ఇ-సంజీవనిలో దేశంలోనే అగ్రగామి ఎపి

 




ఇ-సంజీవనిలో 

దేశంలోనే అగ్రగామి ఎపి 


# దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా సేవలందించిన రాష్ట్రం ఏపీ ఒక్కటే


# కోవిడ్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేకాధికారి డాక్టర్  ఆర్జా శ్రీకాంత్ వెల్లడి


విజయవాడ (ప్రజా అమరావతి): 2019 నవంబర్ 7వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇ-సంజీవని (టెలిమెడిసిన్ సేవల) ప్రాజెక్టు సేవలందించటంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ఎపి కోవిడ్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేకాధికారి డాక్టర్  ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. 

 మొత్తం 20,13,248 మందికి  ఇ-సంజీవని టెలిమెడిసిన్ కన్సల్టేషన్ సేవలందించిన రాష్ట్రం ఏపీ  ఒక్కటేనని ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాలోని వైద్య కళాశాలల్లో ప్రభుత్వం 13 టెలి మెడిసిన్ హబ్ లను ఏర్పాటు చేసిందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. ఈ హబ్ ల ద్వారా టెలి మెడిసిన్ సేవలందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వున్న 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పిహెచ్ సి)లు, 2,914 ఎస్ హెచ్ సి(వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్)లు అనుసంధానం చేశారని పేర్కొన్నారు. ఈ సేవలలో భాగంగా ఉన్న ఇ-సంజీవని హెచ్ డబ్ల్యుసిలో ఆయా రంగాలకు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్లు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పిహెచ్ సి/ఎస్ హెచ్ సిలోని పేషెంట్లను సందర్శించి వారికి అవసరమైన ఔషధాలకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్లను ఆన్లైన్లో అందచేస్తారని ఆయన తెలిపారు. ఇక ఇ-సంజీవని ఓపిడిలో ఆస్పత్రులకు రాలేని పేషెంట్లను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా  వారికి వైద్య సేవలందిస్తారని, వైద్యులు సూచించిన ఔషధాలను రోగులకు ఇంటివద్దే అందచేస్తారని ఆయన వివరించారు. ప్రతి టెలిమెడిసిన్ హబ్లో జనరల్ మెడిసిన్ వైద్యుడు, చిన్నపిల్లల వైద్యుడు (పెడియాట్రీషియన్), స్త్రీ వైద్య నిపుణులు( గైనకాలజిస్ట్ )తో పాటు ఇద్దరు వైద్యాధికారులతో కూడిన బృందం  సేవలందచేస్తుందన్నారు.  

దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా సేవలందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కావడం  సంతోషించదగ్గ విషయమని  ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా జరిగి మొత్తం టెలి-మెడిసిన్ కన్సల్టేషన్లలో 25 శాతానికి పైగా మన రాష్ట్రంలో నమోదయ్యాయని, దీనితో మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అర్జా శ్రీకాంత్ పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు వైద్య సేవలందిస్తున్న వైద్య బృందాలకు ఆయన ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు.

Comments