అణగారిన వర్గాల ఆర్థిక పురోభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

 అణగారిన వర్గాల ఆర్థిక పురోభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి*


*: దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా వెనకబడిన వర్గాల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి*


*: రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు మాలగుండ్ల శంకర నారాయణ*


అనంతపురం, జూలై 18 (ప్రజా అమరావతి): 


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి ఈరోజు వరకు  అణగారిన వర్గాల ఆర్థిక పురోభివృద్ధి కోసం ఎంతగానో పాటు పడుతున్నారని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు మాలగుండ్ల శంకర నారాయణ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.*

ఈ సందర్భంగా  మంత్రివర్యులుశంకర నారాయణ మాట్లాడుతూ మహాత్ములు కలలుగన్న విధంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. ఈ విషయం రాష్ట్రంలో శనివారం ప్రకటించిన 137 రాష్ట్ర, జిల్లా స్థాయి చైర్మన్ లను చూస్తే అర్థం అవుతుందన్నారు. దేశంలో స్వతంత్రం రాకముందు నుంచి అణగారిన వర్గాల కోసం ఎంతో మంది మహానుభావులు పోరాటాలు, చైతన్య యాత్రలు చేపట్టారని, అందులో మహాత్మ జ్యోతిరావు పూలే అట్టడుగు వర్గాలకు విద్య నేర్పించేందుకు, సమాజంలో గౌరవంగా జీవించేందుకు, వారిని చైతన్యవంతం చేసేందుకు చేపట్టిన కార్యక్రమాలను ఇప్పటికీ స్మరించుకుంటున్నామన్నారు. సమాజంలో 50 శాతానికి పైగా అణగారిన వర్గాలు  ప్రజలు ఉన్నారని వారికి విద్య విలువ తెలిపేవిధంగా జ్యోతిరావు పూలే విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు.  మహిళల పట్ల చూపుతున్న వివక్షను పారద్రోలేందుకు సావిత్రిబాయి పూలే వారికి విద్య నేర్పాలని చూశారన్నారు. అట్టడుగు వర్గాల బాధలను చూసి డా.బిఆర్.అంబేద్కర్ వారికి రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని, దేశం సమగ్ర అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలని, విద్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా వారు అభివృద్ధి చెందాలని రిజర్వేషన్లు కల్పించారన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ కూడా గ్రామస్వరాజ్యం కోసం కలలుకన్నారన్నారు.

జ్యోతిరావు పూలే, అంబేద్కర్, మహాత్మా గాంధీ లాంటి వారు ప్రజల బాగోగుల కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశారన్నారు. సమసమాజం, గ్రామ స్వరాజ్యం స్థాపన కోసం, మహాత్ముల ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా వారు చూపిన బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్  జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారని గర్వంగా చెబుతున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలుకాని గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలు తీసుకువచ్చారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న గ్రామ స్వరాజ్యం స్థాపన కోసం గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారని, మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్  మోహన రెడ్డి మాత్రమే అన్నారు. ఆనాడు కలలుగన్న మహనీయుల ఆలోచనలను ముఖ్యమంత్రి ఆచరణలో పెట్టారన్నారు.

అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులోను    అనగారిన వర్గాల ఆర్థిక పురోభివృద్ధి, గౌరవం, రాజకీయ ఉన్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. తన క్యాబినెట్ లో 60 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించడం జరిగిందన్నారు. ఒక  ఎస్సీమహిళను హోంమంత్రిని చేయడం జరిగిందని, మరో గిరిజన మహిళని ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా వెనకబడిన వర్గాల కోసం రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. తన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు చూసి వారి అభ్యున్నతి కోసం సీఎం పాటుపడుతున్నారని, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక ఉన్నతిని కల్పిస్తున్నారన్నారు. వెనుకబడిన, అణగారిన వర్గాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

రాష్ట్రంలోని 137 రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కార్పొరేషన్లలో 58 నుంచి 60 శాతం వరకు పదవులను ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు కేటాయించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. అందులో మహిళలకు 50 శాతం స్థానాలను కేటాయించి వారిని గౌరవించిన గొప్ప వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని, రాష్ట్రంలో అనగారిన వెనుకబడిన వర్గాల వారు ముఖ్యమంత్రి జగన్ వెంట నిలబడుతూ అండగా ఉంటున్నారని, రాబోయే కాలంలో వారంతా జగన్ వెంటే నడుస్తారన్నారు.  జిల్లాలో కురుబ కులానికి చెందిన తనకు మంత్రి పదవి ఇచ్చి కీలకమైన బాధ్యతలు అప్పగించారన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, వారి బాధలు తీర్చాలని, వారిని సంతోషంగా ఉంచాలని తన పాదయాత్ర హామీలను నెరవేరుస్తూ ఇచ్చిన మాటను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమిస్తున్న సీఎం వైఎస్   జగన్మోహన్ రెడ్డి పదికాలాలపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రతిపక్షం నేతలు స్వాగతించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు ఉన్నత పదవులు ఇచ్చి సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ లిఖిత, మాజీ ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు పాల్గొన్నారు.


Comments