జగనన్నే మమ్మల్ని గుర్తించారు
పేరుకే పెద్దకులం మాది; కాపు మహిళల ఆవేదన
విజయనగరం, జూలై 22 (ప్రజా అమరావతి); మా కుటుంబం విజయనగరం వచ్చి 35 ఏళ్లయ్యింది, ఇంతవరకు మాకే ప్రభుత్వం గుర్తించలేదు, ఎలాంటి సహాయం అందించలేదు, జగనన్న వచ్చాకే మాకు సహాయం అందింది. ఇది విజయనగరం జిల్లాలోని కాపు మహిళల ఆవేదన. పేరుకే తమది పెద్దకులమని, వాస్తవానికి తమలో ఎంతోమంది నిరుపేదలు ఉన్నారని, తమలాంటి వారందరినీ పెద్దకులాల పేరుతో గత పాలకులు పట్టించుకోలేదని, జగనన్న వచ్చాకే మాకు కాపునేస్తం పథకం ద్వారా గత రెండేళ్లుగా అన్ని పథకాలు అందుతున్నాయని తోట ఉషాకుమారి అనే మహిళ ఆవేదనతో అన్న మాటలివి. నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న వీరికి అగ్రకులాల పేరుతో గతంలో ప్రభుత్వ పథకాలేవీ వీరి దరిచేరేవి కాదు. ఎంతో నిరుపేద కుటుంబంలో ఉన్నప్పటికీ పెద్దకులం అనే కారణంతో ఎలాంటి సహాయం అందని పరిస్థితుల్లో గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అందడంతో తమకు ఎంతో ఊరట కలుగుతోందని ఆమె చెప్పింది. కాపునేస్తం పథకం రెండోవిడత సహాయం అందుకోవడం కోసం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన పలువురు మహిళలు తమ అంతరంగాన్ని బయటపెట్టారు. తనకు ఇంటిస్థలం, ఇళ్లు కూడా మంజూరయ్యాయని ఉషాకుమారి చెప్పారు. తనకు కాపునేస్తం పథకం ద్వారా అందిన సహాయంతో బట్టల షాపు ప్రారంభించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా వలంటీర్లు మా ఇంటికి వచ్చి ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తున్నారని, అందువల్లే తాము ప్రభుత్వ పథకాలు పొందగలుగుతున్నట్టు చెప్పారు.
విజయనగరం రూరల్ మండలం పోలయ్యపేటకు చెందిన పోల మేరీ మార్గరెట్ కూడా గత రెండేళ్లుగానే ప్రభుత్వ పథకాలు పొందగలుగుతున్నారు. తనకు ఇళ్ల స్థలం కూడా వచ్చిందని తనకు మంజూరైన కాపునేస్తం ఆర్ధిక సహాయంతో కొత్తగా ఏర్పాటయ్యే జగనన్న కాలనీలో ఇళ్లు కట్టుకొని అక్కడే టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఆమె చెప్పారు. గత 30 ఏళ్లలో తాను ప్రభుత్వం నుంచి సహాయం పొందడం ఇదే మొదటిసారని పేర్కొంటూ జగనన్నే ఈ రాష్ట్ర సి.ఎం.గా కొనసాగాలని, అప్పుడే తమకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు.
addComments
Post a Comment