జయమ్మ మృతిపై నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిగేలా చూస్తా - రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

 


- జయమ్మ మృతిపై నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిగేలా చూస్తా 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, జూన్ 2 (ప్రజా అమరావతి): నందివాడ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన జవ్వాది జయమ్మ అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు నిస్పక్షపాతంగా జరిగేలా చూస్తానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హామీ ఇచ్చారు. బుధవారం గుడివాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయం దగ్గర మంత్రి కొడాలి నానిని నందివాడ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన చింతాడ నాగూర్, కొత్తూరి అబ్రహాం, గోనె కనకరాజు, కొత్తూరి ఎలీషా, ముత్యాల కనకరత్నం, కొత్తూరి మంగయ్య, దేవా చినబాబు, కూర్మా రాధ, తేరా చంద్రబాబు, కోనా మోషే తదితరులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన జవ్వాది జయమ్మ అనుమానాస్పద స్థితిలో ఈ నెల 28 వ తేదీన మృతి చెందిందని చెప్పారు. గుడివాడలోని ఒక ఆసుపత్రికి వచ్చిన జయమ్మ తమిరిశ డొంక రోడ్డులో శవంగా కన్పించిందని, ఆమెతో ఉన్న జవ్వాది రవి ఫోన్ చేసి ఆయాసంతో మరణించినట్టుగా చెప్పాడన్నారు. జయమ్మ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్ళి మృతదేహాన్ని పరిశీలించారని, ఆ తర్వాత రవిపై అనుమానం ఉన్నట్టుగా ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇంకా పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని, జయమ్మ కేసు దర్యాప్తు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ జయమ్మ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని పోలీసులను ఆదేశిస్తానని మంత్రి కొడాలి నాని చెప్పారు.