వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను కల్పిస్తున్నాం



- వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను కల్పిస్తున్నాం 


- గుడివాడ రూరల్ మండలంలో 23 జగనన్న కాలనీలు 

- 1,705 మంది లబ్ధిదారులకు ఇళ్ళపట్టాలను అందజేశాం 

- మంచినీటి పైలైన్ల నిర్మాణానికి రూ. 64.26 లక్షల నిధులు 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 


గుడివాడ, జూన్ 16: వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను కల్పిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం గుడివాడ నియోజకవర్గంలోని రూరల్ మండలంలో వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న పైలైన్ పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ రూరల్ మండలంలో 23 లేఅవుట్లలో వైఎస్సార్ జగనన్న కాలనీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందు కోసం 35 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయించామని తెలిపారు. ఈ కాలనీల్లో 1,705 మంది లబ్ధిదారులకు ఇళ్ళపట్టాలను అందజేశామని చెప్పారు. రూరల్ మండలంలోని 23 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మట్టి ఫిల్లింగ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో తొలి విడతగా 15.60 లక్షల ఇళ్ళను నిర్మించేందుకు సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు చేపట్టారని, దీనిలో భాగంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను కల్పించాలని ఆదేశించామన్నారు. దీంతో రాష్ట్రంలోని 4 వేల 120 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ఈ నెలాఖరులోగా తాగునీరు, విద్యుత్ సౌకర్యం వంటివి ఏర్పాటవుతున్నాయని చెప్పారు. గుడివాడ రూరల్ మండలంలోని తట్టివర్రు, చౌటపల్లి, కల్వపూడి అగ్రహారం, శేరీగొల్వేపల్లి, సీపూడి, చిరిచింతల తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఇళ్ళ నిర్మాణం ప్రారంభమైతే నీటి అవసరం ఉంటుందని , ఇళ్ళ నిర్మాణానికి ముందే తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాల ఏర్పాటుపై సీఎం జగన్మోహనరెడ్డి దృష్టి పెట్టారన్నారు. గుడివాడ రూరల్ మండలంలోని 21 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మంచినీటి పైలైన్ నిర్మాణానికి రూ. 64.26 లక్షల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఇళ్ళ నిర్మాణం విషయంలో క్రమం తప్పకుండా సమీక్షలు జరుపుతామని తెలిపారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే అవకాశం ఏర్పడుతుందన్నారు. గుడివాడ రూరల్ మండలంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ళపట్టాలను అందజేయడం జరుగుతుందన్నారు. అర్హత ఉండి ఇళ్ళ పట్టా రానివారు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హతలను పరిశీలించి 90 రోజుల్లో ఇంటి పట్టాను మంజూరు చేస్తామన్నారు. ఇళ్ళపట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదలు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సీఎం జగన్మోహనరెడ్డి ఇళ్ళపట్టాలను అందజేస్తున్నారని మంత్రి కొడాలి నాని చెప్పారు.

Comments