ఏలూరు (ప్రజా అమరావతి);
*ఇళ్ళ నిర్మాణంపై "ఈ" ఏడుపేంటి..?*
*- 14 ఏళ్ళ బాబు పాలనలో సెంటు స్థలమైనా పేదలకు ఇచ్చాడా..! రామోజీకి నాడు కనిపించలేదా..!?*
*- రూ. 15 లక్షల ఆస్తిని 31 లక్షల మంది పేదలకు ఇస్తుంటే ఓర్వలేకే విషపు రాతలు*
*- రూ. 32 వేల కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నుంచి ఇంటర్నెట్ వరకు జగనన్న కాలనీల్లో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం*
*- జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం జరిగితే ... చూడగల శక్తి కానీ, చూసి ఆనందించే శక్తి కానీ అటు రామోజీకి గానీ, ఇటు చంద్రబాబుకు కానీ, రాధాకృష్ణకు ఉందా?*
*- మనసున్న ముఖ్యమంత్రిగా శ్రీ జగన్ సంక్షేమ కార్యక్రమాలు అమలు*
*- ఇళ్ళ నిర్మాణంలో నేడు ఏపీ మొదటి స్థానంలో ఉంది.. బాబు హయాంలో 27వ స్థానంలో ఉండేది.*
*- ఒక ఇల్లు కడితే 140 మందికి ఉపాధి.. పక్కా ఇళ్ళ నిర్మాణం ఆర్థిక పురోగతికి ఊతం*
31 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా పేదలకు పంపిణీ చేసి, పక్కా ఇళ్ళు నిర్మించి, ఒక్కొక్కరికీ దాదాపు రూ. 15లక్షల ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలన చూసి ఓర్వలేకే చంద్రబాబు అండ్ కో విష ప్రచారం చేస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు ధ్వజమెత్తారు.
ఏలూరులోని జిల్లా పరిషత్ భవనంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 14 ఏళ్ళ పాలనలో ఒక్క సెంటు స్థలం అయినా చంద్రబాబు పేదలకు పంచారా అని నిలదీశారు. జీవితంలో సెంటు స్థలం కూడా పేదలకు ఇవ్వని చంద్రబాబుని ఏనాడూ ప్రశ్నించని ఈనాడు రామోజీరావు.. పేదలకు మంచి చేస్తున్న ఈ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, పక్కా ఇళ్ళ నిర్మాణంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం తగునా అని మంత్రి శ్రీరంగనాథరాజు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, అసత్యాలు, అబద్ధాలతో కూడిన రాతలు రాస్తూ ప్రజల్లో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదలందరికీ జగనన్న పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతున్న మీదట చంద్రబాబు నాయుడు, ఈనాడు ఏ తరహాలో బాధపడతారో, ఏరకంగా దుష్ప్రచారం చేస్తారో.. ఈరోజు ఈనాడు పత్రిక చూస్తే అర్థమౌతుందని, మీ ఇల్లు మీరే కట్టుకోండంటూ ఇవాళ ఈనాడు పత్రిక బ్యానర్‌గా ప్రచురించిన కథనం ఒక సిగ్గుమాలిన వ్యవహారం అని అన్నారు. రూ. 32 వేల కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నుంచి ఇంటర్నెట్ వరకు జగనన్న కాలనీల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ఒక ఇల్లు కడితే 140 మందికి ఉపాధి దొరుకుతుందని, ప్లంబింగ్, విద్యుత్, ఇనుము, ఇసుక.. వీటన్నింటినీ తీసుకుంటే ఎంతోమందికి ఉపాధి కలగడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పురోగతికి కూడా ఊతమిస్తుందన్నారు.
*మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..*
1. జగనన్న వైయస్‌ఆర్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన మూడు ఆప్షన్లలో ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించి, కట్టించి ఇవ్వాలన్న ఆప్షన్‌ను 3.27 లక్షల మంది ఎంచుకున్నారు. వీరందరికీ ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుంది. 20 ఇళ్లకు ఒక మేస్త్రీ పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఇందులో ఎటువంటి తేడా ఉండదు. కానీ అబద్ధాలకు రంగులు వేస్తూ.. ఈనాడు ఒక వార్తా కథనం రాసింది. ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.3-4 లక్షలు ఖర్చు అవుతుందని రాశారు. సిమెంట్ సబ్సిడీ ధరలో ప్రతి బ్యాగ్ రూ.225లకే ప్రభుత్వం ఇస్తోంది. ఇసుక ఉచితంగా ఇస్తోంది. కాబట్టి ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షలు ఖర్చు అవుతాయని ముందుగానే సరైన అంచనా వేసి, ఆ ప్రకారమే ఇవ్వటం జరుగుతోంది. మరి రూ.3-4 లక్షల లెక్క ఈనాడుకు ఎలా వచ్చింది? రూ.3 లక్షలో, రూ.4 లక్షలో అంటే లక్ష రూపాయలు తేడా ఉంది. వారికిష్టం వచ్చిన అంకెలు రాయటానికి అలవాటు పడ్డారు.
2. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా పేదలకు ఇచ్చిన ప్రభుత్వానికి మనసు ఉంది. ఇటువంటి కార్యక్రమం జీవితంలో చేయని చంద్రబాబు మీద రామోజీ రావు గారికి బాగా మనసు ఉంది అని అర్థమవుతోంది.
3. తనకు నచ్చిన వ్యక్తి, తన మాట వినే వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదన్న కడుపు మంటతో వైయస్‌ఆర్ గారి మీద, ఆయన కుటుంబం మీద ఇప్పుడు జగన్ గారి మీద ఇలాంటి అబద్ధాలు రాసి..రాసి.. ప్రజలతో ఎన్నోసార్లు ఛీ కొట్టించుకున్నారు. అయినా బుద్ధి రాలేదు.
4. పేదలకు వైయస్‌ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం జరిగితే ... చూడగల శక్తి కానీ, చూసి ఆనందించే శక్తి కానీ అటు రామోజీరావుకు గానీ ఇటు చంద్రబాబుకు కానీ, రాధాకృష్ణకు ఉందా?
5. ఇంటి నిర్మాణానికి రూ. లక్షా 20వేలు, కూలీలకు రూ. 60 వేలు మొత్తం రూ. 1.80 లక్షలకు మించి ధరలు పెరగకుండా చూసే బాధ్యత మా ప్రభుత్వానిది. ఇది ఒకరోజుతో అయ్యే కార్యక్రమం కాదు. 31 లక్షలమందితో కూడినటువంటి కార్యక్రమం. 40 కిలోమీటర్లు దాటితే ఇంటి నిర్మాణం మెటీరియల్ లబ్దిదారుల ఇంటి వద్దకే నేరుగా అందజేస్తున్నాం.
6. నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలంతో పాటు, ఇల్లు కట్టించి ఇస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు. అలాంటిది ప్రభుత్వంపై చంద్రబాబు, ఎల్లోమీడియా అక్కసుతో అడ్డమైన రాతలతో లబ్ధిదారుల్లో ఆందోళన కలుగచేయాలని కుట్ర పన్నుతున్నారు.
7. ముఖ్యమంత్రిగారు ప్రతి పదిరోజులకు ఒకసారి గృహ నిర్మాణం కార్యక్రమంపై పూర్తి స్థాయీలో సమీక్ష నిర్వహిస్తున్నారు. జగనన్న కాలనీల్లో రూ.32 వేల కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ సదుపాయం, ఇంటర్ నెట్ సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే రూ.12 వందల కోట్లతో అన్ని కాలనీల్లో మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పించాం. గృహ నిర్మాణ మంత్రిగా ఇప్పటికే తాను 10 జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పరిశీలించానని, త్వరలో మరో మూడు జిల్లాల్లో పర్యటిస్తా. వారానికి అయిదు రోజులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లే అవుట్లు పరిశీలించి సమీక్ష జరుపుతున్నాం.
8. మీడియా అయినా, విపక్షాలు అయినా నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే తీసుకుంటాం. 31లక్షల మందికి ఇళ్లు కట్టించేలా చేయడమే మా ప్రభుత్వ ఏకైక లక్ష్యం. భారతదేశ చరిత్రలోనే ఇదో చరిత్రాత్మక ఘట్టం. గృహ నిర్మాణాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు హయాంలో 27వ స్థానంలో ఉంటే.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తొలి స్థానంలో ఉంది. యూపీని దాటి ఏపీ మొదటి స్థానంలోకి వచ్చింది. ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి.
9. ఇన్ని మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు తన హయాంలో పేదలకు సెంటు స్థలం అయినా ఇచ్చారా? ఆరోజు రామోజీరావు, రాధాకృష్ణకు ఇవేమీ కనిపించలేదా?. ఆరోజు ఏమయ్యారు మీరంతా? ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇళ్ల నిర్మాణాలు జరుపుతుంటే దానిపై ఈనాడు దుష్ప్రచారం చేయడం సరికాదు.
10. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 31 లక్షల మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఏకంగా ఊళ్ళనే నిర్మిస్తున్న ఘనత ఒక్క జగన్‌గారికే దక్కుతుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు చేపట్టిన ఈ మహా యజ్ఞంలో మంత్రులు, అధికారులు పాలుపంచుకోవడం అనేది మా పూర్వజన్మ సుకృతం.
addComments
Post a Comment