- శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కుటుంబ సమేతంగా మంత్రి కొడాలి నాని ప్రత్యేక పూజలు
- పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ పైలా
- వేదాశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం బహుకరణ
విజయవాడ, జూలై 24 (ప్రజా అమరావతి): రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) శనివారం కుటుంబ సమేతంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి డీ భ్రమరాంబలు కుటుంబ సమేతంగా వచ్చిన మంత్రి కొడాలి నానికి ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదాశీర్వచనాన్ని అందించారు. శేషవస్త్రాలతో ఘనంగా సత్కరించారు. అమ్మవారి చిత్రపటం, తీర్ధప్రసాదాలను ఆలయ చైర్మన్ సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి భ్రమరాంబలు అందజేశారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం భక్తులతో కళకళలాడుతోందన్నారు. శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో గత మూడు రోజులుగా శాకంబరీ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు. శాకంబరీ దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నానని చెప్పారు. ఉత్సవాలకు సంబంధించి ఆలయ పాలక మండలి, దేవాదాయ శాఖ అధికారులు చేసిన ఏర్పాట్లు, తీసుకున్న జాగ్రత్తల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అమ్మవారి కృపతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అలాగే ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం జగన్మోహనరెడ్డికి అవసరమైన శక్తియుక్తులను శ్రీకనకదుర్గమ్మ వారు ప్రసాదించాలని మంత్రి కొడాలి నాని వేడుకున్నారు.
addComments
Post a Comment