*'కోవిడ్ మూడో వేవ్ ను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండండి'*
*నోడల్ అధికారులతో సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్*
అనంతపురము, జులై 23 (ప్రజా అమరావతి);
జిల్లాలో కోవిడ్-19 మూడో వేవ్ ను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని నోడల్ అధికారులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను కోవిడ్ మూడో వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు ఉపయోగించాలన్నారు. నూతనంగా ఎంపికైన నోడల్ అధికారులు తమ విధులపై సమగ్ర అవగాహన పెంచుకోవాలన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని డీఆర్సీ మీటింగ్ హాలులో కోవిడ్ నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆక్సిజన్ నిర్వహణ, కోవిడ్ టెస్టింగ్ స్ట్రాటజీ, ఫీవర్ సర్వే నిర్వహణ, ఆసుపత్రుల్లో హెల్ప్ డెస్కుల మేనేజ్ మెంట్, కోవిడ్ ఆసుపత్రుల మేనేజ్ మెంట్, హోమ్ క్వారంటైన్&హోమ్ ఐసోలేషన్ మేనేజ్ మెంట్, కాంటాక్ట్ ట్రేసింగ్, కంటైన్ మెంట్ జోన్ల ఏర్పాటు, కోవిడ్ కేర్ సెంటర్స్ మేనేజ్ మెంట్, 104 కాల్ సెంటర్ మేనేజ్ మెంట్, సిబ్బంది నిర్వహణ, కోవిడ్ ను ఎదుర్కునేందుకు కావాల్సిన మెటీరియల్, కోవిడ్ పై అవగాహన ప్రచార కార్యక్రమాలు, బయో మెడికల్ ఎక్విప్ మెంట్ మేనేజ్ మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్, కోవిడ్ మృతుల మేనేజ్ మెంట్, కమాండ్ కంట్రోల్ రూమ్, సీసీటీవీల పర్యవేక్షణ, సిబ్బందికి అందించాల్సిన ట్రైనింగ్ సెషన్స్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో జిల్లా కలెక్టర్ పై అంశాలపై పలు సూచనలు చేశారు.
*ఆక్సిజన్ సప్లై నిర్వహణ*
• కోవిడ్ మొదటి వేవ్, రెండో వేవ్ సమయంలో కంటే ప్రస్తుతం జిల్లాలో ఆక్సిజన్ కెపాసిటీ గణనీయంగా పెరిగింది. మూడో వేవ్ వస్తే ఆ మేరకు ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీ మీద ఒత్తిడి కూడా పెరుగుతుంది.
• రానున్న రోజుల్లో ఆసుపత్రుల్లో కొత్తగా ఏర్పాటు చేసే ప్రతి 100 పడకలలో కనీసం 50 ఆక్సిజన్ పడకలు ఉండనున్నాయి.
• మూడో వేవ్ లో గ్రామ స్థాయిలో కూడా ఆక్సిజన్ కాంసెంట్రేటర్ల ద్వారా ఆక్సిజన్ అందించనున్నాం. కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లలోనూ ఆక్సిజన్ పైపులైన్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉండాలనేది ప్రభుత్వం ఆలోచన. ఆ మేరకు ఆక్సిజన్ సప్లై మేనేజ్ మెంట్ లో ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మానిటరింగ్ కమిటీ మీద ఉంటుంది.
• సప్లయర్స్ నుంచి లిక్విడ్ ఆక్సిజన్ రవాణా, డిస్ట్రిబ్యూషన్, పైపులైన్ మేనేజ్ మెంట్, ఆసుపత్రుల్లో వెంటిలేటర్ మేనేజ్ మెంట్, సిబ్బంది నిర్వహణ తదితర అంశాలను పర్యవేక్షించండి.
*టెస్టింగ్*
• రానున్న రోజుల్లో ర్యాపిడ్ టెస్టులు ఉండవు. కేవలం ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది.
• టెస్టుల సంఖ్య సగటున రోజుకు కనీసం 10,000 కు పెంచాలి.
• నూతన టెస్టింగ్ స్ట్రాటెజీలో భాగంగా రద్దీగా ఉండే మార్కెట్లు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, సరిహద్దు ప్రాంతాల వద్ద టెస్టుల సంఖ్య పెంచాలి. కోవిడ్ ను వ్యాప్తి చేసేందుకు ఎక్కువ అవకాశం ఉన్న రంగాల్లో పని చేసే వారికి ఎక్కువ టెస్టులు నిర్వహించాలి.
• టెస్టు ఫలితాల వెల్లడిలో వేగం పెరగాలి. 12 నుంచి 24 గంటల్లోగా టెస్టు ఫలితాలు రావాలి.
• సచివాలయాల వారీగా ప్రాంతాలను విభజించి, ఎక్కువ కేసులు నమోదవుతున్న సచివాలయాల పరిధిలో మరియు వ్యాక్సినేషన్ తక్కువగా జరిగిన ప్రాంతాల్లో ఎక్కువ టెస్టులు నిర్వహించాలి.
• ఫీవర్ సర్వే పకడ్బందీగా చేపట్టాలి. ప్రస్తుతం కూడా ఫీవర్ సర్వేలో జ్వర లక్షణాలు ఉన్నవారి దగ్గర శాంపిల్ తీసుకోవాలి. ఫీవర్ క్లినిక్కులలోనూ జ్వర లక్షణాలు ఉన్నవారితో ఖచ్చితంగా కోవిడ్ శాంపిల్ తీసుకోవాలి.
• క్షేత్ర స్థాయిలో టెస్టులు ఉదయాన్నే ప్రారంభించి శాంపిళ్లను తొందరగా టెస్టు ల్యాబుల వద్దకు చేర్చాలి.
• టెస్టులు వేగవంతం చేసేందుకు హిందూపూర్, గుంతకల్లు ప్రాంతాల్లో రెండు టెస్టింగ్ ల్యాబులను ఏర్పాటు రానున్నాయి.
*హెల్ప్ డెస్క్ మేనేజ్ మెంట్*
• హెల్ప్ డెస్కుల వద్ద పని చేస్తున్న వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వాలి
• నోడల్ ఆఫీసర్లకు, హెల్ప్ డెస్కుల వద్దనున్న సిబ్బందికి సమన్వయం పెరగాలి.
• హెల్ప్ డెస్కులు ప్రతి ఆసుపత్రిలో రోగులు ప్రవేశించిన వెంటనే కనిపించేలా చూడాలి.
• ముఖ్యంగా ప్రయివేటు ఆసుపత్రుల్లో హెల్ప్ డెస్కులను ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలి
• హెల్ప్ డెస్కు వద్దకు బాధితులు వచ్చిన పది నిమిషాలలో ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలి
*కోవిడ్ ఆసుపత్రుల నిర్వహణ*
• వైఎస్సార్ హెల్త్ కార్డు, ఆరోగ్యశ్రీ సమస్యలు రాకుండా చూడాలి.
• ఇప్పటినుంచే నోడల్ అధికారులు తమ పరిధిలో ఉన్న ఆసుపత్రులను ఒక్కసారైనా సందర్శించడం అలవాటు చేసుకోవాలి.
• మూడో వేవ్ పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పిల్లల వైద్యం కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలి.
• కోవిడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా ఆస్పత్రుల నోడల్ అధికారులకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలను పరిస్థితిలో సానుకూల మార్పులు తీసుకు వచ్చేందుకు ఉపయోగించాలి.
*హోమ్ క్వారంటైన్ & హోమ్ ఐసోలేషన్*
• కోవిడ్ బాధితులకు హోమ్ క్వారంటైన్ లేదా హోమ్ ఐసోలేషన్ అత్యుత్తమంగా పని చేస్తుంది.
• అనవసర భయాలతో ఆసుపత్రికి రావడం వల్ల ఆసుపత్రుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఏమవుతుందో అనే భయంతో బాధితులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
• 'అవసరం అనిపిస్తేనే ఆసుపత్రి' అనే సందేశం ప్రజల్లోకి వెళ్లాలి.
• ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్ లు పర్యవేక్షించాలి. వారికి సకాలంలో ఐసోలేషన్ అందించాలి.
• హోమ్ క్వారంటైన్, ఐసోలేషన్ పేరుతో బయట కలియ తిరుగుతూ ఇతరులకు వ్యాప్తి చేయకుండా కోవిడ్ బాధితులను కట్టడి చేయాలి.
*కాంటాక్ట్ ట్రేసింగ్*
• ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ట్రేసింగ్ పక్కాగా నిర్వహించాలి
• కేసులు తక్కువగా ఉన్న సమయంలోనే నిర్లక్ష్యం వస్తే సెకండ్ వేవ్ లాంటి పరిస్థితులు వస్తే పరిస్థితి ఇబ్బంది కరంగా ఉంటుంది.
• కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అవసరమైతే మైక్రో లెవెల్లో మళ్లీ కంటైన్ మెంట్ జోన్లు ప్రకటిస్తాం.
• గతంలోలాగా కేసులు నమోదైన ప్రాంతాల్లో క్లోరినేషన్ వంటి కార్యక్రమాలు కొనసాగించండి.
*గ్రామాల్లో కోవిడ్ కేర్ సెంటర్లు, ఐసోలేషన్ సెంటర్లు*
• కోవిడ్ మేనేజ్ మెంట్ వికేంద్రీకరణ జరగనుంది.
• మూడో వేవ్ లో విలేజ్ ఐసోలేషన్ సెంటర్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. గతంలోలాగా కాలేజీలు, పెద్ద పెద్ద స్కూళ్లు కోవిడ్ కేర్ సెంటర్లుగా కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు.
• తిరిగి పాఠశాలలు ప్రారంభించనున్నందున గ్రామ స్థాయిలో ఐసోలేషన్ కేంద్రాలుగా ఉండాల్సిన భవనాలను ముందుగానే రిజర్వ్ చేసి ఉంచుకోండి.
• గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసే కోవిడ్ కేర్ సెంటర్లు, ఐసోలేషన్ కేంద్రాల్లో అందించాల్సిన వసతులపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కేర్ సెంటర్ల సంఖ్య ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ పర్యవేక్షణ అవసరం. నిర్వహణ సమస్యలు తలెత్తకుండా చూడాలి. రోగులకు ఆహారం, వైద్యం కేంద్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
• కోవిడ్ లక్షణాలు తీవ్రంగా లేని వారిని మాత్రమే విలేజ్ ఐసోలేషన్ సెంటర్లలో ఉంచాలి.
*104 కాల్ సెంటర్లు*
• ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 104 కి ఫోన్ చేసిన మూడు గంటల్లోగా ఆసుపత్రిలో పడక అందించేలా కాల్ సెంటర్ పని చేయాలి.
• మండల స్థాయికి 104 కాల్ సెంటర్ నిర్వహణ వికేంద్రీకరణ జరగనుంది.
• కాల్ సెంటర్లలో ఫోన్లు రిసీవ్ చేసుకునే సిబ్బంది వ్యవహార శైలి సున్నితంగా ఉండేలా చూడాలి.
అదే విధంగా కోవిడ్ మూడో వేవ్ ను ఎదుర్కునేందుకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పిల్లలకు వైద్యం అందించే పీడీయాట్రిషియన్లు, సంరక్షకులను తక్కువ కాకుండా చూసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు కోవిడ్ ను ఎదుర్కునేందుకు కావాల్సిన నిధులు, మందులు, మాస్కులు, పరికరాలు వంటి సామాగ్రి గురించి వాస్తవిక అంచనాలు వేసుకుని ప్రభుత్వాన్ని కోరాలన్నారు. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత బాగా తక్కువగా ఉన్నందున ఈ సమయాన్ని సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చేందుకు వినియోగించాలన్నారు. కోవిడ్ ద్వారా మరణించిన వారి కుటుంబాలను అంబులెన్స్ లు అధిక చార్జీల బారిన పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. మృతులను బాధిత కుటుంబాలకు అందించడంలో కోవిడ్ ప్రోటోకాల్ పారించాలన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్లు ఏ.సిరి, నిశాంతి, గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ మరియు నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment