నెల్లూరు, జూలై 16 (prajaamaravati):--- జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టుల కోసం 42 వేల టన్నుల స్టీల్ సరఫరా చేసేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర బాబు స్టీల్ ఉత్పత్తిదారులను కోరారు.
శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ శ్రీ కళ్యాణ చక్రవర్తి తో కలిసి సంబంధిత అధికారులు, స్టీల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల నిర్మాణం, పేదలందరికీ ఇల్లు నిర్మాణం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం 42 వేల టన్నుల స్టీల్ అవసరం ఉందన్నారు. వచ్చే అక్టోబర్ మాసాంతానికి గ్రామ, వార్డు సచివాలయాల నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో 6 సచివాలయ భవనాలు నిర్మించడం జరుగుతోందన్నారు. ఆ రకంగా భారీ స్థాయిలో స్టీల్ కు డిమాండ్ ఉందన్నారు. అలాగే లక్ష గృహాల నిర్మాణం వచ్చే ఏప్రిల్ మాసంలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. శాఖాపరంగా కావలసినంత స్టీల్ పరిమాణాన్ని తెలియజేస్తామని ఆ ప్రకారంగా స్టీల్ కంపెనీ లు సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించిన ఎఫ్.టి.వో.లు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి సకాలంలో బిల్లు వారికే నేరుగా చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. స్టీల్ కంపెనీలు ముందుకు వచ్చి అవసరమైనంత స్టీల్ ను సకాలంలో సరఫరా చేయాలని సూచించారు. అందుకు స్టీల్ కంపెనీల ప్రతినిధులు తమ అంగీకారం తెలిపారు. ఈ సమావేశంలో హౌసింగ్ పిడి శ్రీ ఆది సుబ్రహ్మణ్యం, పంచాయతీరాజ్ ఎస్.ఇ. శ్రీ శ్రీనివాస్ రెడ్డి, డి ఐ సి జిఎం శ్రీ మారుతీ ప్రసాద్, తిరుమల టిఎంటి స్టీల్ ప్రతినిధి శ్రీ మనోజ్, టాటా స్టీల్ ప్రతినిధి మౌనిక తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment