పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు ఇస్తున్న శిక్షణా తరగతులలో భాగంగా

    అమలాపురం, 28 జూలై (ప్రజా అమరావతి).

     పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు ఇస్తున్న శిక్షణా తరగతులలో భాగంగా అమలాపురం డివిజన్ కు సంబంధించి డిఎల్పీఓ ఆర్.విక్టర్ ఆధ్వర్యంలో అమలాపురం టిటిడిసి లో నిర్వహిస్తున్న రెండవ బ్యాచ్ ( ముమ్మిడివరం, పి.గన్నవరం, మలికిపురం, రాజోలు మండలాల సర్పంచ్ లు) శిక్షణ తరగతుల ఆఖరి రోజైన బుధవారం సర్పంచ్ లు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ శిక్షణ తరగతులులో గ్రామ పరిపాలనకు సంబంధించిన అంశాలు, నిధుల నిర్వహణ , సర్పంచ్ ల బాధ్యతలు, తదితర అంశాలపై సర్పంచ్ లకు  అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన సర్పంచ్ లు డిఎల్పీఓ ఆర్. విక్టర్, డిఎల్డివో వి.శాంతామని, ట్రైనీలకు కృతజ్ఞతలు తెలిపారు.


*శిక్షణ తరగతులను ఉద్దేశించి సర్పంచ్ ల అభిప్రాయాలు*

ముమ్మిడివరం మండలం కర్రివాని రేవు గ్రామ పంచాయతీ సర్పంచ్ కాశి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చక్కగా నిర్వహించిన శిక్షణ తరగతులలో మూడు రోజులు మాకు తెలియని ఎన్నో విషయాలు నేర్చుకున్నామని అన్నారు. పంచాయతీ పరిధిలో జరిగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు జరిగే విధానం, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తున్న వాలంటీర్ల విధులు, ప్రజలకు అందే సేవలలో వారు పోషించే పాత్రలపై అవగాహన కలిగిందని, వాలంటీర్ వ్యవస్థపై ఉన్న అనుమానాలు నివృత్తి అయ్యాయని అన్నారు. గ్రామంలో వుండే అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాలా వద్దా అనే అనుమానం ఉండేదని ఈ శిక్షణ ద్వారా అనుమానం నివృత్తియై అంగన్వాడీల ద్వారా చిన్నారులకు, బాలింతలకు అందే సేవలపై పర్యవేక్షణ చేయవచ్చని విషయం తెలిసిందని అన్నారు.

పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పి.ఉమా మహేశ్వరి మాట్లాడుతూ మూడు రోజుల శిక్షణ తరగతులలో అనేక విషయాలను నేర్చుకున్నామని తెలిపారు. ముఖ్యంగా గ్రామ సర్పంచ్ మహిళ అయినప్పటికీ వెనుకవుండి నడిపించేది సర్పంచ్ భర్తలు, పంచాయతీ  సెక్రటరీలు అని, ఈ శిక్షణ తరగతుల ద్వారా మహిళలే సొంతంగా బాధ్యతలు తీసుకుని గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించగలరనే భరోసా మహిళా సర్పంచ్ లలో కల్పించడమే ఈ శిక్షణా తరగతులు ముఖ్య ఉద్దేశ్యం అని నేను తెలుసుకున్నానని ఆమె తెలిపారు. వాలంటీర్లపై అధికారం చూపించకుండా వారితో ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చూడాలని ఈ శిక్షణ తరగతులలో నేర్చుకోవడం చాలా సంతోషకమని ఆమె తెలిపారు. అదేవిధంగా ఫీల్డ్ విజిట్ ద్వారా మా గ్రామంలో కూడా ఒక చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని అభివృద్ధి చేసి సక్సెస్ ఫుల్ సర్పంచ్ గా పేరు తెచ్చుకుంటానని ఆమె తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

మలికిపురం మండలం చింతల మోరి గ్రామ సర్పంచ్ ఆర్.రమేష్ బాబు మాట్లాడుతూ మొదటిసారి గ్రామ సర్పంచ్ గా ఎన్నికయిన నాలాంటి వారికి ఈ శిక్షణ తరగతుల ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సర్పంచ్ తన అధికారుల ద్వారా తన గ్రామాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసుకోగలరో ఈ కార్యక్రమంలో చక్కగా వివరించారని అన్నారు. సచివాలయ సిబ్బందిని, వాలంటీర్ లను ఏవిధంగా ఉపయోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలో అవగాహన కలిగిందని, పంచాయతీ నిధుల నిర్వహణ, గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా ఉపాధి హామీ పనులను చేపట్టడం, ఇంకా మరెన్నో నూతన విషయాలు తాను నేర్చుకున్నానని, ఈ శిక్షణ ద్వారా గ్రామ సర్పంచ్ లు ఏవిధంగా తమ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపాలో అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారని, గ్రామ పరిపూర్ణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేసి, మంచి సర్పంచ్ గా పేరు తెచ్చుకుంటానని అభిప్రాయం వ్యక్తం చేశారు.