యుద్ద పరికరాల తయారీలో అగ్రదేశాల సరసన భారత్

 *భారత దేశ రక్షణ తో పాటు దేశ ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ఎనలేని కృషి*


 *యుద్ద పరికరాల తయారీలో అగ్రదేశాల సరసన భారత్*


 *నాగాయలంకలో క్షిపణి కేంద్ర నిర్మాణం పనులు*


 *ఆత్మీయ సమావేశం లో డిఆర్ డి ఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి*


 విజయవాడ జూలై 25: (ప్రజా అమరావతి);

 భారత దేశ రక్షణ తో పాటు ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ప్రస్తుతం ఎనలేని కృషి జరుగుతున్నదని యుద్ధ  అస్త్రశస్త్రాలు తయారీలో ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా వంటి అగ్రదేశాల సరసన భారత్ చేరగల్గదంటూ భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఓ)  చైర్మన్ మరియు దేశం గర్వించదగిన మిస్సైల్ మాంత్రికుడు డాక్టర్ జి సతీష్ రెడ్డి సగర్వంగా చెప్పారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హోటల్ ఐలాపురం సమావేశ మందిరంలో జరిగిన ఆత్మీయ సమావేశం లో ఆయన ప్రసంగించారు. నేడు యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా కు సంబంధించి వ్యాక్సిన్ కు ప్రతిగా తమ శాస్త్రవేత్తలు రూపొందించిన "2 డీజి" మందు ను తొలుత ప్రజా బాహుళ్యం లోకి చేరవేసేందుకు 18 ఫార్మా కంపెనీలకు తగు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించగా ఇప్పటికే ఆరు కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించి క్రమేణా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోగలమన్న విశ్వాసం తమలో ఉందన్నారు.... భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ ప్రోత్సాహంతో కేవలం వారం... పదిరోజుల్లోనే ఇప్పటికే 16 కేంద్రాల్లో వెయ్యి పడకల ఆసుపత్రి ప్రారంభించి జిల్లాస్థాయి వరకు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు... తాజాగా ఇంటినుంచే తగు చికిత్స కోసం 10 కేజీల ఆక్సిజన్ సిలిండర్ లను రాత్రి పగలు ఉత్పత్తి చేస్తున్నామని డాక్టర్ సతీష్ రెడ్డి చెప్పారు. గతంలో లో యేడాదికి 40 వేల పీపీఈ కిట్ల ఉత్పత్తి సాగితే ప్రస్తుతం రోజుకు పది లక్షల కిట్ల ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ అంశాలన్నింటి పై ప్రతి రెండు వారాలకు ఒకసారి భారత ప్రధాని స్వయంగా సమీక్ష జరుపుతున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం సంబంధించి తమ రక్షణ రంగం నానాటికీ బలోపేతమవుతున్నదన్నారు. శత్రు దేశాల ప్రయోగించే క్షిపణులను ముందుగానే గుర్తించి వాటిని ఆకాశంలోనే ధ్వంసం  చేయగలిగే అత్యున్నత క్షిపణులను నేడు ఉత్పత్తి చేయగల్గుతున్నామన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 48 కిలోమీటర్ల దూరం  వరకు దూసుకెళ్ళే అత్యంత శక్తివంత తుపాకులను తయారు చేసుకోగల్గుతున్నామంటూ.... ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ సామాగ్రిని మనంతట మనం ఉత్పత్తి చేసుకోగలటమే కాకుండా ఎగుమతులు చేయగలిగే స్థాయికి చేరగల్గామన్నారు. ప్రస్తుతం దాదాపు 11 వేల చిన్న పెద్ద పరిశ్రమల్లో దేశ రక్షణ సామాగ్రి తయారవుతుందని తాజాగా యువతరం... నవతరం ఈ రంగం వైపు శ్రద్ధ కనబరుస్తుంటడం సంతోషకరమన్నారు.

 నాగాయలంక మండలం "గుల్లలమంద" గ్రామంలో ప్రస్తుతం వెయ్యి మంది శ్రామికులతో క్షిపణి కేంద్ర నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయని అలాగే ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.

 శాసనసభ మాజీ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగువారైన ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ నూతలపాటి వెంకటరమణ, అలాగే డి ఆర్ డి ఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి వారి వారి రంగాల్లో దేశ ప్రజల మన్ననలు పొందుతూనే తెలుగు భాషకు తగు గుర్తింపు చేస్తున్నారంటూ కొనియాడారు.. సతీష్ రెడ్డి కి ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అనేకానేక అవార్డులతో ప్రస్తుతింపడుతున్నారని... మున్ముందు ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. తెలుగు రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.వి పూర్ణచంద్ తన స్వాగతోపన్యాసం లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహమలూరు గ్రామవాసి డాక్టర్ సతీష్ రెడ్డి పూర్వపు రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో నేడు మిస్సైల్ మాంత్రికునిగా దేశవిదేశాల్లో ప్రశంసలు పొందుతున్నారని అన్నారు.మిస్సైల్ తయారీ రంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా లండన్ రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నావిగేషన్ వారి సత్కారం పొందిన తొలి భారతీయ శాస్త్రవేత్త గా చరిత్రలో నిలబడి పోయారని అన్నారు.

 సభలో డాక్టర్ జి సమరం,డాక్టర్ ఎం సి దాస్ , డాక్టర్ పాలపర్తి శ్యామలానందప్రసాద్, రాష్ట్ర సమాచార కమిషనర్ ఐలాపురం రాజా తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ రెడ్డి ని ఘనంగా సత్కరించారు.

Comments