ఆంజనేయస్వామి జన్మస్థలం అభివృద్ధికి కృషి : టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి.
ముగిసిన హనుమజ్జయంతి ఉత్సవాలు.
తిరుమల (ప్రజా అమరావతి); : తిరుమలలో ఆంజనేయస్వామి జన్మస్థలాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన హనుమజ్జయంతి ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. చివరి రోజున ఆకాశగంగ వద్ద జరిగిన పూజా కార్యక్రమాల్లో అదనపు ఈవో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ హనుమజ్జయంతి సందర్భంగా ఆంజనేయుడు జన్మించిన స్థలంలో 5 రోజుల పాటు విశేష ఉత్సవాలు నిర్వహించినట్టు చెప్పారు. ఇందులోభాగంగా ప్రతిరోజూ ఉదయం
శ్రీ అంజనాదేవికి,
శ్రీ బాలాంజనేయస్వామివారికి అభిషేకం,
అర్చన, ఇతర పూజలతోపాటు నివేదనలు సమర్పించామన్నారు.
® అనంతరం శ్రీ ఎ.రాజమోహన్ బృందం హనుమత్ సంకీర్తన వైభవం సంగీత కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్లు శ్రీ శ్రీహరి, శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
*జాపాలి క్షేత్రంలో…*
జాపాలి క్షేత్రంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ పిఎస్.రంగనాథ్ బృందం హనుమాన్ చాలిసా పారాయణం చేశారు. శ్రీ చంద్రశేఖర్ హరికథ వినిపించారు.
*యువతకు హనుమంతుడు ఆదర్శం*
ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు పాటుపడే యువతకు హనుమంతుడు ఆదర్శనీయులని తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం గెస్ట్ లెక్చరర్ శ్రీ వెంకటాచార్యులు పేర్కొన్నారు. తిరుమలలో జరుగుతున్న హనుమజ్జయంతి ఉత్సవాల చివరి రోజైన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నాదనీరాజనం వేదికపై ” హనుమంతుని కార్యదక్షత ” అనే అంశంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ వెంకటాచార్యులు ఉపన్యసిస్తూ హనుమంతుని కార్యదక్షత ఉత్కృష్టమైందని, కాబట్టే ఆంజనేయస్వామి మహావిఘ్నాలను అధిగమించి అనితరసాధ్యమైన మహత్కార్యాన్ని సాధించగలిగారని చెప్పారు. లంకలో సీతమ్మ జాడను తెలుసుకుని సీతారాములను కలిపి ఘనకీర్తిని సొంతం చేసుకున్నారని వివరించారు.
శ్రీరామసుగ్రీవులను కలిపే ఘట్టంలో....
బుద్ధిబలం, స్వామిభక్తి, అపారమైన జ్ఞానం, వాక్చాతుర్యం, భవిష్యత్తును అంచనావేసే శక్తిని ప్రదర్శించారని, సముద్రలంఘనం ఆరంభించే సమయంలో సంకల్పసిద్ధి, లక్ష్యశుద్ధి కనిపిస్తాయని తెలియజేశారు.
మైనాకుడు ఎదురైన ఘట్టంలో....
సంకల్పస్మరణం, ఇంద్రియనిగ్రహం, అవిశ్రాంతకృషి, సమయపాలన, సీతమ్మవారు అశోకవనంలో కనిపించిన సమయంలో అమోఘమైన వేగంతో తార్కికబుద్ధితో ఖచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఇలాంటి లక్షణాలు నేటి యువతకు చాలా అవసరమని తెలియజేశారు.
addComments
Post a Comment