రోడ్లు, రవాణా, రహదారి భద్రతకు ప్రాధాన్యం

 




- రూ. 29.68 కోట్ల నిధులతో నూజివీడు - గన్నవరం రోడ్డు విస్తరణ, అభివృద్ధి 

- రోడ్లు, రవాణా, రహదారి భద్రతకు ప్రాధాన్యం 


- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 



గుడివాడ, జూలై 20 (ప్రజా అమరావతి): రూ. 29.68 కోట్ల నిధులతో నూజివీడు - గన్నవరం రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులను చేపడుతున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గన్నవరం మండలం బాహుబాలేంద్రగూడెం వద్ద నూజివీడు - గన్నవరం రహదారి విస్తరణ, అభివృద్ధి పనులకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తో కలిసి మంత్రి కొడాలి నాని భూమిపూజ, శంఖుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్లకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పెద్దఎత్తున ప్రజలు పుష్పగుచ్ఛాలు అందించి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో గన్నవరం నుండి సుమారు 9.4 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో రోడ్లు , రవాణా రంగం అభివృద్ధి, రహదారి భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 2021-22 వార్షిక బడ్జెట్లో రోడ్లు, భవనాలు, రవాణా శాఖకు రూ.7,594.06 కోట్ల కేటాయింపులు జరిగాయన్నారు. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఈ కేటాయింపులు రూ. 1,005.48 కోట్లు అధికంగా జరిగాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను పటిష్టం చేస్తున్నామన్నారు. కచ్చా రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. మండల కేంద్రాలను అనుసంధానించే రోడ్లను రెండు లైన్లుగా అభివృద్ధి చేయడం ప్రభుత్వ కార్యాచరణలో భాగంగా ఉందన్నారు. నాబార్డ్, ఆర్ఆర్ ప్లాంట్, ఆర్సీపీఎల్డబ్ల్యూఈ, ఈఏపీ పథకాల కింద రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపడతామన్నారు. కోర్ నెట్ వర్క్ రోడ్లు, రాష్ట్ర ప్రధాన రోడ్లు, జిల్లా ప్రధాన రోడ్ల విస్తరణకు అధిక నిధుల కేటాయింపు జరిగిందన్నారు. ఐఆర్సీ ప్రమాణాల మేరకు రోడ్లను నాణ్యతగా నిర్మించడం జరుగుతుందన్నారు . రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్యను ఐదు శాతం కన్నా తగ్గించేందుకు రహదారి భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. వాహనాల రద్దీని బట్టి రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్మోహనరెడ్డి సూచించారన్నారు. అవసరమైన ప్రాంతాల్లో వంతెనలు, అప్రోచ్ రోడ్లు, ఆర్‌వోబీలను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మున్సిపాలిటీల్లో కూడా రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. నూజివీడు - గన్నవరం రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు పూర్తయితే రెండు ప్రాంతాల మధ్య రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీబీ గూడెం సర్పంచ్ డొప్పలపూడి జయలక్ష్మి, రహదారులు, భవనాల శాఖ విజయవాడ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ కృష్ణ నాయక్, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డీ బలరాం తదితరులు పాల్గొన్నారు.

Comments