క్రీడల ద్వారా.. * పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

 క్రీడల ద్వారా..

* పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది


* మానసిక, శారీరక ఎదుగుదల కు దోహదం

* శ్రీనివాస క్రికెట్ అకాడమిని ప్రారంభించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి


తిరుపతి (ప్రజా అమరావతి);


క్రీడల ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా క్రీడలు పిల్లలు మానసికంగా, శారీరకంగాను ఎదిగేందుకు దోహదం చేస్తాయన్నారు. ఆదివారం తిరుపతి గ్రామీణ మండలం శ్రీ పద్మావతి పురం జిల్లా పరిషత్ హైస్కూల్ అవరణలో శ్రీనివాస క్రికెట్ అకాడమీ ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి బ్యాటింగ్ చేసి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తులో క్రీడ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పేర్కొన్నారు. తాను చిన్నతనంలో కబడ్డీ, క్రికెట్, పరుగు పందాలు వంటి క్రీడలు ఆడానని చెప్పుకొచ్చారు. హాకీ, బ్యాడ్మింటన్, త్రోబాల్, లాంగ్ జంప్ వంటి ఆటల ప్రాదాన్యత ను గుర్తుచేశారు. మన మనసు, శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మంచి నిర్ణయాలు తీసుకోగలమన్నారు. ఆటలు బాగా ఆడటం వలన శారీరకంగా శ్రమ కలుగుతుంది.. తద్వారా ఎముకలు, కండరాలలో పెరుగుదల, మంచి రక్త ప్రసరణ, వయసుకు తగ్గ బరువు, అలాగే మెదడు, గుండె కూడా చక్కగా పనిచేస్తాయన్నారు. కరోనా వంటి వైరస్ లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఫిట్ గా ఉండేందుకు క్రీడలను మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సూచించారు. క్రీడాకారులకు అనారోగ్యం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపారు. అలాగే క్రీడలతో మానసిక వత్తిడి తగ్గుతుందన్నారు. చక్కటి ఏకాగ్రతను కలిగి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.