నిరుపేద కుటుంబాల‌కు ఆర్ధిక తోడ్పాటే ల‌క్ష్యం

 

నిరుపేద కుటుంబాల‌కు ఆర్ధిక తోడ్పాటే ల‌క్ష్యం

రెండో విడ‌త కాపునేస్తం కార్య‌క్ర‌మంలో సి.ఎం. శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌

అర్హుల‌కు ప‌థ‌కాలు అందించ‌డంలో జిల్లా యంత్రాంగం స‌క్సెస్‌; శాస‌న‌స‌భ్యులు కోల‌గ‌ట్ల‌


విజ‌య‌న‌గ‌రం, జూలై 22 (ప్రజా అమరావతి)


; నిరుపేద కాపు కుటుంబాల‌కు ఆర్ధిక తోడ్పాటు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా మేనిఫెస్టోలో లేన‌ప్ప‌టికీ కాపు అక్కాచెల్ల‌మ్మ‌ల‌కోసం కాపునేస్తం ప‌థ‌కాన్ని గ‌త రెండేళ్లుగా  అమ‌లు చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పారు. నిండు మ‌న‌సుతో కాపు అక్కా చెల్లెమ్మ‌ల‌కు మంచి జ‌ర‌గాల‌నే తాప‌త్ర‌యంతో చేప‌ట్టిన కార్య‌క్ర‌మం ఇది అని ముఖ్య‌మంత్రి రెండోవిడ‌త కాపునేస్తం మొత్తాల విడుద‌ల కార్య‌క్ర‌మంలో గురువారం పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాపు, తెల‌గ‌, బ‌లిజ‌, ఒంట‌రి కులాల్లోని 45 నుంచి 60 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సుగ‌ల మ‌హిళ‌ల‌కు రెండోవిడ‌త కాపునేస్తం ఆర్ధిక స‌హాయాన్ని ముఖ్య‌మంత్రి శ్రీ జ‌గ‌న్ త‌న క్యాంపు కార్యాల‌యం నుంచి వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ కాపుల్లోని పేద కుటుంబాల‌కు గ‌త రెండేళ్ల‌లో రూ.12,126 కోట్ల స‌హాయాన్నివివిధ ప‌థ‌కాల ద్వారా అందించామ‌న్నారు. మ‌హిళ‌ల ఖాతాల్లో జ‌మ‌చేసిన నిధుల‌ను బ్యాంకులు త‌మ పాత‌బ‌కాయిల కింద జ‌మ చేసుకోకూడ‌ద‌ని స్ప‌ష్టంచేశామ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం రూ.1000 కోట్లు కాపుల‌కు ప్ర‌తి ఏటా ఇస్తామ‌ని చెప్పి క‌నీసం రూ.400 కోట్లు ఇవ్వ‌ని విషయాన్ని సి.ఎం. గుర్తుచేశారు. కాపునేస్తం ప‌థ‌కం ద్వారా ఒక్కో మ‌హిళ‌కు ఏడాదికి రూ.15వేల చొప్పున రెండేళ్ల‌లో రాష్ట్రంలో రూ.982 కోట్లు ఈ ప‌థ‌కం ద్వారా అందించామ‌న్నారు. అర్హులెవ‌రైనా మిగిలి వుంటే ఇప్ప‌టికీ ద‌ర‌ఖాస్తు చేసుకొనే అవ‌కాశం ఉంద‌ని సి.ఎం. చెప్పారు.


వ‌ర్షాల ప‌రిస్థితిపై అప్ర‌మ‌త్తంగా ఉండండి; సి.ఎం. ఆదేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే రెండురోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలియ‌జేస్తున్నందున జిల్లా క‌లెక్ట‌ర్‌లు త‌మ జిల్లాల్లో వ‌ర్షాల ప‌రిస్థితిపై నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తూ యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. ఇప్ప‌టికే వ‌ర్షాలు బాగా ప‌డుతున్నాయ‌ని ఎక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లు అవ‌స‌ర‌మైనా వెంట‌నే చేప‌ట్టాల‌న్నారు.


జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం నుంచి ముఖ్య‌మంత్రి నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్సు అనంత‌రం జిల్లాలోని 5,305 మంది మ‌హిళ‌ల‌కు రెండోవిడ‌త కాపునేస్తం కింద రూ.795.75 ల‌క్ష‌ల‌ను చెక్కు రూపంలో శాస‌న‌స‌భ్యులు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, బొత్స అప్పల‌న‌ర‌స‌య్య‌, బ‌డుకొండ అప్ప‌ల‌నాయుడు, ఎం.ఎల్‌.సి. సురేష్‌బాబు, జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ త‌దిత‌రులు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల మాట్లాడుతూ జిల్లాలో కాపునేస్తం ప‌థ‌కం కింద రెండేళ్ల‌లో రూ.16.15 కోట్లు అంద‌జేయ‌డం జ‌రిగింద‌న్నారు.


రాష్ట్రంలో కాపునేస్తం ప‌థ‌కంలో వ‌చ్చిన ద‌రఖాస్తుల్లో అతి త‌క్కువ‌గా తిర‌స్క‌ర‌ణ‌కు గురైన‌ది, అతిత‌క్కువ ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో వున్న‌ది మ‌న జిల్లాలోనే అని పేర్కొంటూ అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందించ‌డంలో జిల్లా యంత్రాంగం ముందంజ‌లో ఉంద‌ని చెప్ప‌డానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. జిల్లాలో ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారిలో 65 తిర‌స్క‌రించ‌డం జ‌రిగింద‌ని, 15 పెండింగులో వుంచార‌ని పేర్కొంటూ జిల్లా క‌లెక్ట‌ర్  డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ నేతృత్వంలో జిల్లా అధికారులు చ‌క్క‌గా ప‌నిచేస్తున్న కార‌ణంగానే ప‌థ‌కాల అమ‌లులో మ‌న జిల్లా మొద‌టిస్థానంలో నిలుస్తోంద‌న్నారు.


ప్ర‌కటించిన ఏ ఒక్క ప‌థ‌కాన్ని చెప్పిన విధంగా, చెప్పిన తేదీల్లో అందిస్తూ ముఖ్య‌మంత్రి శ్రీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కి రాష్ట్రంలో అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు జేజేలు పలుకుతున్నార‌ని ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల అన్నారు. గ‌త ప్ర‌భుత్వం మాట‌ల ప్ర‌భుత్వంగా పేరు పొంద‌గా, నేటి ప్ర‌భుత్వం చేత‌ల ప్ర‌భుత్వంగా పేరు తెచ్చుకుంద‌న్నారు.


జిల్లాలో నియోజ‌కవ‌ర్గాల వారీగా కాపునేస్తం ల‌బ్దిదారుల వివ‌రాల‌ను బి.సి.కార్పొరేష‌న్ ఇడి నాగ‌రాణి తెలియ‌జేస్తూ బొబ్బిలిలో 852 మందికి రూ.127.80 ల‌క్ష‌లు, చీపురుప‌ల్లిలో 419 మందికి రూ.62.85 ల‌క్ష‌లు, గ‌జ‌ప‌తిన‌గ‌రంలో 374 మందికి రూ.56.10 ల‌క్ష‌లు, కురుపాంలో 156 మందికి రూ.23.4 ల‌క్ష‌లు, నెల్లిమ‌ర్ల‌లో 1331 మందికి రూ.199.65 ల‌క్ష‌లు, పార్వ‌తీపురంలో 474 మందికి రూ.71.1 ల‌క్ష‌లు, ఎస్‌.కోట‌లో 460 మందికి రూ.69 ల‌క్ష‌లు, సాలూరులో 473 మందికి రూ.70.95 ల‌క్ష‌లు, విజ‌య‌న‌గ‌రంలో 766 మందికి 114.90 ల‌క్ష‌లు అంద‌జేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.


వీడియో కాన్ఫ‌రెన్సులో జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌, శాస‌న‌స‌భ్యులు బ‌డుకొండ అప్ప‌ల‌నాయుడు, బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, ఎం.ఎల్‌.సి. సురేష్‌బాబు, కొప్ప‌ల వెల‌మ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ నెక్క‌ల  నాయుడుబాబు, దాస‌రి కార్పొరేష‌న్ చైర్ ప‌ర్స‌న్ రంగుముద్రి ర‌మాదేవి, న‌గ‌ర‌పాల‌క సంస్థ మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, కార్పొరేట‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, బి.సి.  కార్పొరేష‌న్ ఇ.డి. నాగరాణి త‌దిత‌రులు పాల్గొన్నారు.




Comments