రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు అందరూ అందుబాటులో ఉండాల

 తాడేపల్లి (ప్రజా అమరావతి);    రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ ఆదేశించారు. గురువారం అంటే 22-7-2021న 13 జిల్లాల పంచాయతీరాజ్ అధికారులతో  అత్యవసరంగా నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో అయన మాట్లాడుతూ గౌరవ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సూచనల మేరకు గ్రామ పంచాయతీల్లో ప్రజలు తాగే నీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని, అలాగే ప్రాణనష్టం, పశునష్టం జరుగకుండా చూడాలని, అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు  చేపట్టాలని  ఆదేశించారు. 

లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని, అలాగే రహదారులపై చెట్లు కూలీతే వెంటనే తొలగించి, ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు లేకుండా చేయాలని సూచించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు కొరత లేకుండా చూడాలని, వరద బాధితులను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని అయన అన్నారు. ప్రతి జిల్లాలో  ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని,  కమిషనర్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులను సమీక్షిస్తామని ప్రజలకు అవసరమైన అన్ని సహాయ కార్యక్రమాలు జిల్లా అధికారులు చేపట్టాలని, అలాగే ఈ వర్షాలు తగ్గే వరకు అధికారులకు ఎటువంటి సెలవులు ఉండవని అంటూ అధికారులను  అప్రమత్తం చేశారు.