రూ.200 కోట్ల వ్యయంతో భీమవరం, మచిలీపట్నం రైల్వే ట్రాక్ లపై ఫ్లై ఓవర్ల నిర్మాణం

 


- రూ.200 కోట్ల వ్యయంతో భీమవరం, మచిలీపట్నం రైల్వే ట్రాక్ లపై ఫ్లై ఓవర్ల నిర్మాణం 


- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, జూలై 27 (ప్రజా అమరావతి): రూ.200 కోట్ల వ్యయంతో విజయవాడ - భీమవరం, గుడివాడ - మచిలీపట్నం రైల్వే ట్రాక్ లపై ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో భీమవరం, మచిలీపట్నం రైల్వే ట్రాక్ ల దగ్గర నిత్యం ట్రాఫిక్ సమస్యలు పెరుగుతూ వస్తున్నాయన్నారు. ఎన్నో ఏళ్ళుగా రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం కృషి చేస్తున్నామన్నారు. మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి బాధ్యతలు చేపట్టిన వెంటనే గుడివాడలో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి బడ్జెట్ లో నిధులు మంజూరయ్యేలా కృషి చేశారన్నారు. దీనిలో భాగంగా లెవల్ క్రాసింగ్ గేట్ -52 విజయవాడ - భీమవరం రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.125 కోట్లు, లెవల్ క్రాసింగ్ గేట్ -3 గుడివాడ - మచిలీపట్నం రైల్వే ట్రాక్ పై మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 75 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ రెండు ఫ్లైఓవర్లకు సంబంధించిన డిజైన్లను తయారు చేసి నేషనల్ హైవే అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. ఫ్లైఓవర్లను నిర్మించే ప్రాంతంలో బైపాస్ రోడ్లు ఉంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు రావని చెప్పారు. గుడివాడలో ఫ్లై ఓవర్లు నిర్మించే ప్రాంతంలో బైపాస్ రోడ్లు ఉండడం వల్ల కొంత జాప్యం జరిగిందన్నారు. భీమవరం, మచిలీపట్నం రైల్వే ట్రాక్ ల దగ్గర ఎన్నో ఏళ్ళుగా గుడివాడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను బందరు ఎంపీ బాలశౌరి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందన్నారు. దీంతో వన్ టైం డెవలప్మెంట్ స్కీం కింద గుడివాడలో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఇదిలా ఉండగా రైల్వే ట్రాల నిర్మాణానికి సంబంధించి ఫైనల్ ఆర్డర్ రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం సర్వే పనులు జరుగుతున్నాయన్నారు. గుడివాడ - మచిలీపట్నం రైల్వే ట్రాక్ పై నిర్మించే ఫ్లైఓవర్‌ను గుడివాడ రూరల్ మండలం బిళ్ళపాడు దగ్గర నుండి గుడివాడ పట్టణంలోని ఆటోనగర్ పెట్రోల్ బంక్ వరకు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అక్కడి నుండి పట్టణంలోకి 150 మీటర్ల రోడ్డు తర్వాత నుండి మరో ఫ్లైఓవర్ గుడివాడ - భీమవరం రైల్వే ట్రాక్ పై కోతిబొమ్మ సెంటర్ వరకు నిర్మిస్తామన్నారు. ఈ ప్లైఓవర్లకు ఇరువైపులా రోడ్లు, అండర్ టన్నెల్స్ నిర్మాణం తదితరాలపై కూడా దృష్టి సారిస్తున్నామన్నారు. గుడివాడలో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి కృషి చేస్తానని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. ఈ ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం బాలశౌరి అనేకసార్లు పార్లమెంట్ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఎంపీ బాలశౌరికి గుడివాడ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు ఫ్లైఓవర్లు , అండర్ టన్నెల్స్ నిర్మాణం పూర్తయితే గుడివాడ - పామర్రు జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు పూర్తిస్థాయిలో తొలగిపోతాయని చెప్పారు. గుడివాడ మీదుగా మచిలీపట్నం , పామర్రు , అవనిగడ్డ తదితర ప్రాంతాలకు వెళ్ళే వాహనదారులు కూడా రైల్వే ట్రాక్ ల దగ్గర గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకునే పరిస్థితి లేకుండా పోతుందని మంత్రి కొడాలి నాని తెలిపారు.

Comments