నామినేటెడ్ పదవుల భర్తీలోనూ సామాజిక న్యాయం పాటించిన సీఎం జగన్మోహనరెడ్డి
- నామినేటెడ్ పదవుల భర్తీలోనూ సామాజిక న్యాయం పాటించిన సీఎం జగన్మోహనరెడ్డి - రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 

- మర్యాదపూర్వకంగా కలిసిన తాతినేని, పడమట గుడివాడ, జూలై 21 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ సీఎం జగన్మోహనరెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులకు కేటాయించి సామాజిక న్యాయం పాటించారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్ పర్సన్ గా నియమితులైన తాతినేని పద్మావతి మంత్రి కొడాలి నానిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్ఛాన్ని అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాతినేని పద్మావతి మాట్లాడుతూ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిందన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని, ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ గా నియమితులైన గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలానికి చెందిన పడమట సుజాత మంత్రి కొడాలి నానిని కలవడం జరిగింది. రెండవ సారి డైరెక్టర్ గా తనను కొనసాగించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి, మంత్రి కొడాలి నానికి, వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమానికి బ్యాంక్ ద్వారా తనవంతు సేవలందిస్తానని పడమట సుజాత చెప్పారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులు దక్కాయన్నారు. 13 జిల్లాల్లోని ఏ జిల్లాలో కూడా 50 శాతం తగ్గకుండా పదవులు వచ్చాయన్నారు. మొత్తం 137 కార్పోరేషన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 79 పదవులను కేటాయించడం జరిగిందన్నారు. మహిళలకు 69 పదవులు దక్కాయని చెప్పారు. మహిళలకు రాజకీయంగా సాధికారత కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి చెప్పిన మాటలను చేతల్లో చేసి చూపించారన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం ఇంత పెద్దఎత్తున కార్పోరేషన్ పోస్టులను భర్తీ చేయలేదని చెప్పారు. ఈ భర్తీని సీఎం జగన్మోహనరెడ్డి స్వయంగా చేపట్టారని తెలిపారు. కార్పోరేషన్ పదవుల భర్తీతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన వారందరికీ సముచిత న్యాయం జరిగిందన్నారు. త్వరలో ఆయా కార్పోరేషన్ల డైరెక్టర్ పదువులు కూడా భర్తీ కానున్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా బీసీ కులాల అభ్యున్నతికి పాటుపడతానని, కార్పోరేషన్లను ఏర్పాటు చేసి ఆయా కులాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 139 కులాలతో 56 బీసీ కార్పోరేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటికి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించడం జరిగిందన్నారు. అన్ని బీసీ కులాలు , కార్పోరేషన్లతో సమావేశాలను నిర్వహించి ఆయా కులాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీసీలందరినీ కార్పోరేషన్ల ఏర్పాటుతో సీఎం జగన్మోహనరెడ్డి ఏకతాటిపైకి తీసుకువచ్చారని చెప్పారు. గత రెండేళ్ళుగా సీఎం జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు.

Comments