అమరావతి (ప్రజా అమరావతి);
*నేడు వరసగా రెండో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం
*
*క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్*
*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, లబ్దిదారులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*
*పేర్ని వెంకట్రామయ్య (నాని), రవాణా, సమాచార శాఖ మంత్రి*
శ్రీ జగన్ గారు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ వివిధ కార్యక్రమాల ద్వారా, పథకాల ద్వారా 59 లక్షల మందికి కాపు సోదర, సోదరీమణులకు రూ. 12 వేల కోట్ల విలువైన లబ్ది అందించడం జరిగింది. పేరుకే అగ్రవర్ణాలలో ఉన్నప్పటికీ కూడా ఆర్ధికంగా ఎంతో వెనుకబాటుతనంలో ఉన్న ఈ కాపు కులస్తులను శ్రీ జగన్ గారు ఎన్నికల ముందు మాయ, మోసం చేయకుండా, ఓట్ల కోసం మాటల ఎర వేయకుండా ప్రేమతో తను చేయగలిగే ప్రతీ పనిని, ప్రతీ మాటను సాహసంగా తెలియజేశారు. గడిచిన ప్రభుత్వంలాగా మాయ, మోసం చేయకుండా చెప్పిన ప్రతీ మాట నిలబెట్టుకోవడంలో భాగంగా ఐదేళ్ళలో ప్రతీ కాపు సోదరీమణికి ఐదేళ్ళలో రూ. 75 వేల ఆర్ధిక సాయం చేశారు. ఈ కరోనా కష్టకాలంలో కూడా ఈ పథకం ద్వారా చేస్తున్న సాయం వారికి ఎంతో ధైర్యానిస్తుంది. కాపుల్లో పేదలకు మిగిలిన కులాల మాదిరి అందించడం, కాపుల సంక్షేమం కోసం రెండేళ్ళలో ఇంత పెద్దమొత్తంలో ఖర్చుపెట్టడం సంతోషకరం. పేదరికం పోవాలంటే పిల్లల ఉన్నత చదువులే ముఖ్యమని భావించి సీఎం శ్రీ వైఎస్ జగన్ గారు ఆ మేరకు ఒకటో తరగతి నుంచి వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కాపుల ఆర్ధిక పరిస్ధితి మెరుగుపడుతుందన్న సంపూర్ణమైన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాను.
*చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి*
అన్నా...పేదవాడిని నిత్యం దహించేది దారిద్రం అయితే మీరు వెలుగు లేని జీవితాల్లో వారికి వెలుగు చూపిన ప్రప్రధముడు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న వారికి వెలుగులు పంచిన సీఎంగా మీరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడతారు. చంద్రబాబు మోసంతో దగాతో వంచనకు నిదర్శనమైతే మీరు పాలన అంటే నమ్మకం, భరోసా ఇచ్చారు మీరు. కాపు సోదరులు కుటుంబాల పోషణకు తల్లడిల్లుతుంటే మీరు వారికి భరోసా నిచ్చారు. మీ పాలన మనసుతో చేస్తున్నారని రుజువైంది. కాపు నేస్తం ద్వారా మీరు ఇస్తున్న డబ్బుతో వారు స్వయంశక్తితో ఎదిగేలా సిద్దమయ్యారు. విద్య ఒక్కటే సమానంగా పంచగలమని నాడు నేడు ద్వారా, ఎన్నో పథకాల ద్వారా మీరు చేస్తున్న కార్యక్రమాలు వారి జీవితాల్లో వెలుగులు తీసుకొస్తున్నాయి. కాపు నేస్తం ద్వారా లబ్దిపొందుతున్న అక్కచెల్లెమ్మలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు పాదయాత్రలో చూసిన కష్టాలను మనసుతో పరిష్కరిస్తూ ముందుకెళుతున్నారు. మీ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
*అమరావతి, లబ్దిదారు, పెద్దిశెట్టిపల్లి గ్రామం, చిత్తూరు జిల్లా*
పాదయాత్రలో మీరు ప్రజల కష్టాలు చూశారు, మీరు మా కోసం నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టారు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. మీరు చేస్తున్న అభివృద్ది, సంక్షేమం గురించి పొరుగు రాష్ట్రాల వారు కూడా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మోటివ్‌గా తీసుకుని ఆయా రాష్ట్రాలలో అమలుచేస్తున్నారు. ఎంతోమంది నాయకులు ఎన్నో వాగ్ధానాలు చేస్తారు కానీ మీరు మాట ఇచ్చారంటే అమలుచేస్తారు, మిగిలిన నాయకుల మాదిరి కాదు. కరోనా కష్టకాలంలో కూడా మీరు ప్రతీ పథకాన్ని అమలుచేస్తున్నారు. మీరు కాపులకు ఒక స్నేహితుడిలా మీరు మాకు దగ్గరయ్యారు. కాపులకు సంబంధించి ఎన్నో ఉద్యమాలు చేశారు కానీ మీరు కాపు నేస్తం ద్వారా మా కాపులందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. నేను ఒక రైతు బిడ్డగా చెబుతున్నాను, రైతు భరోసా నాకు అందింది, అలాగే ఉచిత బోరు వేయడం ద్వారా ఎంతో మందికి లబ్ది జరుగుతుంది. ప్రతీ కుటుంబానికి నెలనెలా పెన్షన్ ఇస్తున్నారు. ఎప్పుడూ ప్రజల గురించే మీరు ఆలోచిస్తున్నారు. మీరు ఇస్తున్న ఈ డబ్బును వృధా చేయకుండా మేం సద్వినియోగం చేసుకుంటున్నాం. మీరు సీఎంగా వచ్చిన వేళా విశేషం వర్షాలు బాగా పడుతున్నాయి, రాయలసీమలో కూడా అన్ని చెరువులు నిండాయి, బావులు నిండాయి, మీరు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని, మాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను.
*రుక్మిణీదేవి, లబ్దిదారు, సత్రంపాడు, ఏలూరు*
సీఎం గారు చాలామంది రాజకీయ నాయకులు అది చేస్తాం, ఇది చేస్తామన్నారు కానీ ఎవరూ ఏం చేయలేదు. మీరు మాత్రం మా కాపులను గుర్తించి మాకు ఒక స్ధాయిని ఇచ్చారు. గత ఏడాది నేను లాక్‌డౌన్ వల్ల వ్యాపారంలో పుర్తిగా నష్టపోయాను. నాకు కాపు నేస్తం ఉందని వలంటీర్ వచ్చి చెప్పడంతో నేను ఆ పథకంలో లబ్దిపొందాను, వ్యాపారం కూడా పుంజుకుంది, అలాగే నాకు ఒంటరి మహిళా పెన్షన్ కూడా అందుతుంది. మా అన్నయ్యలా మీరు మాకు అండగా ఉన్నారు, నేను మా పిల్లలను బాగా చదివించుకుంటున్నాను, నేను ఇంటి అద్దె కట్టలేక ఇబ్బంది పడేదాన్ని, ఇప్పుడు నాకు ఇంటి స్థలం కూడా వచ్చింది, నాకు పుట్టింటివాళ్ళు, అత్తింటివాళ్ళు లేకపోయినా మా అన్నయ్య ఉన్నారన్న ధైర్యంతో ముందుకెళుతున్నాం. మేం ఏ కష్టం లేకుండా బతుకుతున్నాం అంటే మీరే కారణం, నేను డ్వాక్రా గ్రూప్‌లో సభ్యురాలిని, చాలావరకు లబ్దిపొందాం. నాకు కోవిడ్ వచ్చినప్పుడూ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ బాగా చూసుకున్నారు, నేనిలా మీ ముందుకొచ్చానంటే మీరే కారణం. నాలా ఎంతోమంది అక్కాచెల్లెమ్మలు మీరు ఉన్నారన్న ధైర్యంతో బతుకుతున్నారు. మున్ముందు కూడా మీరే మాకు సీఎంగా ఉండాలి.
*తలాటం కాళీప్రియ, లబ్దిదారు, కాకినాడ*
అన్నా మాకు జిరాక్స్ షాప్ ఉంది, మేం కాపులని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే మీరే కారణం. మీరు మాట ఇచ్చారు అమలుచేస్తున్నారు. కాపు నేస్తం పథకం ద్వారా వచ్చిన డబ్బుతో నేను శారీ డిజైనింగ్ పెట్టుకున్నాను. నాకు ఇంకోమనిషిని కూడా సహాయంగా పెట్టుకున్నాను, డ్వాక్రాలో కూడా లబ్దిపొందాను, నేను నా కాళ్ళమీద బతుకుతాను అనే ధైర్యం వచ్చింది, మీ పథకాలు నాకు అందాయి, నాకు ఇళ్ళ పట్టా వచ్చింది, వర్షాలు పడుతున్నాయని ఇంకా నిర్మాణం ప్రారంభించలేదు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మిమ్మల్ని ఆహ్వనిస్తాను, తప్పకుండా రావాలి అన్నా...కాపు నేస్తం కరోనా టైంలో మాకు చాలా ఉపయోగపడింది, ఇప్పుడు రెండో విడత తీసుకుని నా వ్యాపారాన్ని వృద్ది చేసుకుంటాను. మా తమ్ముడికి వాహనమిత్ర వచ్చింది, వారి పిల్లలకు అమ్మ ఒడి వచ్చింది. నాకు ఇప్పుడు వస్తున్న డబ్బును రాఖీ పండుగ సందర్భంగా మా అన్నయ్యలా మీరు కానుకగా ఇచ్చారని ఆనందపడుతున్నాను. మీ రుణం తీర్చుకోలేను అన్నా...మా కాపులను ఇంతలా గుర్తించిన మీకు మా కాపు మహిళల అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అన్నా.
addComments
Post a Comment