- జగనన్న స్మార్ట్ టౌన్ పథకానికి గుడివాడ పట్టణంలో 4 వేల దరఖాస్తులు
- మధ్యతరగతి ప్రజల కోసం ఇళ్ళస్థలాలు 400 ఎకరాల భూములను సేకరిస్తున్నాం
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, ఆగస్టు 31(ప్రజా అమరావతి) : సీఎం జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న స్మార్ట్ టౌన్ పథకానికి గుడివాడ పట్టణంలో దాదాపు 4 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో సరసమైన ధరలకే ప్లాట్ల పథకం జగనన్న స్మార్ట్ పథకానికి సంబంధించి వచ్చిన దరఖాస్తులు, భూసేకరణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై మంత్రి కొడాలి నాని మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 30.70 లక్షల మంది పేదలకు ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ఇళ్ళపట్టాలను అందజేసిందన్నారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో జగనన్న స్మార్ట్ పథకానికి సీఎం జగన్మోహనరెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. మొదటి విడతగా జిల్లాలో మచిలీపట్నం కార్పోరేషన్ తో పాటు గుడివాడ మున్సిపాలిటీని ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. రూ.3 లక్షల నుండి రూ. 18 లక్షల లోపు సంవత్సర ఆదాయం కల్గిన వారంతా ఈ పథకం కింద అర్హులని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఎంపికైన లబ్ధిదారుల వార్షిక ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని 150, 200, 250 చదరపు గజాల విస్తీర్ణం కల్గిన ఫ్లాట్లను కేటాయిస్తామన్నారు. గుడివాడ పట్టణంలో జగనన్న స్మార్ట్ టౌన్ పథకానికి మధ్యతరగతి ప్రజల నుండి 4 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. వీరికి ప్లాట్లను కేటాయించేందుకు గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడు పరిధిలో దాదాపు 400 ఎకరాల భూములను సేకరిస్తున్నామన్నారు. ఇప్పటికే ఆయా భూములను జిల్లా కలెక్టర్ జే నివాస్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి పలుమార్లు పరిశీలించి ఎంపిక చేశామన్నారు. రైతులతో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు. రైతులు, ఫ్లాట్లు కొనుగోలు చేసే లబ్ధిదారులకు నష్టం లేకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేశామన్నారు. గుడివాడ పట్టణానికి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఎటువంటి సౌకర్యాలు లేని చోట అనధికారిక లేఅవుట్లు వేసి గజం రూ. 10 వేల వరకు అమ్ముతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో జగనన్న స్మార్ట్ టౌన్ పథకం ద్వారా గజం రూ. 4 వేలకే లభించే అవకాశం ఉంటుందన్నారు. భూసేకరణ అనంతరం వైఎస్సార్ జగనన్న మోడల్ కాలనీలను నిర్మిస్తామన్నారు. విశాలమైన రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. కమ్యూనిటీ హాలు, పాఠశాల భవనం, ఆరోగ్య కేంద్రం, షాపింగ్ సెంటర్, బ్యాంక్, మార్కెట్ వాకింగ్ ట్రాక్, పిల్లల ఆటస్థలం, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కూడా సమకూరతాయన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో జగనన్న స్మార్ట్ టౌన్ పథకానికి సంబంధించి 3.94 లక్షల ఫ్లాట్లకు డిమాండ్ ఉందని తెలిపారు. వచ్చే విజయదశమి నాటికి ఈ పథకానికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేయాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించినట్టు చెప్పారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను కూడా సీఎం జగన్మోహనరెడ్డి నెరవేర్చుతున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు.
addComments
Post a Comment