- అల్పపీడనం ఏర్పడిన దృష్ట్యా ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు
- పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టండి
- అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, జూలై 22 (ప్రజా అమరావతి): వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన దృష్ట్యా కృష్ణాజిల్లా గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గురువారం గుడివాడ డివిజన్ లోని తొమ్మిది మండలాల్లో నెలకొన్న పరిస్థితులపై రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ డివిజన్‌లోని తొమ్మిది మండలాల్లో కూడా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయమయ్యే పరిస్థితులు ఉన్నాయన్నారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో చేపల, మంచినీటి చెరువులు ఉన్నాయని, వీటి గట్లు తెగినా, కాల్వలు పొంగినా వెంటనే ఆయా మండలాల్లోని కంట్రోల్ రూంలకు తెలియజేయాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి వర్షపునీరు చేరిన వెంటనే ఆ నీటిని డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా దిగువకు వెళ్ళేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శివారు కాలనీల్లో ముంపు సమస్య లేకుండా చూడాలన్నారు. శానిటేషన్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కాలనీల్లో ముంపు సమస్య ఎదురైతే వెంటనే రిలీఫ్ క్యాంప్ ను ఏర్పాటు చేసి ప్రజలు ఇబ్బందుల పడకుండా అన్ని ఏర్పాట్లూ చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా అవసరమైన ప్రాంతాల్లో మెడికల్ క్యాంలను నిర్వహించాలని ఆదేశించామన్నారు. గుడివాడ డివిజన్ లో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా తీరం వెంబడి గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దీనివల్ల సముద్రం అలజడిగా ఉంటుందన్నారు. మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ సమస్య ఎదురైనా వెంటనే కంట్రోల్ రూంలకు తెలియజేయాలని మంత్రి కొడాలి నాని కోరారు.
addComments
Post a Comment