సామాజిక న్యాయం అంటే తన కులానికి న్యాయం చేసుకోవడమే చంద్రబాబుకు తెలుసు
- ఎన్టీఆర్ ఆశయాలకు తిలోదకాలిచ్చిన చంద్రబాబు
- జగన్ కు గాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్, వైఎస్సార్ లే ఆదర్శం
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
తాడేపల్లి, జూలై 18 (ప్రజా అమరావతి): సామాజిక న్యాయం అంటే చంద్రబాబుకు తెలిసింది తన కులానికి న్యాయం చేసుకోవడమేనని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) విమర్శించారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఒకేసారి 137 కార్పోరేషన్ పదవులను అధికారికంగా ప్రకటించిన వ్యక్తి జగన్మోహనరెడ్డి అని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడని, ఎప్పుడైనా రాష్ట్రంలో ఉన్న కార్పోరేషన్ పదవులన్నీ ఒకేసారి ప్రకటించిన చరిత్ర ఆయనకు ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక పనికిమాలిన వెధవ అని, సామాజిక న్యాయం అంటే తన కులానికి న్యాయం చేసుకోవడమేనని అనుకుంటాడన్నారు. జగన్మోహనరెడ్డి తన కేబినెట్ లో 56 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్థానం కల్పించారని, కార్పోరేషన్ పదవుల్లోనూ ఇంకో రెండు శాతం అదనంగా 58 శాతం పదవులను కేటాయించారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరెవరు, ఎక్కడెక్కడ పనిచేశారు, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఎవరున్నారనే లెక్కలను సీఎం జగన్మోహనరెడ్డి బేరీజు వేసుకున్నారన్నారు. ఎన్ని వత్తిళ్ళు వచ్చినా, ఎంత మంది ఆయనను ప్రలోభ పెట్టాలని చూసినా ఆయనిచ్చిన, చెప్పిన మాట ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేస్తాననే మాటపైనే నిలబడ్డారన్నారు. 50 శాతానికి పైగా మహిళలకు స్థానం కల్పించారన్నారు. 58 శాతం బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహనరెడ్డి అయితే కళ్ళు లేని కబోదులు వాటన్నింటినీ కన్పించకుండా చేయాలని పనికిమాలిన విషయాలను తెరమీదకు తెచ్చి రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్, వైఎస్సార్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ వంటి అనేక మంది మహనీయులు దేశం కోసం, రాష్ట్రం కోసం అనేక కలలు కన్నారన్నారు. చంద్రబాబు అయితే ఎన్టీఆర్ పెట్టిన పార్టీని వెన్నుపోటు పొడిచి, ఆయనను చంపి, పార్టీని కొట్టేశారన్నారు. మహిళలకు ఆస్థిలో సమాన హక్కు 33 శాతం రిజర్వేషన్లను ఎన్టీఆర్ తీసుకువచ్చారని, మహిళలను తెలుగింటి ఆడపడుచులుగా గౌరవించగా వీటన్నింటికీ చంద్రబాబు తిలోదకాలిచ్చారన్నారు. కార్పోరేషన్ పదవులు, సంక్షేమ కార్యక్రమాల అమల్లో మహిళలకు 50 శాతం అవకాశాలను కల్పించి వారికి జగన్మోహనరెడ్డి న్యాయం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ కు కూడా జగన్మోహనరెడ్డి వారసుడిగా నిలిచాడన్నారు. రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనలో భాగంగా రైతులు, బడుగు, బలహీన వర్గాల కోసం జగన్మోహనరెడ్డి పాటుపడుతున్నారన్నారు. గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి గ్రామంలోనూ సచివాలయాన్ని ఏర్పాటు చేసి అదే గ్రామంలోనే సచివాలయం ద్వారా సేవలందిస్తూ గాంధీజీ కన్న కలలను జగన్మోహనరెడ్డి నిజం చేశారన్నారు. అట్టడుగు, బలహీన వర్గాలను పైకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లను తీసుకువచ్చారని, సీఎం జగన్మోహనరెడ్డి కూడా అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్నింటా స్థానం కల్పించారన్నారు. తన కేబినెట్లో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులిచ్చారని, వాటిలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించారని, మహిళకు కూడా స్థానం కల్పించారన్నారు. దాదాపు 56 శాతం అట్టడుగు వర్గాలకు కేబినెట్ లో స్థానం లభించిందని మంత్రి కొడాలి నాని చెప్పారు.
addComments
Post a Comment