నెల్లూరు (ప్రజా అమరావతి);
నెల్లూరు జిల్లా ముత్తుకూరులో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ పర్యటించి.., నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల పనులను పరిశీలించారు.
అనంతరం ఈ నెల 17 నుంచి జూలై 2వ తేదీ వరకూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భవన నిర్మాణ పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ముత్తుకూరు మండలంలో ఇప్పటి వరకూ నిర్మాణం పూర్తైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్స్, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ భవనాల వివరాలను సర్పంచులు, అధికారులను అడిగి.., కలెక్టర్ తెలుసుకున్నారు. భవన నిర్మాణ పక్షోత్సవాల కార్యక్రమం ప్రధాన లక్ష్యం.., నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్స్, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ భవనాలను పూర్తి చేయడం, ఇప్పటికీ పనులు ప్రారంభం కాని భవనాల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించడం అని తెలిపిన కలెక్టర్.., జూలై 8వ తేదీ లోపు నిర్మాణంలో అన్ని భవనాలు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సర్పంచ్ లుగా నూతనంగా ఎన్నికైన వారు సచివాలయాలు, ఆర్.బి.కే లు, వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్స్ భవనాల నిర్మాణ బాధ్యతను తీసుకోవాలని.., ప్రజా ధనంతో నిర్మిస్తున్న భవనాలు మన్నికతో భావితరాలకు ఉపయోగపడేలా తీర్చి దిద్దాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారన్నారు. ఈ వ్యవస్థ ద్వారానే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే వచ్చి లబ్ధి దారులకు అందిస్తున్నారన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు చేసిన సేవలు మరవలేమని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో రూ. 620 కోట్లతో సచివాలయాలు, ఆర్.బి.కె లు, వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి అనుమతి మంజూరు చేశారని, ఇప్పటికే రూ. 230 కోట్ల రూపాయలు వెచ్చించి జిల్లాలో భవనాల నిర్మాణం చేపట్టామన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ( ఆసరా) టి.బాపిరెడ్డి, జెడ్పి. సి.ఈ.ఓ పి.సుశీల, జిల్లా అధికారులు, సర్పంచ్ లు, ప్రజలు హాజరయ్యారు.
addComments
Post a Comment