కొండపల్లిలో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి మైనింగ్ జరుగుతోంది

 


- కొండపల్లిలో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి మైనింగ్ జరుగుతోంది 


- 1978 నుండి మైనింగ్ కు సంబంధించిన మ్యాప్ లు 

- 2014-19 ప్రాంతంలో అత్యధికంగా మైనింగ్ 

- 2016 లో కొత్త మైన్స్ ను ప్రారంభించిన దేవినేని ఉమా 

- డబ్బులు ఇవ్వకపోతే ఫారెస్ట్ ల్యాండ్ గా దొంగ నివేదిక 

- కేఈ కృష్ణమూర్తి హయాంలో మైనింగ్ కు అనుమతులు 

- ఫారెస్ట్ అధికారులు వద్దంటే స్టే ఇప్పించింది ఉమానే 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తాడేపల్లి, జూలై 28 (ప్రజా అమరావతి): కొండపల్లి ప్రాంతంలో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి మైనింగ్ జరుగుతోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండపల్లి ప్రాంతంలో మైనింగ్ జరుగుతోందంటూ అక్కడున్న గ్రామ పెద్దలు, ప్రజలపై దేవినేని ఉమా దుర్భాషలాడారన్నారు. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, మైనింగ్ ను ఆపాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న మీకు లేదా అంటూ చంద్రబాబు గతంలో ఎన్నికల సమయంలో గుంటూరు, విజయవాడ సభల్లో ప్రజలను ఏ విధంగా తిట్టాడో అదే రకంగా దేవినేని ఉమా అక్కడున్న ప్రజలను తిడితే వాళ్ళు తిరగబడ్డారన్నారు. వైసీపీ నాయకుడికి చెందిన కారు అద్దాలను ధ్వంసం చేశారని, ఎల్లో మీడియా మాత్రం ఆ కారును దేవినేని ఉమా కారుగా చూపించారన్నారు. దళితులను నోటికొచ్చినట్టు తిట్టడంతో పాటు అడొచ్చిన పోలీసులను కూడా దుర్భాషలాడారన్నారు. పోలీసులు తమ విధులను నిర్వర్తించుకోనివ్వకుండా దేవినేని ఉమా, అతని అనుచరులు అడ్డుపడ్డారన్నారు. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదని, వైఎస్ రాజశేఖరరెడ్డి, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తున్నాయని, రేపు మేమే అధికారంలోకి వస్తున్నామని, అప్పుడు మీ బట్టలూడదీస్తామని, టోపీలు పీకుతామంటూ పోలీసులను కూడా బెదింరిచారన్నారు. ఈ నేపథ్యంలో కేసులు పెడితే చంద్రబాబు దగ్గర నుండి టీడీపీలో ప్రతి ఒక్కరూ దేవినేని ఉమా దేశకీ నేతలా వెనకేసుకొచ్చారన్నారు. దేవినేని ఉమా సొల్లుగాడని, అతనికేదో అన్యాయం జరిగిపోతోందంటూ ఎల్లో మీడియాలో పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడారన్నారు. అక్కడ ఇళ్ళ నిర్మాణానికి వినియోగించుకునే కంకరను తయారు చేసే క్వారీలు 1978 నుండి ఉన్నాయన్నారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం, దొనబండ ప్రాంతాల్లో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి మైనింగ్ జరుగుతోందన్నారు. 1978 నుండి మైనింగ్ జరుగుతున్నట్లుగా మ్యాప్ లను కూడా పరిశీలించవచ్చన్నారు. దీనిలో దేవినేని ఉమా మంత్రిగా, మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఎంత మైనింగ్ జరిగిందో మార్క్ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. 2014 నుండి 2019 వరకు అత్యధిక మైనింగ్ ఈ ప్రాంతంలోనే జరిగిందన్నారు. 40 ఏళ్ళలో ఎంత మైనింగ్ జరిగిందో, దానిలో 70 శాతం మైనింగ్ ఐదేళ్ళలోనే జరిగిందని చెప్పారు. 1978 నుండి కాంట్రాక్టర్లను, క్రషర్స్ ఓనర్లను దేవినేని ఉమా బెదిరించి 2016 లో కొత్త మైన్స్ ను  ప్రారంభించారన్నారు. డబ్బులివ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడని, ఇవ్వకపోతే ఆ ప్రాంతాన్ని ఫారెస్ట్ ల్యాండ్ గా దొంగ రిపోర్ట్ రాయించాడన్నారు. 2018 లో ఆ క్వారీలన్నీ దేవినేని ఉమా నిలిపి వేయించాడన్నారు. మళ్ళీ వాళ్ళందరినీ పిలిపించుకుని చిల్లర వసూలు చేసుకుని రెవెన్యూ మంత్రిగా కేఈ కృష్ణమూర్తి ఉన్న సమయంలో ఫారెస్ట్ ల్యాండ్ కాదని, రెవెన్యూ ల్యాండ్ అని, దీనిలో మైనింగ్ చేసుకోవడానికి మాకేమీ అభ్యంతరం లేదని అనుమతులు ఇప్పించాడన్నారు. ఫారెస్ట్ అధికారులు జోక్యం చేసుకుని మైనింగ్ ను ఆపమనడంతో దానిపై స్టే కూడా దేవినేని ఉమా ఇప్పించాడన్నారు. దేవినేని ఉమాకు అధికారం పోయిన తర్వాత 2020 లో ఇక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దోపిడీ చేస్తున్నాడని, ఇవన్నీ మైనింగ్ భూములని, మైనింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారంటూ మైనింగ్ ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడన్నారు. డబ్బులు కావాల్సి వస్తే అక్కడున్న క్రషర్స్ యజమానులను బెదిరించి మైనింగ్ ను ఆపుతానని, నెల నెలా మామూళ్లు ఇవ్వాలని, సంవత్సరానికి ఇంత ఇవ్వాలని డబ్బులు బేరాలాడుకుంటున్నాడన్నారు. ఈ పరిస్థితుల్లోనే అక్కడకు వెళ్ళి ఏదో రకంగా గొడవలు సృష్టించి మైనింగ్ ఆపించాలని ప్రయత్నించాడన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహనరెడ్డి పెద్దఎత్తున చేపట్టిన ఇళ్ళ నిర్మాణాలకు కంకర కావాల్సి ఉంటుందని, అది దొరకకూడదని, కృష్ణాజిల్లాలో ఇళ్ళ నిర్మాణాలు జరగకూడదని అనుకుంటున్నారన్నారు. ఈ రకం అక్కడ మైనింగ్ ఆపించి అల్లరి చేయాలని, కాంట్రాక్టర్లు, మైనింగ్ ఓనర్ల దగ్గర డబ్బులు వసూళ్లు  చూస్తున్నాడన్నారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు ముందుకెళ్ళకూడదన్న ఆలోచనతో దేవినేని ఉమా ఉన్నాడని మంత్రి కొడాలి నాని తెలిపారు.