ఆగస్టు 15న వంద గ్రామాల్లో ప్రాపర్టీ కార్డుల పంపిణీ

 




ఆగస్టు 15న వంద గ్రామాల్లో ప్రాపర్టీ కార్డుల పంపిణీ


అక్టోబర్ 2న వెయ్యి గ్రామాల్లో ప్రాపర్టీ కార్డుల జారీ


అమరావతి (ప్రజా అమరావతి);


సచివాలయంలో వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు,  భూరక్ష పథకం అమలుపై కేబినెట్ సబ్ కమిటీ కన్వీనర్ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ ధర్మాన కృష్ణదాస్, మున్సిపల్ శాఖా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణలు పాల్గొని పథకం అమలుపై అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర సర్వే, భూయజమానులకు యాజమాన్య హక్కు కార్డుల జారీ తదితర అంశాలపై మంత్రుల కమిటీ అధికారులతో చర్చించింది.


వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వంద గ్రామాల్లో గ్రామకంఠం పరిధిలో అర్హులైన వారికి భూయాజమాన్య హక్కుతో కూడిన కార్డులను జారీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి వెయ్యి గ్రామాల్లో ఓనర్ షిప్ సర్టిఫికేట్ల జారీకి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్, ఆర్ఓఆర్ చట్టాలకు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ కూడా జారీ చేసిందని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలోని 51 రెవెన్యూ మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి, డ్రోన్లు, రోవర్లు, కోర్ సబ్ స్టేషన్ల ద్వారా సర్వే నిర్వహిస్తున్నామని అధికారులు వివరించారు. ఇప్పటికే సర్వే ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 70 కోర్ సర్వే సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు తాడేపల్లిగూడెంలో పైలెట్ ప్రాజెక్ట్ గా అర్బన్ లోనూ సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నామని, మున్సిపాలిటీలో సర్వే ప్రక్రియ ద్వారా ఎస్ఓపిలను రూపొందించి, రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని అధికారులు తెలిపారు. అలాగే ప్రస్తుతం 206 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతోందని, 71 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యిందని అన్నారు. 762 గ్రామాలకు సంబంధించిన విలేజ్ మ్యాప్ లు సిద్దంగా ఉన్నాయని అన్నారు.


దేశవ్యాప్తంగా స్వామిత్వ పథకం అమలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సర్వే ఆఫ్ ఇండియా కేవలం ఆరు డ్రోన్ లను మాత్రమే కేటాయించిదని అధికారులు మంత్రుల కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. సకాలంలో సమగ్ర భూసర్వేను పూర్తి చేయాలంటే కనీసం 51 డ్రోన్ లు అవసరమవుతాయని తెలిపారు. దీనిపై మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలోని డ్రోన్ కార్పోరేషన్ ద్వారా అవసరమైన డ్రోన్ లను సమకూర్చుకునేందుకే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సర్వేయర్లు, సెర్ప్ విభాగంలో ఉన్న కమ్యునిటీ సర్వేయర్లను కూడా సర్వే ప్రక్రియలో భాగస్వాములను చేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని, మొత్తం ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఎంత సమయం పడుతుందో అధ్యయనం చేయాలని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సర్వే రాళ్ళకు సంబంధించిన గుంతలు తవ్వడం, జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టడం ద్వారా పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్ళాలని సూచించారు. గ్రామకంఠం సమస్యపై ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా ఉందని, ఎక్కడా పొరపాట్లు లేకుండా యాజమాన్య హక్కు సర్టిఫికేట్లను అందిచే ప్రక్రియపై దృష్టి సారించాలని అన్నారు. మంత్రులు శ్రీ ధర్మాన కృష్ణదాస్,  శ్రీ బొత్స సత్యనారాయణలు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం భూరికార్డులను ఆధునీకరించే ఈ ప్రక్రియను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, దీనిలో ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని కోరారు. అందుకు గానూ అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. 


ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సిసిఎల్‌ఎ నీరభ్ కుమార్ ప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) ఉషారాణి,  పిఆర్‌ అండ్ ఆర్డీ కమిషనర్ గిరిజాశంకర్, సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ సిద్దార్ధ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎంఎం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Comments