ఆరువేల మందికి కోవిడ్ పరీక్షలు చేశాడు



 ఆరువేల మందికి కోవిడ్ పరీక్షలు చేశాడు


*- కరోనా విపత్తులో తాను సైతం అంటూ సేవలందించాడు*

*- దురదృష్టవశాత్తు కరోనా వైరస్‌ బారిన పడి ఆసుపత్రి పాలయ్యాడు*

*- ఖరీదైన వైద్యం చేయిస్తే కానీ ప్రాణాలు నిలబెట్టుకోలేని పరిస్థితి*

*- దిక్కుతోచని ఆ వైద్యుడి కుటుంబానికి అండగా నిలిచిన సీఎం శ్రీ వైయస్ జగన్*

*- అత్యంత ఖరీదైన వైద్యం ఖర్చు భరించేందుకు వెంటనే ఆదేశాలు*

*- ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ పట్ల తన చిత్తశుద్దిని చాటుకున్న సీఎం*

*- ఆపదలో ఆదుకున్న సీఎం ఉదారతకు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యుల కృతజ్ఞతలు*

*- కష్టంలోనూ మీ వెన్నంటి ఉన్నానంటున్న సీఎంకు వైద్యసిబ్బంది అభినందనలు*


అమరావతి (ప్రజా అమరావతి);


కరోనా కష్ట సమయంలో ధైర్యంగా ప్రజలకు సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఎప్పుడూ అండగా ఉంటానని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ప్రకటించారు. రాష్ట్రంలో వైద్యులు, వైద్యసిబ్బందితో పాటు కరోనా విపత్తులో ప్రజలకు అంకితభావంతో పనిచేస్తున్న పలు విభాగాల వారి సేవలను ఈ ప్రభుత్వం మరిచిపోదంటూ అనేక సందర్భాల్లో వారి కృషిని సీఎం అభినందించారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా వారి సేవలను మెచ్చుకోవడంతోనే సరిపెట్టుకోలేదు. కష్టం వచ్చిన సందర్భంలో ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా వారి ప్రాణాలను కాపాడటానికి సీఎం శ్రీ వైయస్ జగన్ తీసుకున్న చొరవ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు, వైద్యసిబ్బందిలో భరోసాను నింపింది. విధులు నిర్వహిస్తూ కరోనా వైరస్ కారణంగా ప్రాణాపాయ స్థితిలో పక్కరాష్ట్రంలో చికిత్స పొందుతున్న ప్రభుత్వ వైద్యుడిని కాపాడటానికి అత్యంత ఖరీదైన వైద్యం ఖర్చును ప్రభుత్వ పరంగా భరించేందుకు సీఎం శ్రీ వైయస్‌ జగన్ హుటాహుటిన ఆదేశాలు జారీ చేసిన వైనం నేడు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో ఒక భరోసాను నింపింది.

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపుట్టుగకు చెందిన డాక్టర్‌ ఎన్‌.భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారిగా పనిచేస్తున్నాడు. కరోనా సమయంలో తన విధుల్లో భాగంగా దాదాపు  6 వేల మందికి కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో పాజిటివ్‌ పేషంట్లకు వైద్యపరమైన సేవలు అందించారు. ఆయన అందించిన వైద్యంతో వేలాది మంది కోలుకున్నారు. అయితే గత ఏప్రిల్‌ 24న ఆయనకు కరోనా సోకింది. వెంటనే హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి వైద్యం పొందారు. తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో భార్య డాక్టర్‌ భాగ్యలక్ష్మి ఆయనను విజయవాడ ఆయుష్‌ ఆస్పత్రిలో చేర్చారు. ఇక్కడ 10 రోజుల పాటు వైద్యం అందించినా పరిస్థితి మారకపోవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ యశోదా హాస్పిటల్, తరువాత గచ్చిబౌలిలోని కేర్‌ హాస్పిటల్‌ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. రోజులు గడుస్తున్నా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్‌ వల్ల పూర్తిగా పాడవటంతో ప్రస్తుతం ఆయనను వెంటీలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. చివరికి ఆయన ప్రాణాలను కాపాడాలంటే అత్యంత ఖరీదైన వైద్యం అందించాలని, ఊపిరితిత్తులును మార్చాలని వైద్యులు తేల్చి చెప్పారు. దీనిని దాదాపు రూ.1.50 కోట్ల మేరకు ఖర్చవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే వైద్యం కోసం ఉన్న సొమ్ము అంతా ఖర్చు చేసిన కుటుంబసభ్యులు తాజాగా ఈ ఖరీదైన వైద్యంను చేయించడానికి ఆర్థిక స్థోమత లేని పరిస్థితుల్లో ఆందోళనకు గురయ్యారు. దీనిపై భాస్కర్‌రావు కుటుంబసభ్యులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విషయాన్ని సీఎం శ్రీ వైయస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. డాక్టర్ భాస్కర్‌రావు పరిస్థితి గురించి విన్న వెంటనే సీఎం శ్రీ వైయస్ జగన్ ఆయనకు అయ్యే వైద్య ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని, వెంటనే చికిత్స ప్రారంభించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. తక్షణం అవసరాలకు కోటి రూపాయలు చెల్లించాలని, అవసరమైతే మరో రూ.50 లక్షలు కూడా చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 


*సీఎం స్పందించిన తీరుతో మా బాధ్యత మరింత పెరిగింది*

*ఆంధ్రప్రదేశ్  గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్* 


ప్రమాదకరమైన వైరస్‌ నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు చేస్తున్న నిరంతర పోరాటానికి సీఎం శ్రీ వైయస్ జగన్ అండగా నిలవడం, ప్రాణాపాయంలో ఉన్న ప్రభుత్వ వైద్యుడిని ఆదుకునేందుకు కోట్లాధి రూపాయలను ఖర్చు చేసేందుకు వెంటనే నిర్ణయం తీసుకోవడం సీఎం గొప్ప మనస్సుకు నిదర్శనమని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిడకాల శ్యాంసుందర్ అన్నారు. ఈ సందర్బంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం తీసుకున్న ఈ చొరవ మొత్తం వైద్యరంగంలో పనిచేస్తున్న మా అందరి బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. ప్రకాశంజిల్లా కారంచేడు పిహెచ్‌సికి చెందిన డాక్టర్ ఎన్.భాస్కర్‌రావుకు అత్యంత ఖరీదైన వైద్యంను అందించేందుకు సీఎం చూపించిన చొరవ పట్ల వైద్యులు, వైద్యసిబ్బందిలోనూ ఈ ప్రభుత్వం మాకు తోడుగా ఉంటుందనే భరోసాను నింపిందని అన్నారు. కరోనా మహమ్మారి తో పోరాటానికి  సిద్దపడిన ఒక  ప్రభుత్వ  వైద్యునికి, వేలాది  వైద్యుల కుటుంబాలకు ముఖ్యమంత్రి తీసుకున్న  నిర్ణయం  ఒక గుండె నిబ్బరం కలిగిస్తోందని అన్నారు. ఈ రోజున సీఎం శ్రీ వైయస్ జగన్ మానవతాదృక్పథంతో తీసుకున్న ఈ నిర్ణయంను ప్రతీ డాక్టరు జీవితకాలం  గుర్తుంచుకుంటారని, ఈ ప్రభుత్వానికి మరింత మంచిపేరు తీసుకువచ్చేందుకు అహర్నిషలు చిత్తశుద్దితో పనిచేసేందుకు మాకు స్పూర్తిని ఇచ్చాని అన్నారు.

Comments