సవరించిన అంచనాలకు ఆమోదం తెలపండి


*పోలవరం ప్రాజెక్ట్‌....*

*సవరించిన అంచనాలకు ఆమోదం తెలపండి*

*కేంద్ర జల శక్తి మంత్రికి వైఎస్సార్సీపీ ఎంపీల విజ్ఞప్తి*

న్యూఢిల్లీ, జూలై 28 (ప్రజా అమరావతి): పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సవరించిన అంచనా వ్యయం 55,656 కోట్ల రూపాయలకు వెంటనే ఆమోదం తెలపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటరీ పార్టీ నాయకులు శ్రీ వి.విజయసాయి రెడ్డి, లోక్‌ సభాపక్ష నేత శ్రీ పీవీ మిధున్‌ రెడ్డి సారధ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం ఇక్కడి శ్రమ శక్తి భవన్‌లో మంత్రితో భేటీ అయ్యారు. ఈమేరకు వారందరూ సంతకాలు చేసిన వినతి పత్రాన్ని మంత్రికి అందచేశారు. సమావేశంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఆమోదించిన రెండవ సవరించిన అంచనా వ్యయాన్ని ఏమాత్రం జాప్యం చేయకుండా ఆమోదించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ నిధుల విడుదల ప్రక్రియను కూడా క్రమబద్దీకరించాలని, పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని రాజమహేంద్రవరంకు తరలించాలని కోరారు.

పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనా వ్యయం ఆమోదం కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనేక పర్యాయాలు జల శక్తి, ఆర్థిక మంత్రిత్వ శాఖల మంత్రులు, అధికారులతో సంప్రదింపులు, సమావేశాలు జరిపారు. అయినప్పటికీ సవరించిన అంచనా వ్యయంకు ఆమోదం తెలిపే విషయంలో కేంద్ర ప్రభుత్వం అసాధారణ జాప్యం చేస్తూ వస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌ కోట్లాది మంది ఆంధ్రుల స్వప్నం. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ద్వారా పొందిన హక్కు కూడా. అందువలన ఆంధ్రుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ జూన్‌ 2022 నాటికి ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని విజయసాయి రెడ్డి మంత్రికి వివరించారు.

అనేక సమావేశాలు, సంప్రదింపులు, విన్నపాలు, విజ్ఞప్తులు చేసినప్పటికీ పోలవరం జాతీయ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ విషయంలో నెలకొంటున్న సమస్యల పరిష్కారంలో కేంద్రం చురుగ్గా చర్యలు చేపట్టడం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం ప్రారంభించే సమయానికి 2010-11 నాటి ధరల ప్రాతిపదికపై అంచనా వ్యయానికి ఆమోదం లభించింది. తదనంతరం పెరిగిన ధరల కారణంగా ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి వాస్తవికమైన అంచనాలతో సవరించిన అంచనాలను సమర్పించాల్సిందిగా పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నిర్మాణంలో జరిగిన జాప్యం కారణంగా పెరిగిన వ్యయంతోపాటు డిజైన్లలో పలు మార్పులు, చేర్పులు, ధరల పెరుగుదల, కొత్తగా అమలులోకి వచ్చిన భూసేకరణ చట్టంలోని నియమ, నిబంధనలను అనుసరించి భూసేకరణకు, నిర్వాసితుల పునరావాసం, పునఃనిర్మాణానికి అయ్యే వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని 2017-18 నాటి ధరల ప్రాతిపదికపై 57,297 కోట్లతో సవరించిన అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీకి సమర్పించిందని విజయసాయి రెడ్డి చెప్పారు.

జల శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ (టీఎసీ) సూచనల మేరకు అంచనా వ్యయాన్ని రెండోసారి సవరించి 55,548 కోట్లతో ప్రతిపాదనలను సమర్పించడం జరిగింది. టీఏసీ ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూనే వాటిని కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ (ఆర్‌సీఈ) పరిశీలనకు పంపింది. ఆర్‌సీఈ ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం అంచనా వ్యయాన్ని 47,725 కోట్లకు కుదించి తుది ఆమోదం కోసం జల శక్తి మంత్రిత్వ శాఖకు పంపించినట్లు విజయసాయి రెడ్డి వివరించారు. అయితే జల శక్తి మంత్రిత్వ శాఖ రెండవ సవరించిన అంచనా వ్యయానికి ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇవ్వలేదు. పైగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎక్స్‌పెండిచర్‌ విభాగం సవరించిన అంచనా వ్యయంలో తాగు నీటి అంశాన్ని తొలగించి 2013-14 నాటి ధరల ప్రాతిపదికన లెక్కగట్టి అంచనా వ్యయాన్ని మరింత కుదించినట్లు ఆయన తెలిపారు. తాగు నీటి అంశం తొలగించడం కేంద్ర జల సంఘం నియమ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది.

ప్రాజెక్ట్‌లోని ప్రధాన అంశాలైన నీటి పారుదల, తాగు నీటి అంశాలకు సంబంధించిన వ్యయాన్ని 2013-14 నాటి ధరలకే జల శక్తి మంత్రిత్వ శాఖ పరిమితం చేసింది. ఫలితంగా ప్రాజెక్ట్‌లోని ఇతర అనేక కీలకమైన అంశాలకు చేసిన ఖర్చును తిరిగి రాష్ట్రానికి చెల్లించడానికి పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ నిరాకరించింది. గతంలో ఆమోదం పొందిన పనులకు సంబంధించి పెరిగిన వ్యయాన్ని తిరిగి చెల్లించడానికి అథారిటీ నిరాకరించడంతో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి విడుదలయ్యే నిధులపై తీవ్ర ప్రభావం పడిందని వివరించారు. కాబట్టి అంశాలవారీగా మాత్రమే ఖర్చు చేయాలన్న నిబంధనను తొలగించాలని ఆయన మంత్రిని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని అప్పట్లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. అయితే దీనిని తరలించే అధికారం ప్రాజెక్ట్‌ అథారిటీకి ఉంది. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, పునఃనిర్మాణ పనులను ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్‌ అథారిటీ పర్యవేక్షించాల్సి ఉన్నందున 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని ప్రాజెక్ట్‌కు సమీపంలోని రాజమహేంద్రవరంకు తరలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సమావేశం అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము చేసిన విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అయితే రెండవ సవరించిన అంచనా వ్యయం 55,548 కోట్లకు బదులుగా రివైజ్డ్ కాస్ట్ కమిటీ సిఫార్సు చేసిన 47,725 కోట్ల అంచనా వ్యయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. అలాగే ప్రాజెక్ట్ నిర్మాణంలోని అంశాల వారీగా జరిగే పనులకు చెల్లింపులకు బదులుగా మొత్తం పనులను పరిగణలోనికి తీసుకుని చెల్లింపులు చేయాలన్న విజ్ఞప్తికి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం తరలించడానికి కూడా మంత్రి అంగీకరించినట్లు చెప్పారు.

Comments