24 న రూ. 20 వేల లోపు డిపాజిట్లు కట్టిన అగ్రి బాధితులకు డబ్బులు చెల్లిస్తున్నాం

  


- 24 న రూ. 20 వేల లోపు డిపాజిట్లు కట్టిన అగ్రి బాధితులకు డబ్బులు చెల్లిస్తున్నాం 


- కృష్ణా జిల్లాలో 91 వేల 589 మంది బాధితులు 

- బాధితుల అకౌంట్లకు రూ. 82.46 కోట్ల జమ 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 



గుడివాడ, ఆగస్టు 23 (ప్రజా అమరావతి): రూ. 20 వేల లోపు డిపాజిట్లు కట్టిన అగ్రిగోల్డ్ బాధితులకు ఈ నెల 24 వ తేదీన డబ్బులు చెల్లిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ప్రజాసంకల్ప యాత్ర సమయంలో వైఎస్ జగన్మోహనరెడ్డిని అగ్రిగోల్డ్ డిపాజిటర్లు కలిసి తమకు న్యాయం చేయాలని కోరారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. దీనిలో భాగంగా 2019-20 బడ్జెట్ లో రూ. 1,150 కోట్లు కేటాయించారన్నారు. రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లించేందుకు రూ. 263. 99 కోట్లను విడుదల చేశారన్నారు. దాదాపు 94 శాతం మంది బాధితులకు చెల్లింపులు జరిగాయన్నారు. రూ.20 వేల లోపు డిపాజిట్లు కట్టిన వారికి కూడా డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం హైకోర్టు అనుమతి తీసుకుని చెల్లింపుల ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం ఆదేశించారన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ రాష్ట్రంలో 32 లక్షల మంది డిపాజిటర్ల నుండి రూ. 6,380 కోట్లు సేకరించి మోసం చేసిందన్నారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చెల్లింపులు జరిపి, హైకోర్టు నియమించిన జిల్లా స్థాయి కమిటీల ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ ఆస్థులను అమ్మగా వచ్చిన డబ్బును ప్రభుత్వం తిరిగి తీసుకునేలా సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు ఎవరూ ఆందోళనకు గురికావద్దని సూచించారు. గ్రామ, వార్డు వాలంటీర్ల సహకారంతో బాధితుల ఇంటి దగ్గరే ఈ నెల 19 వ తేదీ వరకు నమోదు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 7 లక్షల 76 వేల దరఖాస్తులకు వెరిఫికేషన్ పూర్తయిందన్నారు. రూ.10 వేల లోపు డిపాజిట్ దారుల్లో మిగిలిన దరఖాస్తులను కూడా తీసుకోవడం జరిగిందన్నారు. కృష్ణాజిల్లాలో రూ . 20 వేల లోపు డిపాజిట్లు కట్టిన బాధితులు 91 వేల 589 మంది ఉన్నారని, వీరికి ఈ నెల 24 వ తేదీన రూ. 82 కోట్ల 46 లక్షల 86 వేల 728 ల నగదును బాధితుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తోందన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని, ఇందులో ఎటువం తావులేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాటను సీఎం జగన్మోహనరెడ్డి నిలబెట్టుకుంటున్నారని మంత్రి కొడాలి నాని చెప్పారు.

Comments