విజయవాడ (ప్రజా అమరావతి);
వేటపాలెం సొసైటీ వ్యవహారాల పై విచారణ చేపట్టండి: మంత్రి కన్నబాబు
ప్రకాశం జిల్లా చీరాల మండలం లోని వేటపాలెం కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆర్థిక వ్యవహారాల పట్ల వస్తున్న అభియాగాలపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని రాష్ట్ర వ్యవసాయ , సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సొసైటీ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు . ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం సెక్షన్ 51 ప్రకారం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. దీంతో హుటాహుటిన డిసిఓ రాజశేఖర్ , డీఎస్పీ శ్రీకాంత్, సీఐ రోశయ్యతో కలిసి వేటపాలెం లోని కో-ఆపరేటివ్ సొసైటీలో విచారణ చేపట్టారు. పలువురి సభ్యులతో చర్చించి వారి నుంచి వివరాలను సేకరించారు. బాధితుల ఫిర్యాదుతో కార్యదర్శి ఇతరులపై పోలీసు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ ఆర్థిక వ్యవహారాల అవకతవకలకు సంబంధించి ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ రిజిస్టర్ లతో ప్రాథమిక దర్యాప్తుకు ఆదేశించారు. డిపాజిట్ దారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సహకార శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో కలిసి పని చేస్తున్నాయని మంత్రి తెలిపారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి కన్నబాబు డిపాజిటర్లకు భరోసా ఇచ్చారు.
addComments
Post a Comment