నెల్లూరు, జులై 23 (ప్రజా అమరావతి),--- వచ్చే సెప్టెంబర్ 15 వ తేదీ నాటికి 90 శాతం గృహాలకు పై కప్పు పూర్తి కావాలని
జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ "నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు- జగనన్న కాలనీ లపై " నియోజక వర్గ, మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి పురోగతిని సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. కావలి, దగదర్తి, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, మనుబోలు, నాయుడుపేట, సూళ్లూరుపేట తదితర మండలాల్లో గృహాల పురోగతి అనుకున్నంతగా లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇకనైనా ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తమ పని తీరును మెరుగుపరుచుకోవాలన్నారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రెండు నెలలు కీలకమని, రానున్న వర్షాకాలంలో గా అంటే సెప్టెంబర్ 15వ తేదీలోగా 90 శాతం గృహాలకు పై కప్పు పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ప్రతి శుక్రవారం గృహాల పురోగతి సమీక్షించడం జరుగుతుందని, వారం వారం ఎట్టి పరిస్థితుల్లోనూ పురోగతి సాధించి నిర్ణీత లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి మంగళవారం, గురువారం తప్పనిసరిగా లే అవుట్లను పరిశీలించి పురోగతిని సమీక్షించుకోవాలన్నారు. ఇకనుంచి ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో స్పందన కార్యక్రమం ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. గృహాల నిర్మాణంలో 3 వ ఐచ్చికం తీసుకున్న లబ్ధిదారులకు గృహాలు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులపై ఉందన్నారు. లేఅవుట్లలో విద్యుత్ సదుపాయం కల్పించడంలో ఆలస్యం అవుతున్నదని ప్రస్తావిస్తూ వచ్చే మూడు రోజుల్లోగా పెండింగ్లో ఉన్న విద్యుత్ సౌకర్యాలన్నీ కల్పించాలన్నారు. ఇకపై ఈ కార్యక్రమం పూర్తయ్యేవరకు రాత్రింబవళ్ళు పనిచేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్,విద్యుత్తు, ప్రజారోగ్య శాఖ అధికారులు ముగ్గురు సమన్వయంతో పనిచేయాలన్నారు. వారి శాఖలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వచ్చే వారం రాకూడదని స్పష్టం చేశారు. ఇంకా నిర్మాణం పనులు మొదలు పెట్టని ఇల్లు ఉండ రాదన్నారు. నిర్మాణం మొదలైన ఇల్లు వివిధ దశల్లో ప్రగతి సాధించాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇళ్లనిర్మాణంపై ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయాలని దశల వారీ పురోగతిని సమీక్షించుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో కూలీలకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించడంలో సరైన పురోగతి లేదని ఇకనైనా ప్రత్యేక శ్రద్ధ వహించి వచ్చే మూడు రోజుల్లో అన్ని పనులకు పరిపాలన ఉత్తర్వులు పొందాలన్నారు. కూలీలకు వేతనాలు చెల్లింపులు సకాలంలో జరపాలన్నారు. మ్యాపింగ్, జియో ట్యాగింగ్ సత్వరమే జరపాలన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్, రెవిన్యూ, అభివృద్ధి సంయుక్త కలెక్టర్లు శ్రీ విదేహ్ ఖరే, శ్రీ హరేంద్ర ప్రసాద్, శ్రీ గణేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్,జడ్పీ సీఈఓ శ్రీమతి సుశీల, నాయుడుపేట, గూడూరు, ఆత్మకూరు ఆర్ డి వో లు శ్రీమతి సరోజినీ, శ్రీ మురళీకృష్ణ, చైత్ర వర్షిని మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు .
addComments
Post a Comment