రాజకీయ కక్ష సాధింపు కోసమే నరేంద్ర అరెస్ట్: చంద్రబాబు

 రాజకీయ కక్ష సాధింపు కోసమే నరేంద్ర అరెస్ట్: చంద్రబాబు


గుంటూరు (ప్రజా అమరావతి): రాజకీయ కక్ష సాధింపు కోసమే ధూళిపాళ్ నరేంద్రను అరెస్ట్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మంగళవారం చింతలపూడికి వచ్చిన చంద్రబాబు...ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబసభ్యలను పరామర్శించారు. అంనంతరం మీడియాతో మాట్లాడుతూ ధూళిపాళ్ల నరేంద్రది రాజకీయ చరిత్ర గల కుటుంబమని అన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. రైతులకు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి, నరేంద్ర ఎనలేని సేవలు చేశారని చెప్పారు. అలాంటి కుటుంబానికి చెందిన నరేంద్రను అరెస్టు చేయటం దుర్మార్గమని అన్నారు. ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లో మంచిది కాదని సూచించారు. సహకార రంగం నుంచి కంపెనీ చట్టంలోకి సంగం డెయిరీ చట్ట ప్రకారమే వెళ్లిందని...కానీ నరేంద్రను అమానుషంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని పార్టీ అధినేత అన్నారు. తీవ్రవాదులను తీసుకెళ్లినట్లు అరెస్టు చేశారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఓ రోజు వస్తుందని... తమకూ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అచ్చన్నాయుడుతో మొదలైన అరెస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. నాయకుడు తప్పు చేస్తే ఎక్కడ చేశారో చెప్పాలని, కనీసం సాక్ష్యాలు లేకుండా అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. తప్పుడు పనులు చేసేది తమరు అని విమర్శించారు. ‘‘నరేంద్ర ఆస్తులు గతంలో ఎంత ఇప్పుడు ఎంతో చూడండి...2004కు ముందు జగన్ కుటుంబ ఆస్తులు, ఇప్పుడు ఆస్తులు చూడండి’’ అని తెలిపారు. నరేంద్రకు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ధర్మం కోసం న్యాయం కోసం ప్రజలు కూడా అండగా నిలవాలన్నారు. ప్రజల కోసమే వైసీపీ అరాచకాలు భరిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

Comments