గత రెండేళ్ళుగా పాలనలో అనేక సంస్కరణలను తీసుకువచ్చిన సీఎం జగన్మోహనరెడ్డి

 



- గత రెండేళ్ళుగా పాలనలో అనేక సంస్కరణలను తీసుకువచ్చిన సీఎం జగన్మోహనరెడ్డి 


- పంటలను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తున్నాం 

- 24 గంటల్లో ఎరువులు, విత్తనాలను అందజేస్తున్నాం 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 



గుడివాడ, ఆగస్టు 4 (ప్రజా అమరావతి): ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి గత రెండేళ్ళుగా పాలనలో అనేక సంస్కరణలను తీసుకువచ్చారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జే నివాస్ అధ్యక్షతన రైతు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మంత్రి కొడాలి నానిపై రైతులు పూలవర్షం కురిపించారు. వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మేకల సత్యనారాయణ మంత్రి కొడాలి నాని పుష్పగుచ్ఛాన్ని అందజేసి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటిని సత్వరమే పరిష్కరించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో కృష్ణాజిల్లాలో రైతు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహనరెడ్డి గత రెండేళ్ళుగా పాలనలో అనేక సంస్కరణలను తీసుకువచ్చారని చెప్పారు. ముఖ్యంగా రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులు ఏ రకమైన పంట పండించినా గిట్టుబాటు ధర కల్పిస్తున్నారని చెప్పారు. మార్కెట్లో రైతుల ఉత్పత్తులను కొనే పరిస్థితి లేనపుడు ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేయడం జరుగుతోందన్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ఉత్పత్తులను ప్రభుత్వం వేలం ద్వారా విక్రయిస్తోందన్నారు. గత ఏడాది దాదాపు రూ.1,100 కోట్లు నష్టం వచ్చిందని, ఈ నష్టాన్ని ప్రభుత్వం భరించకుంటే రైతులే నష్టపోవాల్సి వచ్చేదన్నారు. పంటకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని రైతుభరోసా ద్వారా రైతులకు అందిస్తున్నామన్నారు. విత్తనం దగ్గర నుండి పంటను అమ్ముకునే వరకు అన్నిరకాల సేవలందించేందుకు ప్రతి గ్రామంలోనూ రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వివరాలను రైతుభరోసా కేంద్రాల్లో ఆన్లైన్ లో నమోదు చేసిన 24 గంటల్లోనే వాటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి మండలం, ప్రతి నెల్లో రెండు రోజుల పాటు రైతు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. స్పందన కార్యక్రమంలో రైతులు అర్జీని అందజేస్తే సంబంధించి అధికారులు వెంటనే వివరణ ఇస్తారని, సమస్యను కూడా నిర్ణీత సమయంలో పరిష్కరిస్తారని పరిష్కరించడానికి అవకాశం లేకపోతే ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి కృషి చేసే అవకాశం ఉంటుందన్నారు. రైతు స్పందన కార్యక్రమాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొడాలి నాని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మొండ్రు సునీత, వైసీపీ నేతలు పాలడుగు రాంప్రసాద్, పెయ్యల ఆదాం, మట్టా జాన్ విక్టర్, మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి, మొండ్రు వెంకటేశ్వరరావు, వ్యవసాయ సలహా మండలి గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు మేకల సత్యనారాయణ, నందివాడ మండల అధ్యక్షుడు కొండపల్లి కుమార్ రెడ్డి, పలువురు వ్యవసాయశాఖ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments