- రూ. 16.10 కోట్ల వ్యయంతో గుడివాడ - కంకిపాడు రోడ్డు విస్తరణ, అభివృద్ధి
- బెడ్ లెవల్‌కు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, జూలై 22 (ప్రజా అమరావతి): రూ.16.10 కోట్ల వ్యయంతో గుడివాడ - కంకిపాడు ప్రధాన రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. గుడివాడ పట్టణం మీదుగా విజయవాడకు వెళ్ళే వాహనదారులు గుడివాడ - కంకిపాడు ప్రధాన రహదారిపై అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ రోడ్డుకు ఇరువైపులా పంటకాల్వలు ఉండడంతో రోడ్డు నిర్మించిన కొద్ది రోజుల్లోనే అక్కడక్కడా రోడ్డు మార్జిన్లు కుంగిపోతున్నాయి. సింగిల్ రోడ్డు కావడంతో గుంటలు ఏర్పడిన ప్రాంతంలో ఎదురెదురుగా ప్రయాణించే వాహనాలు ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతున్నాయన్నారు. గుడివాడ నియోజకవర్గానికి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఈసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో గుడివాడ - కంకిపాడు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రోడ్డు నిర్మాణానికి రూ.16.10 కోట్ల నిధులను విడుదల చేయించానని తెలిపారు. గుడివాడ - కంకిపాడు రోడ్డు ఒక్కో ప్రాంతంలో ఒక్కో వెడల్పుతో ఉండడం, రోడ్డుకు ఇరువైపులా ఉన్న పంటకాల్వలు చాలా లోతుగా ఉండడం, రిటైనింగ్ వాలను నిర్మించాల్సి రావడంతో పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ రోడ్డును పటిష్ఠంగా నిర్మించడం పైనే దృష్టి పెట్టామన్నారు. దీనిలో భాగంగా గుడివాడ పట్టణంలోని పెదకాల్వ సెంటర్ నుండి కేటీఆర్ మహిళా కళాశాల, ఆంధ్ర నలంద మున్సిపల్ ఉన్నత పాఠశాల, జీవీఆర్ కళ్యాణ మండపం మీదుగా మందపాడు రైల్వేగేటు వరకు 10 మీటర్ల మేర సీసీ రోడ్డును నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఈ రోడ్డు ఐదున్నర మీటర్ల వెడల్పు మాత్రమే ఉందని తెలిపారు. అద్వానంగా ఉన్న ఈ రోడ్డును నిర్మించే ముందు గోతులను పూడ్చడం జరిగిందన్నారు. అలాగే పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి దగ్గర నుండి బేతవోలులోని మంచినీటి రిజర్వాయర్ వరకు 10 మీటర్ల బీటీ రోడ్డును నిర్మిస్తామని తెలిపారు. ఈ రిజర్వాయర్ దగ్గర నుండి అక్కినేని నాగేశ్వరరావు కళాశాల సమీపంలో ఉన్న పెదపారుపూడి మండలం భూషణగుళ్ళ వరకు ఉన్న 6.7 మీటర్ల రోడ్డును 10 మీటర్ల రోడ్డుగా నిర్మిస్తామన్నారు. ఈ రోడ్డుకు ఎడమ వైపున ఉన్న పంటకాల్వకు రిటైనింగ్ వాలను నిర్మిస్తామన్నారు. భూషణగుళ్ళ నుండి మండల కేంద్రమైన పెదపారుపూడి వంతెన వరకు కుడి వైపున ఉన్న పంటకాల్వకు రిటైనింగ్ వాల్ ను నిర్మిస్తామన్నారు. ఐదున్నర మీటర్ల వెడల్పు ఉన్న ఈ రోడ్డును 10 మీటర్లకు విస్తరించి అభివృద్ధి చేస్తామన్నారు. అక్కడి నుండి కోమటిగుంట లాకుల వరకు ఉన్న రోడ్డును నిర్మించేందుకు న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ కు రూ. 100 కోట్లతో ప్రతిపాదనలను పంపామన్నారు. ప్రస్తుతం రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు బెడ్ లెవల్ కు చేరాయని, ఒకటి, రెండు నెలల్లో గుడివాడ - కంకిపాడు ప్రధాన రోడ్డు విస్తరణ , అభివృద్ధి పనులు పూర్తవుతాయని చెప్పారు. వాహనాల రద్దీ కారణంగా ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయని, రిటైనింగ్ వాల్స్ నిర్మించడం వల్ల రోడ్డు పటిష్టంగా ఉంటుందని మంత్రి కొడాలి నాని చెప్పారు.
addComments
Post a Comment