ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు

 


- ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు 


- త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ 

- అల్లా పట్ల భక్తి, విధేయతలు కొనసాగాలి 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, జూలై 20 (ప్రజా అమరావతి): తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు జరుపుకునే బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీకగా అభివర్ణించారు. హజ్ యాత్ర చివర్లో ఈ బక్రీద్ పండుగను ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారన్నారు. అల్లా ఆదేశంతో ఇబ్రహీం అనే ప్రవక్త తన ఏకైక కుమారుడిని సైతం బలి ఇవ్వడానికి సిద్ధపడగా, ప్రవక్త త్యాగానికి సంతోషించిన అల్లా అతడి కుమారుడి బదులు గొర్రెను ఉంచుతాడన్నారు. నాటి నుండి బక్రీద్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు గొర్రెను బలి ఇచ్చి దాని మాంసాన్ని బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు,  పేదలకు పంచి మూడవ భాగాన్ని కుటుంబం కోసం కేటాయిస్తారన్నారు. ఈ బక్రీద్ పండుగ ముస్లిం సోదరులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తూ అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. అల్లా దగ్గర స్నేహితుల గురించి ప్రార్థించడానికి, వారి ప్రేమను, చిరునవ్వును పంచుకోవడానికి, అందరితో ఆనందంగా గడపడానికి ఉద్దేశించిన బక్రీద్ పండుగ రోజు నుండి అల్లా ఆశీస్సులతో ఆటంకాలన్నీ తొలగిపోవాలని ఆశించారు. అల్లా పట్ల భక్తి, విధేయతలు కొనసాగాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం జగన్మోహనరెడ్డికి అవసరమైన శక్తియుక్తులను అల్లా ప్రసాదించాలని మంత్రి కొడాలి నాని వేడుకున్నారు.

Comments