- రాష్ట్రంలో చిరు వ్యాపారుల ఉపాధికి బాసటగా నిలుస్తున్న జగనన్న తోడు
- కృష్ణాజిల్లాలో చిరు వ్యాపారులకు రూ. 58.72 కోట్లు
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
విజయవాడ, జూన్ 8: రాష్ట్రంలో చిరువ్యాపారుల ఉపాధికి జగనన్న తోడు బాసటగా నిలుస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. జగనన్న తోడు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున రూ.370 కోట్లను సీఎం జగన్మోహనరెడ్డి మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కడం ద్వారా జగనన్న తోడు నగదును జమ చేశారు. ఈ సందర్భంగా విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో 9.05 లక్షల మంది నిరుపేదలు రోడ్లపై, ఇతర చోట్ల చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. అటువంటి చిరు వ్యాపారులకు రెండవ ఏడాది కూడా జగనన్న తోడుతో వారి ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ జగనన్న తోడు ఆసరాగా ఉంటుందన్నారు. చిరు వ్యాపారులకు రివాల్వింగ్ పద్దతిలో రుణం అందుతుందన్నారు. రాష్ట్రంలో జగనన్న తోడు రెండవ విడతగా రూ.370 కోట్ల వడ్డీలేని రుణాలను అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహనరెడ్డికే దక్కుతుందన్నారు. జగనన్న తోడుకు దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. అర్హత ఉండి రుణం రాలేదనే పరిస్థితి ఉంటే ఆందోళన చెందవద్దన్నారు. సమీపంలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం మెప్మా ద్వారా జగనన్న తోడు కింద 5 వేల 349 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 5.35 కోట్ల చెక్కును మంత్రి కొడాలి నాని అందజేశారు. జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న తోడు మొదటి విడతలో 27 వేల 716 మంది చిరు వ్యాపారులకు రూ.28.72 కోట్లు, ప్రస్తుతం రెండవ విడతలో 30 వేల 006 మందికి రూ. 30 కోట్లను వడ్డీలేని రుణాలుగా అందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, వసంత కృష్ణప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్లు డాక్టర్ కే మాధవీలత, ఎల్ శివశంకర్, కే మోహనకుమార్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, మెప్మా పీడీ ప్రకాశరావు, యుసీడి పీడీ అరుణ, పలువురు చిరు వ్యాపారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment