రైతులకు సకాలంలో డబ్బులిచ్చేందుకు 21 రోజుల నిబంధనను పెట్టుకున్న సీఎం జగన్ - ఏటా 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటున్నాం



- రైతులకు సకాలంలో డబ్బులిచ్చేందుకు 21 రోజుల నిబంధనను పెట్టుకున్న సీఎం జగన్ - ఏటా 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటున్నాం 


- చంద్రబాబు హయాంలో 55 లక్షల మెట్రిక్ టన్నులే 

- గత ప్రభుత్వం ఏటా రైతులకిచ్చింది రూ.8,500 కోట్లు 

- రెండేళ్ళుగా రూ. 16 వేల కోట్లు చొప్పున చెల్లిస్తున్నాం 

- రైతాంగం చంద్రబాబును చావుదెబ్బ కొట్టిందని తెలుసుకోండి - రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 



తాడేపల్లి, జూలై 18 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో రైతులకు సరైన గిట్టుబాటు ధరను కల్పించి, ధాన్యానికి సకాలంలో డబ్బులివ్వాలన్న ఉద్దేశ్యంతో 21 రోజుల నిబంధనను సీఎం జగన్మోహనరెడ్డి పెట్టుకున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పనికిమాలిన ప్రతిపక్షం, దానికి నాయకుడిగా ఉన్న చంద్రబాబు తన పార్టీ సభ్యులను పరామర్శించడానికి వెళ్తూ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశాడన్నారు. ధాన్యం కొనుగోలు చేసినా రైతాంగానికి ప్రభుత్వం డబ్బులివ్వడం లేదని, రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారంటూ చంద్రబాబు, ఆయనకు సంబంధించిన పార్టీ, మీడియా రైతుల ముసుగులో ఆడుతున్న నాటకాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు 2014 నుండి 2019 వరకు ఐదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తే, ఈ ఐదేళ్ళలో ఆయన సగటున సంవత్సరానికి 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లయిస్ డిపార్ట్ మెంట్ ద్వారా కొనుగోలు చేయించాడన్నారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఈ రెండేళ్ళలో సంవత్సరానికి 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి తీసుకోవడం జరిగిందన్నారు. దాదాపు 28 లక్షల టన్నుల ధాన్యాన్ని అదనంగా సేకరించామని తెలిపారు. రైతులు బాగుండాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆలోచన చేస్తుంటారన్నారు. సాగుకు అవసరమైన నీరు ఇవ్వడమే కాకుండా బోర్ల మీద వ్యవసాయం చేసినా చూసీచూడనట్టుగా ఉండడం వల్ల ఇంత పెద్దఎత్తున దాదాపు 50 శాతానికి పైగా ధాన్యం అదనంగా పండిన పరిస్థితి ఉందన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి తెలుసని, దిక్కుమాలిన చంద్రబాబు ఒక్కడికే తెలవడం లేదన్నారు. చంద్రబాబు హయాంలో ఏటా సగటున ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ. 8,500 కోట్లు చొప్పున చెల్లించారని, సీఎం జగన్మోహనరెడ్డి హయాంలో రెండేళ్ళలో సంవత్సరానికి రూ.16 వేల కోట్లు చొప్పున చెల్లించామన్నారు. 21 రోజుల నిబంధనను కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్రంలో అంతకు ముందున్న చంద్రబాబు ప్రభుత్వం గాని పెట్టుకోలేదన్నారు. రాష్ట్రాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని 21 రోజుల నిబంధనను తెచ్చారన్నారు. చంద్రబాబు హయాంలో ధాన్యం రైతులకు రెండు, మూడు నెలలకు కూడా డబ్బులు వచ్చేవి కావని, అంతటి పేరు తెచ్చుకున్న ఆయనను రైతాంగం చావు దెబ్బ కొట్టిందన్నారు. అందువల్లే ఇంత దిక్కుమాలిన పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నాడని, ఈ విషయాన్ని చంద్రబాబు, ఆయనకు బాకా ఊదే మీడియా, ఆయనను నమ్ముకుని వెనకే తిరుగుతున్న పార్టీ నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి కొడాలి నాని గుర్తుచేశారు.

Comments