కనీవినీ ఎరుగని రీతిలో జగనన్న కాలనీలను నిర్మిస్తున్నాం.

 *కనీవినీ ఎరుగని రీతిలో జగనన్న కాలనీలను నిర్మిస్తున్నాం*



*: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మాత్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు*


*వైఎస్ జగన్ మానసపుత్రిక "నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు"*


*: రహదారులు భవనాల శాఖా మాత్యులు మాల గుండ్ల శంకర నారాయణ*


అనంతపురము, జూలై 27 (ప్రజా అమరావతి):

రాష్ట్రవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో జగనన్న కాలనీలను నిర్మిస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మాత్యులు చెరుకువాడ  శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న డిపిఆర్సీ భవనంలో నవరత్నాలు - పేదలందరికీ ఇల్లులో భాగంగా వైఎస్సార్ జగనన్న కాలనీల గృహనిర్మాణ సమీక్ష సమావేశాన్ని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిలతో కలిసి రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రారంభించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ప్రభుత్వ భూములతో కలిపి భూసేకరణ చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి వారం రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా వీటి పురోగతిపై సమీక్షించడం జరుగుతోందన్నారు. కరోనా సమయంలో ఇళ్ల నిర్మాణం ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించడం జరుగుతోందన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రతి ఒక్కరికి ఇసుకను ఉచితంగా అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి లేఔట్ వద్ద ఇసుక డంప్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. అలాగే సబ్సిడీ రేట్లపై స్టీల్ ను అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా లబ్ధిదారులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణ సామగ్రిని అందజేస్తోందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,28,074 ఇళ్ల నిర్మాణాలను చేపట్టామన్నారు. తద్వారా ఒక్కొక్క లబ్ధిదారునికి 15 లక్షలు విలువచేసే ఆస్తిని సమకూరుస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటికే ఈ పథకం కింద సుమారు 49 శాతం మంది లబ్ధిదారులు మూడవ ఆప్షన్ ను ఎంచుకున్నారన్నారు. రవాణా శాఖ అధికారులను, జిల్లాలోని క్రషర్ యజమానులను పిలిపించి జగనన్న కాలనీలకు అందించే మెటల్ ధరలను ప్రస్తుతం ఉన్న ధర కన్నా 20 శాతం తక్కువ ధరకు అందించేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గృహ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రతి లేఔట్ వద్ద ఒక మండల స్థాయి అధికారిని, ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షించాలన్నారు. లబ్ధిదారులకు అనుకూలంగా ఉన్న రీతిలో ఇల్లు నిర్మించుకునేలా గృహనిర్మాణశాఖ అధికారులు తోడ్పాటునందిస్తూ, అదనంగా వ్యయం అయ్యే మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులకు వారికి దగ్గరలో ఉన్న ప్రాంతాల నుండి ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లే ఇసుకకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 40 కిలోమీటర్ల పైబడి ఉన్న లేఔట్లకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోందన్నారు. 40 కిలోమీటర్లలోబడి ఇళ్లను నిర్మించే లబ్ధిదారులకు ఉచిత ఇసుక సరఫరా కోసం ఇసుక రీచ్ ల వద్ద ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు కలిసి ఈ పథకాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. అక్రమ మైనింగ్ చేసే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

వైయస్ జగన్ మానసపుత్రిక "నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు" : రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మాత్యులు మాలగుండ్ల శంకర నారాయణ.

ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  మానసపుత్రికగా అభివర్ణించారు. ఈ పథకం ద్వారా పేదలకు నిర్మించే ఇళ్లను 100 శాతం పూర్తి చేయడానికి అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే మెటల్ ను జిల్లా వ్యాప్తంగా సబ్సిడీ రేట్లపై అందించేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే లేఔట్ ల వద్ద ఇసుక యార్డులను ఏర్పాటు చేయాలని జేపీ సంస్థకు మంత్రి ఆదేశాలు ఇచ్చారన్నారు. క్షేత్రస్థాయిలో మ్యాపింగ్, ఇతర లబ్ధిదారులతో లింక్ కాబడిన ఆధార్ సమస్యలు అధికారులు పరిష్కరించాలని, లేకుంటే లబ్ధిదారులు ఇబ్బందులు పడతారన్నారు. ఇసుక, మెటల్ లభ్యత విషయంలో, అలాగే సకాలంలో లబ్ధిదారులకు వాటిని చేరవేయడానికి మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ వారు సమన్వయం చేసుకోవాలని సూచించారు. జగనన్న కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. అందుకనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు వెంటనే వారి శాఖల ద్వారా చేపట్టాల్సిన పనులను ఇళ్ల నిర్మాణాలతో పాటు పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులు అందరూ కృషి చేయాలని మంత్రి సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ మాట్లాడుతూ, ఇళ్ల నిర్మాణాలకు వివిధ శాఖలతో గృహ నిర్మాణ శాఖ అధికారులు సమన్వయం చేసుకొని లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టీల్, మెటల్, రవాణా లాంటి సమస్యలను పరిష్కరించడం జరుగుతోందన్నారు. అలాగే నియోజకవర్గాల వారీగా సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి గృహ నిర్మాణ సమస్యలను పరిష్కరించడంతో పాటు గృహ నిర్మాణాలను పురోగతిలోకి తీసుకొస్తామన్నారు. ఆప్సన్ 3 ఎంచుకున్న లబ్ధిదారుల మ్యాపింగ్ కూడా త్వరలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాలను బేస్మెంట్ స్థాయికి తెచ్చేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు.

మంత్రి సమీక్ష సమావేశానికి ముందు హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ల నిర్మాణంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాల పనులు, వాటి పురోగతి తదితర అంశాలపై మంత్రికి వివరించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్ రెడ్డి, ఇక్బాల్, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్, సింగణమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, అనంతపురం మేయర్ వసీం, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి,  జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, సబ్ కలెక్టర్ నవీన్, హౌసింగ్ జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.



Comments