రెండేళ్లలో గిరిజన సంక్షేమానికి రూ.14,658 కోట్లు


రెండేళ్లలో గిరిజన సంక్షేమానికి రూ.14,658 కోట్లు


క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

త్వరలో పీసా గ్రామసభలకు ఎన్నికలు

ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి వెల్లడి

విజయవాడ, జూలై 22 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో గడచిన రెండేళ్ల కాలంలో గిరిజన సంక్షేమానికి రూ.14,658 కోట్ల రుపాయలను వెచ్చించడం జరిగిందని  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న క్షేత్రస్థాయి సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

గురువారం గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో పుష్ప శ్రీవాణి రాష్ట్రంలోని గిరిజన ఎమ్మెల్యేలతో కలిసి ఐటీడీఏ పిఓలు, డిప్యుటీ డైరెక్టర్లు, డిటీడబ్ల్యుఓల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగానే గిరిజన సంక్షేమశాఖ రెండేళ్ల ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలోనే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గిరిజన సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. గడచిన రెండేళ్లకాలంలో గిరిజన సంక్షేమం కోసం రూ.14,658 కోట్ల రుపాయలను వెచ్చించడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.  ఇంత పెద్దస్థాయిలో గిరిజన సంక్షేమం కోసం నిధులను వెచ్చించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పారు. 2019 ఏప్రిల్ నుంచి 2021 మే మాసాంతం వరకూ వివిధ ప్రభుత్వ పథకాల కింద ప్రత్యక్షంగా 29.71 లక్షల మంది గిరిజనుల ఖాతాల్లోకి రూ.4915 కోట్లను నేరుగా జమ చేసారని, పరోక్షంగా 17.11 లక్షల మంది గిరిజనులకు రూ.1731 కోట్ల లబ్దిని చేకూర్చారని తెలిపారు.  ఈ విధంగా మొత్తం రూ.6646 కోట్లను ప్రత్యక్షంగా  గిరిజనుల సంక్షేమానికి వినియోగించడం జరిగిందని చెప్పారు. ఇదికాకుండా గత రెండేళ్ల కాలంలోనే వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ట్రైబల్ సబ్ ప్లాన్ కింద రూ.8012 కోట్ల తో అభివృద్ధి పనులను చేపట్టారని పుష్ప శ్రీవాణి వివరించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు అటవీ హక్కుల చట్టం ఆర్ఎఫ్ఆర్ లో భాగంగా పట్టాలను ఇవ్వడంలోనూ ముఖ్యమంత్రి కొత్త చరిత్రను సృష్టించారని చెప్పారు. గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకూ 1.24 లక్షల మంది గిరిజనులకు 2.28 లక్షల ఎకరాల భూములను పట్టాలుగా పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న రహదారులు, తాగునీరు, విద్య, వైద్య రంగాలకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిష్కరించడానికి, గురుకులాలలో సీట్ల సంఖ్యను పెంచడానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పీసా చట్టం ప్రకారంగా గ్రామసభలకు ఎన్నికలను కూడా త్వరలోనే నిర్వహిస్తామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కులధృవీకరణ పత్రాల మంజూరులో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఐటీడీఏ పిఓలను పుష్ప శ్రీవాణి ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే ఉన్నతాధికారులు కూడా స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులతో కలిసి మాట్లాడితే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు అవగతమౌతాయని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి తదితరులు తమ ప్రాంతాల పరిధిలోని సమస్యలను వివరించారు. గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, డైరెక్టర్ రంజిత్ బాషా తో పాటుగా పాడేరు, రంపచోడవరం, సీతంపేట, కేఆర్ పురం, చింతూరు తదితర ఐటీడీఏల పిఓలు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Comments