సచివాలయం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలి.

 సచివాలయం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలి*


*: జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్*

 హిందూపురం,జూలై 28 (ప్రజా అమరావతి):


సచివాలయం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలని సచివాలయ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం హిందూపురం పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో ఉన్న 2 మరియు 39వ వార్డు సచివాలయాలను పెనుకొండ సబ్ కలెక్టర్ నవీన్ తో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ప్రవేశపెట్టిందని, ప్రజలంతా ఏ అవసరమున్నా ఇక్కడికే వస్తారని, ప్రజలందరికీ మంచిగా సమాధానం ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. సచివాలయానికి వచ్చిన సర్వీసులను జాగ్రత్తగా పరిశీలన చేయాలన్నారు. ప్రతిరోజు సచివాలయానికి ఉద్యోగులంతా వచ్చి ఖచ్చితంగా అటెండెన్స్ వేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. వాలంటీర్ల కూడా అటెండెన్స్ వేసేలా చూడాలన్నారు.

సచివాలయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లను, లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాలన్నారు. జగనన్న తోడు, వైయస్సార్ బీమా, పెన్షన్ కానుక, ఆరోగ్యశ్రీ, బియ్యం కార్డు పంపిణీ, చేయూత తదితర పథకాల కింద అర్హులైన వారు ఉంటే వారికి ఆయా పథకాల కింద లబ్ధిని చేకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న సర్వీసులకు గడువులోపు పరిష్కారం చూపించాలన్నారు. గడువు దాటిన సమస్యలు ఒక్కటి కూడా పెండింగ్ ఉండడానికి లేదన్నారు. సచివాలయం పరిధిలో నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కింద ఇంటి నిర్మాణాలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. శానిటేషన్ కార్యక్రమాలు విరివిగా చేపట్టాలన్నారు. సచివాలయం పరిధిలో ఫీవర్ సర్వే తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతమందికి పూర్తయిందో చూసుకుని రెండవ డోస్ వ్యాక్సిన్ వేయించాలన్నారు. సచివాలయానికి మరిన్ని సర్వీసులు పెంచేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయంలో ప్రభుత్వ పథకాల పోస్టర్లను, జాబితాను, రిజిస్టర్లు తనిఖీ చేశారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ సచివాలయం ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహశీల్దార్ శ్రీనివాసులు, అడ్మిన్ సెక్రటరీ పవన్ కుమార్ రెడ్డి, సచివాలయ ఉద్యోగులు, హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Comments