*ముమ్మరంగా కోవిడ్ టీకాల కార్యక్రమం*
*ఒక్క రోజులో 22వేల మందికి టీకాలు*
*క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన జిల్లా అధికారులు*
*45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయడంలో సక్సెస్*
*జిల్లా కలెక్టర్ చొరవతో కోవిడ్ టీకాల కార్యక్రమంలో జిల్లా ముందంజ*
*వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేసిన వారిని అభినందించిన కలెక్టర్*
విజయనగరం, ఆగష్టు 08 (ప్రజా అమరావతి); జిల్లాలో కోవిడ్ నియంత్రణే లక్ష్యంగా 45 ఏళ్లకు పైబడి వున్న వారందరికీ టీకాలు వేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ దిశగా ముందుకు సాగుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించే కృషిలో భాగంగా ఇప్పటివరకు టీకాలు వేయించుకోకుండా మిగిలిన వారిని గుర్తించి వారందరికీ టీకాలు వేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఆదివారం పెద్ద ఎత్తున టీకాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్‌లో ఆదివారం నాడు జాయింట్ కలెక్టర్‌లు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేకాధికారులు, ఎంపిడిఓలు, వైద్యాధికారులు గ్రామాల్లో పర్యటించి అపోహలతో వ్యాక్సిన్ వేయించుకొనేందుకు నిరాకరిస్తున్న వారి ఇళ్లకు వెళ్లి వారి ఇళ్ల వద్దనే ఆరోగ్య కార్యకర్తలతో టీకాలు వేయించారు. జిల్లా స్థాయి అధికారులంతా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం నుంచే గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను చైతన్య పరచడంతో ఒకే రోజులో 20వేల మందికి పైగా టీకాలు వేయించగలిగారు.
జిల్లాలో ఈనెల 5వ తేదీ నాటికి 45 ఏళ్లకు పైబడి వయస్సు కలిగిన వారిలో 1.39 లక్షల మంది ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవలసి వుందని జిల్లా యంత్రాంగం గుర్తించింది. జిల్లాలో కరోనా నియంత్రించాలంటే వీరందరికీ శతశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి లక్ష్యంగా నిర్ణయించి ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఆగష్టు 6న చేపట్టారు. దీనిలో భాగంగా 6, 7 తేదీల్లో గ్రామీణ ప్రాంతాల్లో 40 వేల మందికి వ్యాక్సిన్ వేయగలిగారు. పట్టణ ప్రాంతాల్లో 11 వేల మందికి గత రెండు రోజుల్లో వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని మరింత ముమ్మరంగా చేపట్టి మూడో వేవ్ జిల్లాకు దరి చేరకుండా చూసే లక్ష్యంతో వరుసగా మూడో రోజైన ఆదివారం కూడా జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పర్యవేక్షణలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు.
6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు గత మూడు రోజులుగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ద్వారా జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేయించుకోకుండా మిగిలిన 16,364 మందిలో 14,806 మందికి వ్యాక్సిన్ వేసి 98.50 శాతం లక్ష్యాన్ని చేరుకోగలిగారు. 6న 8472 మందికి, 7న 3789 మందికి, 8న సాయంత్రం 6 గంటల వరకు 4784 మందికి వ్యాక్సిన్ వేయించగలిగారు.
ఇక గ్రామీణ ప్రాంతాల్లో 6, 7 తేదీలు రెండు రోజుల్లో 40వేల మందికి వ్యాక్సిన్ వేయగా 8వ తేదీన ఒక్క రోజులో సాయంత్రం 6 గంటల వరకు సుమారు 18 వేల మందికి వ్యాక్సిన్ వేశారు.
జాయింట్ కలెక్టర్లు తమ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ నగరంలోని రెవిన్యూ కాలనీ వార్డు సచివాలయంలో పర్యటించి కోవిడ్ వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు.
జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) డా.ఆర్.మహేష్ కుమార్ భోగాపురం మండలం ముక్కాంలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు సాలూరు నియోజకవర్గం అంతా కలియ తిరిగి వ్యాక్సిన్ వేయించుకొనేందుకు నిరాకరిస్తున్న వారి ఇళ్లకు వెళ్లి వారిని చైతన్య పరచి ఇంటి వద్దే వారికి వ్యాక్సిన్ వేయించారు. పాచిపెంట మండలం పాంచాలి, సాలూరు మండలం మరిపల్లి, ఎం.మామిడిపల్లి, మునిసిపాలిటీలోని డబ్బీ వీధి, బంగారమ్మ కాలనీ తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా పర్యటించి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేయించారు.
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణకుమారి డెంకాడ, పోలిపల్లి, నగరంలోని దాసన్నపేట ప్రాంతాల్లో ఇళ్లకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోని వారికి కౌన్సిలింగ్ చేశారు.
జిల్లాలోని నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు, మండల ప్రత్యేకాధికారులు, ఎంపిడిఓలు, వైద్యాధికారులంతా తమ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. వీరందరి కృషి కారణంగా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో మూడు రోజుల్లోనూ 58 వేల మందికి వ్యాక్సినేషన్ చేయగలిగారు. గ్రామీణ ప్రాంతాల్లో 50శాతం పైగా లక్ష్యాన్ని చేరుకోగలిగారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన జిల్లా అధికారులు, వైద్యాధికారులు, ఎంపిడిఓలు, వైద్య సిబ్బంది అందరికీ కలెక్టర్ ఏ.సూర్యకుమారి అభినందించారు. కోవిడ్ నియంత్రణ దిశగా ఇదో పెద్ద ముందడుగు అని పేర్కొన్నారు.
addComments
Post a Comment