సచివాలయంలో స్వచ్ఛంధ్ర కార్పోరేషన్ (రూరల్, అర్భన్) సమన్వయ కమిటీ సమావేశం.
అమరావతి (ప్రజా అమరావతి);


*- సచివాలయంలో స్వచ్ఛంధ్ర కార్పోరేషన్ (రూరల్, అర్భన్) సమన్వయ కమిటీ సమావేశం*


*- సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలకశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ*

*-  జగనన్న స్వచ్ఛసంకల్పం, క్లాప్‌ కార్యక్రమాల పై  సమీక్ష*


ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ చేతుల మీదిగా ఆగస్టు 15న జగనన్న స్వచ్ఛసంకల్పం, క్లాప్‌ కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించేందుకు  అన్ని ఏర్పాట్లు  చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలకశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతి లోని సచివాలయంలో స్వచ్ఛంధ్రా కార్పోరేషన్ (రూరల్, అర్భన్) సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఈ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ....

 

గ్రామీణ ప్రజల ఆరోగ్య ప్రమాణాలు మరింత మెరుగుపడాలనే లక్ష్యంతో సీఎం శ్రీ వైయస్ జగన్ కృషి చేస్తున్నారని, మెరుగైన పారిశుధ్యంతోనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో మనం-మన పరిశుభ్రత పేరుతో ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 1320 గ్రామాల్లో మొదటి దశ, 4737 గ్రామాల్లో రెండో విడత లోనూ మనం-మన పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించామని, దానివల్ల మొత్తం 680 గ్రామాలు ఓడిఎఫ్‌ ప్లస్‌ స్థాయికి వచ్చాయని వెల్లడించారు. పారిశుధ్యం పట్ల ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలని, అందుకు ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రజల్లో అవగాహనను పెంచడం ద్వారా ఆరోగ్యకర వాతావరణాన్ని సాధించాలని కోరారు. మొదటి విడత కింద పరిశుభ్రతా పక్షోత్సవాలను గత ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు, వ్యర్థాలపై వ్యతిరేక పోరాటంను గత ఏడాది డిసెంబర్ 7 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించామని తెలిపారు. ఈ రెండు విడతల్లోనూ మొత్తం 61,514 గ్రామాల్లో పారిశుధ్య, తాగునీటి సమస్యలను పరిష్కరించడం జరిగిందని అన్నారు. రెండు దశల్లోనూ గ్రామపంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు ప్రజలు, ప్రజాప్రతినిధులు రూ.7.79 కోట్లు స్వచ్ఛందంగా విరాళాలుగా ఇచ్చారని అన్నారు. జాతీయ సర్వేలో మొదటి, రెండో విడత మనం-మన పరిశుభ్రత అమలు చేసిన గ్రామాల్లో గతంతో పోలిస్తే మలేరియా, టైఫాయిడ్, డెంగూ వంటి వ్యాధులు 95 శాతం తగ్గాయనే నివేదికలు వచ్చాయని అన్నారు. దేశంలోనే 680 గ్రామాల్లో ఓడిఎఫ్‌ ప్లస్ స్థాయి సాధించిన రాష్ట్రంగా ఎపి మొదటిస్థానంలో నిలిచిందని, అలాగే ఓడిఎఫ్‌ ప్లస్ బేస్‌లైన్ అసెస్‌మెంట్ సర్వే పూర్తి చేయడంలో ఎపి దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచిందని అన్నారు. గ్రామస్థాయి సిబ్బంది, వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు అందరినీ కలుపుకుని గ్రామ సర్పంచ్‌ల ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కోరారు. 


*రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ....*

స్వచ్చమైన గ్రామాలు, పరిశుభ్రమైన పట్టణాలు, నగరాలే లక్ష్యంగా ప్రభుత్వం క్లాప్, స్వచ్ఛసంకల్పం కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. పరిశుభ్రమైన నగరాలు, పట్టణాల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సీఎం శ్రీ వైయస్ జగన్ ఈ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1.20 కోట్ల డస్ట్‌బిన్‌లను ప్రజలకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలాగే అన్ని అర్భన్, రూరల్ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాల కోసం అవసరమైన పరికరాలను, సదుపాయాలను కల్పిస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా 3100 డీజిల్, పెట్రోల్, సిఎన్‌జి ఆటోలు, 1546 ఈ ఆటోలు (అర్బన్‌), 1000 ఆటో టిప్పర్లు (రూరల్), 6417 ఇన్సినేటర్లు, ఇతర పరికరాలను స్వచ్ఛంధ్ర కార్పోరేషన్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రతి వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, స్థానిక ప్రజాప్రతినిధులను దీనిలో భాగస్వాములను చేయాలని కోరారు. 


ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్‌ కమిషనర్ గిరిజాశంకర్, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ఎండి పి.సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments