కృష్ణాజిల్లాలో చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయండి

 - కృష్ణాజిల్లాలో చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ పనులను  శరవేగంగా పూర్తి చేయండి


- జిల్లా కలెక్టర్ నివాస్ కు మంత్రి కొడాలి నాని ఆదేశం


విజయవాడ, జూన్ 10 (ప్రజా అమరావతి); కృష్ణా జిల్లాలో చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తయ్యేలా చూడాలని రాష్ట్ర పౌరసరఫరాలు,  వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) కృష్ణా జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జె.నివాస్ ను ఆదేశించారు. గురువారం విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి కొడాలి నానిని జిల్లా కలెక్టర్ జె నివాస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కృష్ణా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టామని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. ఈ ప్రక్రియ శరవేగంగా పూర్తి అయ్యేలా  అన్నివిధాల చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమల్లో తమ తరపున పూర్తి సహాయసహకారాలు అందిస్తామన్నారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో పూర్తి సఫలీకృతం కావాలని మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నివాస్ కు మంత్రి కొడాలి నాని పుష్పగుచ్చం అందజేశారు.

Comments