జాబితాను https://kadapa.ap.gov.in నందు ఉంచడమైనది*
*కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఉన్న సోమశిల ప్రాజెక్టు నిర్వాసితులు తమ పేర్లను వెబ్ సైట్ లో పరిశీలించుకోవచ్చు*
*జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్*
కడప, జూన్ 05 (ప్రజా అమరావతి): సోమశిల ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యోగ సీనియారిటీ జాబితా పై అభ్యంతరాలుంటే ఈ నెల 21వ తేదీ లోపు తెలియచేయాలని జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ అన్నారు.
శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో జేసి ( రెవిన్యూ) గౌతమితో కలసి సోమశిల ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యోగ కల్పన విషయమై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సి. హరికిరణ్ మాట్లాడుతూ సోమశిల ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యోగ కల్పనకు సంభందించి గతంలో 9751 మందితో కూడిన ప్రాథమిక జాబితాను రూపొందించడం జరిగింది. అయితే సోమశిల
ప్రాజెక్టు ముంపు వాసులు చేసిన ఫిర్యాదులను పరిశీలించి, ప్రభుత్వ ఆదేశాల మేరకు సదరు సీనియారిటీ జాబితాలో సవరణలు, మార్పులు చేయాలని నిర్ణయించామన్నారు.
ఇందుకు గాను ప్రస్తుత ఉద్యోగ సీనియారిటీ జాబితాను https://kadapa.ap.gov.in వెబ్ సైట్ నందు ప్రదర్శించామన్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఉన్న సోమశిల ప్రాజెక్టు నిర్వాసితులు తమ పేర్లను వెబ్ సైట్ లో పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు, సవరణలు ఉంటే ఈ నెల 7వ తేదీ నుండి 21 వ తేదీ లోపు నెల్లూరు సోమశిల ప్రాజెక్టు సర్కిల్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ నందు ...కార్యాలయపు పని వేళల్లో దరఖాస్తు చేసుకుని రసీదును పొందవచ్చునన్నారు. సోమశిల నిర్వాసితుల నుండి స్వీకరించిన అభ్యంతరాలు, సవరణలను పరిశీలించి తగు మార్పులు చేసి కొత్తగా సీనియారిటీ జాబితాను రొపొందిస్తా మన్నారు.
ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు సర్కిల్ ఎస్ఈ ఎన్. కృష్ణారావు, స్పెషల్ కలెక్టర్ రామమోహన్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment