నిర్ధేశించిన లక్ష్యం కంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో అధికంగా కరోనా బాధితులకు ఆరోగ్య శ్రీ సేవలు

 నిర్ధేశించిన లక్ష్యం కంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో

అధికంగా కరోనా బాధితులకు ఆరోగ్య శ్రీ సేవలు


రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్

అమరావతి, జూన్ 3 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో వివిధ ప్ర్రైవేటు ఆసుపత్రుల్లో 61.13 శాతం మందికి ఆరోగ్య శ్రీ సేవలు అందించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో 79.59 శాతం ఆరోగ్య శ్రీ పథకం వైద్య సేవలు అందుకున్నారన్నారు. నిర్ధేశించిన లక్ష్యం కంటే అధిక శాతం మందికి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు అందించామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 86,223 శాంపిళ్లు పరీక్షించగా, 11,421 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయిని, 81 మంది మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,674 ఐసీయూ బెడ్లు, 7,527 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 14,658 మంది చికిత్స పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆక్సిజన్ వినియోగం రోజు రోజుకూ తగ్గుతోందన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం రోజువారీగా 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయిస్తోందన్నారు. గడిచిన 24 గంటల్లో 384 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను డ్రా చేశామన్నారు. ఆక్సిజన్ అవసరం లేకపోవడం వల్ల తక్కువగా తీసుకున్నామన్నారు. ఏప్రిల్ 16వ తేదీన 104 కాల్ సెంటర్ అభివృద్ధి పరిచిన నాటి నుంచి చూసుకుంటే గడిచిన 24 గంటల్లో  కాల్ సెంటర్ కు గతంలో కంటే తక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. 3,427 ఫోన్ కాల్స్ రాగా, వాటిలో ఆసుపత్రుల్లో అడ్మిషన్ల కోసం 468 కాల్స్ వచ్చాయన్నారు.  హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న 23,285 మందితో టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా వైద్యులు ఫోన్లో మాట్లాడి సలహాలు సూచనలు అందజేశారన్నారు. 

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం...

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 24 వేల నుంచి 11 వేలకు తగ్గాయన్నారు. నాలుగు జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయని, తగ్గడం లేదంటూ కొందరు అవస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి అవాస్తవాల వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యే ప్రమాదముందన్నారు. వారం రోజుల నుంచి చూస్తే అన్ని జిల్లాల్లోనూ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. తూర్పు గోదావరిలో 3,400ల నుంచి 2,050 కేసులకు తగ్గాయన్నారు. ఇలా అన్ని జిల్లాల్లోనూ కేసులు తగ్గుతున్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివీ రేటు మే 5నాటికి 17 శాతం ఉండగా, జూన్ 2వ తేదీ నాటికి 13 శాతానికి తగ్గిందన్నారు. కరోనా తీవ్రంగా ఉన్న మే 17న 2,11,554 యాక్టివ్ కేసులు ఉండగా గడిచిన 24 గంటల్లో జూన్ 2వ తేదీ నాటికి 1,43,795 కేసులకు తగ్గాయని, గురువారం(జూన్ 3వతేదీ) నాటికి మరింత తగ్గే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం రికవరీ రేటు 91 శాతానికి పెరిగిందని తెలిపారు. మరికొద్ది రోజుల్లో 99.2 వరకూ పెరగనుందన్నారు. మే 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 380 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉండగా, జూన్ 2వ తేదీకి 1582 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. మే 17 నాటికి 433 ఆక్సిజన్‌ బెడ్లు మాత్రమే ఖాళీగా ఉంటే జూన్ 2వ తేదీ నాటికి 7,270 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయడానికి ఈ అంకెలు నిదర్శనమన్నారు. 

ప్ర్రైవేటు ఆసుపత్రుల్లో 61.13 శాతం మందికి ఆరోగ్య శ్రీ సేవలు 

వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో జూన్ వ తేదీ నాటికి ఆరోగ్య శ్రీ పథకం కింద 25,220 మంది చికిత్స పొందుతుంటే వారిలో 20,073 మంది ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో 79.59 శాతం ఆరోగ్య శ్రీ పథకం వైద్య సేవలు అందుకుంటున్నారన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 12,564 మంది చికిత్స పొందుతుంటే, వారిలో 7,680 మంది ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందుతున్నారన్నారు. 61.13 శాతం మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స పొందుతున్నారన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్లు ఆరోగ్య శ్రీ కింద వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, 61.13 శాతం బెడ్లు వినియోగించుకున్నారన్నారు. అనంతపురంలో 89 శాతం మంది, విజయనగరంలో 82 శాతం మంది వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యధికంగా ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు. 

93 మంది అనాథ చిన్నారుల గుర్తింపు

రాష్ట్రంలో 1,187 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. 11,605 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లను రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందజేసిందన్నారు. పొసకొనజోల్ ఇంజక్షన్లను, మాత్రలను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా కొనుగోలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 89 ఆసుపత్రులపై విజిలెన్స్ కేసులు నమోదు చేయగా, 66 కేసుల్లో రూ.9.90 కోట్ల వరకూ వసూలు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన 93 మంది చిన్నారులను గుర్తించామన్నారు. వారి పేరున ఫిక్సడ్ డిపాజిట్ చేసిన రూ.10 లక్షలకు నెలకు రూ.5 వేలు వడ్డీ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

జూన్ నెలాఖరులోగా రానున్న 58,72,370 టీకాలు

ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం నుంచి 87,08,730 డోసులు వచ్చాయన్నారు. జూన్ 2 వ తేదీ రాత్రికి కేంద్రమిచ్చిన డోసుల్లో 5,67,970, ఏపీ ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిన దాంట్లో 44.170 డోసులు అందుబాటులో ఉన్నాయని, మొత్తంగా  6,12,170 డోసుల స్టాక్ ఉందని తెలిపారు. ఇప్పటికి వరకూ 1,01,94,389 డోసులను పంపిణీ చేశామన్నారు. జూన్ నెలకు సంబంధించి 36,94,210 డోసులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. ఏపీ ప్రభుత్వం సొంతంగా 20,74,730 డోసులను కొనుగోలు చేయనున్నామని, ఇప్పటికే ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. మొత్తంగా చూస్తే జూన్ 30 వరకూ 58,72,370 డోసులు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఇప్పటికే జరుగుతున్న వ్యాక్సినేషన్ తో కలిపి జూన్ నెలాఖరు వరకూ 1.60 కోట్ల టీకాలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచిందన్నారు. కేంద్రమిచ్చే వ్యాక్సిన్ కోటా చాలకపోవడం వల్లే గ్లోబల్ టెండర్లను పిలిచామన్నారు. మే 13 తేదీన వ్యాక్సిన్ల కొనుగోలు నిమిత్తం  నోటిఫై చేశామని, జూన్ 3 సాయంత్రంలోగా బిడ్ ఫైల్ చేయాలని కోరుతూ గ్లోబల్ టెండర్లు పిలిచామన్నారు. మే 20తేదీన నిర్వహించిన ప్రీబిడ్ లో మూడు కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. గడువు ముగిసినా ఎవరూ బిడ్ దాఖలు చేయలేదన్నారు. బిడ్ దాఖలకు మరో రెండు వారాలు గడువు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. యూపీ, కర్నాటక, రాజస్తాన్, ఒడిశా.. ఇలా దేశ వ్యాప్తంగా 9 ప్రభుత్వాలు గ్లోబల్ టెండర్లు పిలిచినా, బిడ్ దాఖలకు ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. 

పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం జగన్ లేఖ...

రాష్ట్ర ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ వేయాలని గ్లోబల్ టెండర్లు పిలుస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదని, అందరికీ టీకా వేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారని ఆయన తెలిపారు. ఇదే విషయమై దేశంలోని ముఖ్యమంత్రులందరూ కేంద్రాన్ని కోరాలంటూ పలు రాష్ట్రాల సీఎంలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది జనవరి 16 తేదీన చేపట్టినట్లు దేశ ప్రజలందరికీ కేంద్రమే వ్యాక్సిన్ వేయాలన్నారు.  దీనివల్ల దేశ ప్రజలకు మేలు కలుగుతుందని ఆ లేఖలో సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారన్నారు.