ఏ ఒక్క పాఠశాల మూతపడదు

 , ఏ ఒక్క పాఠశాల మూతపడదు


...

ఒక్క ఉపాధ్యాయ పోస్టు రద్దు కాదు...

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

జాతీయ విద్యా విధానంతో రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు

పాఠశాలలకు క్రీడా మైదానాలు లేకుంటే భూముల కొనుగోలు

3వ విడత జగనన్న విద్యా కానుకలో క్రీడల ప్రోత్సాహాకానికి స్పోర్ట్సు కిట్ల అందజేత

కిట్ లో జత బూట్లు, ఒక డ్రెస్... 

కొవిడ్ తో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలకు అండగా ఉంటాం...

ఎన్ఈపీని స్వాగతించిన ఉపాధ్యాయు సంఘాలు

ఎన్ఈపీ అమలులో ఉపాధ్యాయుల పాత్రే కీలకం : ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి, జూన్ 17 (ప్రజా అమరావతి) :  రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020(ఎన్ఈపీ) అమలులో భాగంగా జాతీయ విద్యా విధానంలో అపోహాలను నమ్మొద్డని, ఏ ఒక్క పాఠశాల మూతపడదని, ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా రద్దు కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి జాతీయ విద్యా విధానం 2020 అమలు చేయనున్నామని, ఈ విప్లవాత్మక సంస్కరణలను విజయవంతం చేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. కొవిడ్ తో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. పాఠశాలలకు క్రీడా మైదానాలు లేనిచోట్ల భూములు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సచివాలయంలో జాతీయ విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయ సేకరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, మేనమామగా పిల్లలకు తానిచ్చే ఆస్తి చదువేనంటూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టాలని సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. నాడు-నేడు, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. ఈ పథకాలన్నీ దేశానికే మార్గదర్శకంగా నిలిచాయన్నారు. నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యమైన మౌలిక సదుపాయల కల్పనకు జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా 5+3+3+4 విద్యా విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు.  పూర్వ ప్రాథమిక విద్యతో పాటు ఒకటి రెండు తరగతులు ప్రాథమిక విద్యలో, 3,4,5 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ ను ఉన్నత విద్యలో చేర్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. దీనిపై ఉపాధ్యా సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. జాతీయ విద్యా విధానంపై ఎటువంటి అపోహలు నమ్మొద్దని కోరారు. ఏ ఒక్క పాఠశాల మూతపడదని, ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా రద్దు కాబోదని భరోసా ఇచ్చారు. ఏ అనుమానం ఉన్నా పరిష్కరిస్తామన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషికి ఉపాధ్యాయులంతా సహకరించాలని కోరారు. నాడు – నేడు పనుల్లో భాగంగా క్రీడా మైదానాలు లేని పాఠశాలలు గుర్తించి భూములు కొనుగోలు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. విద్యార్థుల్లో క్రీడల ప్రోత్సాహాకానికి స్పోర్ట్సు కిట్ అందజేయనున్నామన్నారు. మూడో విడత జగనన్న విద్యా కానుకలో అందజేసే ఈ కిట్ ద్వారా స్పోర్ట్సు షూస్, డ్రెస్ ఇవ్వనున్నామన్నారు. కొవిడ్ కారణంగా ఉపాధ్యాయులు మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. 

ఎన్ఈపీ విజయవంతం అందరి బాధ్యత : ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి

రాష్ట్రంలో అమలు చేయనున్న జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయులపైనా ఉందని రాష్ట్ర ప్రజా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం చేయాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఎన్నికలకు ముందే ఢిల్లీలో పర్యటించి, అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేశామన్నారు. కనీస మౌలిక సదుపాయాలు, క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు లేని ప్రైవేటు పాఠశాలలో అప్పో సప్పో చేసి తమ పిల్లలను తల్లిదండ్రులు చేర్చుతున్నారన్నారు. ఇవన్నీ గమనించే... జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారన్నారు. దీర్ఘకాలిక విజన్ తో సీఎం ముందుకు సాగుతున్నారన్నారు. జాతీయ విద్యా విధానం అమలులో ఉపాధ్యాయుల అభిప్రాయాల మేరకే నిర్ణయం తీసుకుంటామని, రాష్ట్ర ఏకపక్షంగా వ్యవహరించదని తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చినా ఉపాధ్యాయుల తనను సంప్రందించొచ్చునన్నారు. జాతీయ విద్యా విధానంపై తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ సంఘాలకు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ కు సూచించారు.

ఎన్ఈపీని స్వాగతించిన ఉపాధ్యాయ సంఘాలు 

అంతకుముందు అన్ని సంఘాల ఉపాధ్యాయ సంఘాల నేతల అభిప్రాయాలను మంత్రి ఆదిమూలపు సురేష్ తెలుసుకున్నారు. అన్ని సంఘాల నేతలూ జాతీయ విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. నాడు – నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక పథకాలతో పాటు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టిని కొనియాడారు. జాతీయ విద్యా విధానం అమలులో ఎదురయ్యే సమస్యలను మంత్రి, విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యలపై వినతలను మంత్రి, ప్రభుత్వ సలహాదారుకు అందజేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా డైరెక్టర్ చినవీరభద్రుడు, ఇతర విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.