టోక్యో ఒలింపిక్స్-2020 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం

 


అమరావతి (ప్రజా అమరావతి);



టోక్యో ఒలింపిక్స్-2020 మహిళల  బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ సింధుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. 'సింధు సాధించిన విజయం దేశానికే గర్వకారణం. ఆమె విజయంతో దేశం మొత్తం పులకిస్తోంది. ప్రపంచ క్రీడాపటంలో భారత్ పేరు నిలబెట్టిన సింధు తెలుగు బిడ్డ కావడం గర్వకారణం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఔత్సాహిక క్రీడకారులెందరికో మార్గదర్శిగా నిలవాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పందిస్తూ.. 'సింధు సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఒలింపిక్స్ లో పతకం సాధించడం ప్రతి క్రీడాకారుల కల. ఆ కలను నిజం చేసుకున్న సింధుకు హృదయపూర్వక అభినందనలు. వరుసగా తాను ఆడిన రెండో ఒలింపిక్స్ లో కూడా పతకం సాధించి భారత్ ఘనకీర్తిని చాటిన సింధు తెలుగు బిడ్డ కావడం సంతోషించే విషయం. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

ఆదివారం కాంస్య పతకం కోసం జరిగిన పోరులో చైనాకు చెందిన హి బింగ్జియావో పై 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి భారత్ కు ఈ ఒలింపిక్స్ లో రెండో పతాకం అందించింది. 2016 రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన సింధు.. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించింది. వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్ లో పతకం సాధించడం ద్వారా సింధు భారతీయ బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.




Comments