- గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా చర్యలు
- రూ. 10.30 కోట్లతో నూతన భవన నిర్మాణం
- 10 రకాల ఓపీ, ఐవీ విభాగాలను ఏర్పాటు చేస్తాం
- అదామా ఆక్సిజన్ గ్యాస్ ప్లాంట్‌ను నెలకొల్పుతున్నాం
- రూ. 40 లక్షలతో మరో ఆక్సిజన్ గ్యాస్ ప్లాంట్
- థర్డ్ వేవ్ నేపథ్యంలో పిడియాట్రిక్ వార్డు ఏర్పాటు
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, జూలై 28 ( ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని శ్రీమతి అన్నే పుష్పలీలావతి, శ్రీ అన్నే నరసింహారావు గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 100 పడకల ప్రభుత్వాసుపత్రి భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ విభాగాల ద్వారా మెరుగైన సేవలు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే శిథిలమైన భవనం స్థానంలో నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నుండి రూ. 10.30 కోట్ల నిధులను మంజూరు చేయించానన్నారు. టెండర్లను మెగా ఇంజనీర్స్ సంస్థ దక్కించుకుందని, ఈ ఏడాది జనవరి 30 వ తేదీన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. భవన నిర్మాణం పూర్తయితే ఒకే చోట 10 రకాల ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ విభాగాల ద్వారా మెరుగైన సేవలను అందించవచ్చన్నారు. మొదటి అంతస్థులో మెడికల్, సర్జికల్, గైనిక్, ఆప్తాల్మాలజి, ఈఎన్టి, పిడియాట్రిక్ వంటి విభాగాలను ఏర్పాటు చేస్తామన్నారు. రెండవ అంతస్థులో ఆయా విభాగాలకు సంబంధించిన వార్డుల్లో ఇన్ పేషెంట్ సేవలను అందిస్తామన్నారు. ఇదిలా ఉండగా గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కరోనా సోకన వారికి మెరుగైన వైద్య సేవలను అందిస్తూ వస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ ను కేటాయించాలని తాను కోరడంతో అదామా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సౌత్ ఇండియాలో మొదటగా గుడివాడ ప్రభుత్వాసుపత్రికి ఆక్సిజన్ గ్యాస్ జనరేట్ ప్లాంట్ ను అందజేసిందన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు ప్లాట్ ఫామ్ ను సిద్ధం చేశామన్నారు. షెడ్డు నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయన్నారు. కొద్దిరోజుల్లో ప్లాంట్ వినియోగంలోకి రానుందని చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో నిరంతరాయంగా 300 బెడ్స్ కు ఆక్సిజన్ ను సరఫరా చేయవచ్చన్నారు. అలాగే సిలిండర్లను కూడా నింపుకుని అవసరమైన మేర ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుకోవచ్చన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు రూ. 40 లక్షల నిధులను మంజూరు చేసిందన్నారు. త్వరలో ఈ ప్లాంట్ ను కూడా నెలకొల్పుతామన్నారు. కరోనా సెకండ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రిలో 20 ఆక్సిజన్ బెడ్స్ సామర్ధ్యంతో పిడియాట్రిక్ వార్డును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటిలో 10 ఐసీయూ బెడ్లు ఉంటాయని తెలిపారు. గుడివాడ ప్రభుత్వాసుపత్రి ద్వారా గుడివాడ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యమని మంత్రి కొడాలి నాని తెలిపారు.
addComments
Post a Comment