బీసీల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం'*
*'సంక్షేమాభివృద్ధిలో కీలకంగా మారిన బీసీ సంక్షేమ శాఖ'*
*రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె సి. గోపాలకృష్ణ
అనంతపురము, ఆగస్టు 04 (ప్రజా అమరావతి);
వెనకబడిన తరగతుల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు పని చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె సి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ మహోన్నత లక్ష్య సిద్ధి కోసం వెనకబడిన తరగతుల ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు, సంక్షేమ శాఖ అధికారులు ఒక్కొక్కరు ఒక్కో సైనికుడిలా పని చేయాలన్నారు. బీసీల్లో అట్టడుగు వర్గాల వారికి అభివృద్ది-సంక్షేమ ఫలాలు అందించాలన్నారు.
స్థానిక జెడ్పీ కార్యాలయంలోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో వెనకబడిన తరగతుల సంక్షేమంపై మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముఖ్యమంత్రి నాయకత్వంలో బీసీ సంక్షేమ శాఖ కీలక శాఖగా మారిందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వంలో బ్యాక్ వర్డ్ క్యాస్ట్ లను బ్యాక్ బోన్ కులాలుగా గుర్తించడం జరిగిందన్నారు. గతంలో లక్షల్లో నిధులున్న శాఖ ద్వారా నేడు కోట్ల రూపాయల సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తున్నామన్నారు. ఒక్క అనంతపురం జిల్లాకే రూ.50 కోట్ల మేరకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా నిధులను వెనకబడిన వర్గాలకు అందించామన్నారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలను బీసీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టనున్నామన్నారు.
విద్య ద్వారానే వెనకబడిన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందగలరు అనే ఆలోచనతో ముఖ్యమంత్రి విద్యా రంగంలో విప్లవాత్మకమైన మనబడి నాడు-నేడు, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. బీసీ హాస్టళ్లు అద్దె చెలించడానికి ఇబ్బంది పడుతున్నారు అని సమాచారం ఇవ్వగానే ముఖ్యమంత్రి వెంటనే నిధులు విడుదల చేశారన్నారు.
సమకాలీన రాజకీయాల్లో ఎక్కడా కనీ వినీ ఎరుగని సంక్షేమ క్యాలెండర్ ను ప్రవేశ పెట్టి పారదర్శకంగా అమలు చేయడం ఒక్క జగన్ మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ సెల్వరాజన్, ఎమ్మెల్యే అనంత వెంకట్రామి రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశేశ్వర రెడ్డి,జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, అనంత నగర మేయర్ వసీం, వక్కలింగ కార్పొరేషన్ చైర్మన్ నళిని, సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment